Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అందర్నీ కొట్టేసి పెళ్ళికి మనం నలుగురమే తరలివెళితే ఏం శోభస్కరంగా ఉంటుంది?'' మాయాబజార్లో దుర్యోధనుడి ప్రశ్న. ''నలుగురమేంటి సుయోధనా! నీవు, నీ వెంట నీనూర్గురు తమ్ములూ వెళితే చాలదా?'' శకుని మామ జవాబు, ''అవునన్నా! అదే మన తక్షణ కర్తవ్యం!'' దుశ్శాసనుడు బలపరచడం వెంటవెంటనే జరిగిపోతాయి. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో సదరు దుష్టచతుష్టయం ఇద్దరిలో పరకాయ ప్రవేశం చేసివుంది. తక్షణ సవాలుగా కనబడే వ్యక్తులను, బృందాలను సామ దాన బేధ దండోపాయాలతో లొంగదీసుకోవడం వారికి అమూల్ 'మఖన్'తో పెట్టిన విద్య! ''మేడ్ ఇన్ గుజరాత్!'' అంటే ఆ ఇద్దరే కాదు, ఈ ఇద్దరు కూడా పుట్టి, పెరిగి, వికసించింది ఆ నేలమీదే! కాబట్టి లోక్‌సభ ఎన్నికల నాటికి గొంతెత్తే అన్ని పార్టీలనూ పాతరేసి తమ ఏకఛత్రాధిపత్యానికి లైన్‌క్లీయర్ చేసుకోవాలనేది వారి బలమైన కోరిక.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనదేశంలో ఎన్నికల సందడి మొదలైంది. పేరంటానికి పిలవగలిగే వారిని పిలుస్తు న్నారు. ఇన్నికోట్లు, అన్ని కోట్లు పెట్టుబడులు పెట్టేస్తున్నట్లు వాళ్ళు చెపుతున్నారు. వచ్చేస్తున్నట్లు వీళ్ళు చెప్పేసుకుంటున్నారు. ఇవి సాధారణ పరిస్థితుల్లో ఎన్నికల సిగల్సే కాని, ఏమూల నుండి ఎంత చిన్న విమర్శ దూసుకొచ్చినా పెద్దకర్రతోనే బాదేస్తోంది బీజేపీ. కాబట్టి ఎన్నికలొచ్చినట్టే. అది సినిమానా, మీడియానా, పౌరసమాజమా అనే దాంతో సంబంధం లేదు. చివరికి జడ్జీలను సైతం 'తుక్డే తుక్డే' గ్యాంగులో కలిపేశారు. ''మోడీ హఠావో, దేశ్ కో బచావో'' పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో ఆప్ కార్యకర్తలను కటకటాల వెనక్కి నెట్టారు. బీజేపీని సవాలు చేసిన ప్రతి ఒక్క రాజకీయపార్టీ ఈడీ దాడులో, ఐటీ దాడులో ఎదుర్కొంటోంది. సిబిఐ రాడార్‌లో చిక్కుకుని గిలగిల్లాడుతున్నాయి. కన్యాకుమారి నుండి కశ్మీర్ దాకా పాదయాత్ర తర్వాత రాహుల్‌గాంధీ ఛాతి 56×10 అంగుళాల స్థాయిలో మోడీ అండ్ కోకు కనపడుతున్నట్లుంది. 2019లో కర్నాటకలో మట్లాడిన మాటలకు ఆయనకి జైలుశిక్ష, లోక్‌సభ నుండి వెళ్ళగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికలొచ్చేసరికి రోడ్డంతా సాఫుచేసి ఈ దేశాన్ని తనకి పట్టారాసిచ్చారని చెప్పుకునే ప్రయత్నం భారీగా చేస్తోంది బీజేపీ. హిండెన్‌బర్గ్ ఆరోపణలన్నీ అదానీపైనే, అది కూల్చింది కూడా అదానీ సామ్రాజ్యాన్నే. కానీ వేళ్ళన్నీ మోడీ వైపే తిరిగాయి. నోళ్ళన్నీ మోడీ సర్కార్‌నే విమర్శించాయి. ఆ విమర్శలను పూర్వపక్షం చేసి అగ్నిపునీతుడిగా బయటికి రావల్సిన వ్యక్తి విపక్షం వెన్ను విరిచే ప్రయత్నం చేయటం దుస్సాహసమే!
వ్యక్తులను దండించగలరు. పార్టీల సమూహాన్ని వేధించగలరు. వర్గ పోరాటాలకు ఆనకట్టలు కట్టలేరు. సునామీలను నియంత్రించగల పాలకులు ఇప్పటిదాకా చరిత్రలో పుట్టలేదు. కాలాలకు అతీతంగా పోరాడి, 750మంది అమరులై, అక్షరాల మోడీ మెడలు వంచిన రైతు ఉద్యమం ప్రపంచంలోనే ఓ చారిత్రక ఘట్టం. బడా పెట్టుబడి వెన్ను కాయడమే తమ విద్యుక్త ధర్మమనుకునే పాలకులకు రైతుల పట్టుదల, కార్మికవర్గం నుండి వచ్చిన సంఘీభావం, సహకారం, ఆ పోరాటాన్ని దేశం నలుమూలల్లో రెపరెపలాడించిన అరుణపతాకం ఆ ఉద్యమానికి వెన్నుదన్నై నిలిచింది. పాలకుల్ని వెనక్కి కొట్టింది. ఇప్పటికే విద్యుత్ పంపిణీలో అంబానీ, అదానీ, టాటాలు వేళ్ళూనుకుని ఉన్నారు. వారి ప్రయోజనం కోసం దేశంలోని మొత్తం విద్యుత్‌రంగాన్ని వారికి గోరుముద్దలుగా తినిపించేందుకు విద్యుత్‌చట్టం 2003 తెచ్చింది ఎన్డీఏ-1 ప్రభుత్వం. మోడీ-1లోనే ప్రయత్నాలు ప్రారంభించి మోడీ-2లో సవరణచట్టం 2022 పాస్ చేసుకుని ప్రయత్నాలు ఉధృతం చేసింది ప్రభుత్వం. కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు ప్రయత్నించి కార్మికుల ప్రతిఘటనతో తోకముడిచింది. తమ సంపూర్ణ పాలనున్న హర్యానాలో, సంకీర్ణ పాలనున్న మహారాష్ట్రలో బీజేపీకి శృంగభంగమైంది. రైతుల్లాగే ప్రజామద్దతు కూడాగట్టగలిగితే విద్యుత్ సవరణను వెనక్కి నెట్టడం పెద్ద సమస్యే కాదు. నూతన పెన్షన్ స్కీంకి వ్యతిరేకంగా బీజేపీ సానుభూతి పరులతో సహా కోట్లాదిమందిలో వ్యతిరేకత ప్రజ్వరిల్లుతోంది. హిమాచల్‌లో బీజేపీ నుండి అధికారాన్ని ఊడబెరికిన వాటిలో ఎన్‌పిఎస్/ఒపిఎస్ ఒకటి.
మన దేశంలో జరిగే అనేక అంశాలపై గగ్గోలు పెట్టే పశ్చిమదేశాలు ఆర్థిక విధానాలదగ్గరకు వచ్చేసరికి మోడీని మించిన చెలికాడు తమకు దొరకడని విశ్వసిస్తున్నాయి. ఇటీవల ఎయిరిండియా 470 బోయింగ్ విమానాలను, ఎయిర్‌బస్‌లను ఆర్డరిచ్చిన తర్వాత తమదేశంలో కోటీ 47లక్షలమందికి ఉపాధి కల్పించే ఈ డీల్‌ను ''చారిత్రాత్మకం'' అని బైడెన్ పొగిడాడు. ఇంత పెద్ద ఆర్డరు తమ ఎయిర్‌బస్ కంపెనీకి ఎన్నడూ రాలేదని ఉబ్బి తబ్బిబ్బయ్యాయి ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లు. వారికి ఏది ప్రధానమో అర్థం కావడం లేదా? వారికి వ్యాపారం ముఖ్యం. వీరికి అధికారం ముఖ్యం. విజయవంతంగా నడిచే ఈ జగల్బందీకి అడ్డుకట్టవేయగలిగేది ప్రజా ఉద్యమాలే!