Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామ పంచాయతీలకు, ఇతర గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ఇతర స్టేకహోేల్డర్ల సామర్థ్యం పెంపుదల, శిక్షణ కోసం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జిఎస్‌ఎ) కింద రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడం దారుణం. ఈ విషయంపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తప్పుబట్టడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (2022 డిసెంబర్ 31 నాటికి) ఈ పథకం కింద 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు ఇవ్వలేదని పేర్కొంది. అంటే సగానికిపైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులివ్వలేదన్నమాట. అదేవిధంగా, 2021-22కి సంబంధించి ఇప్పటికీ తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు విడుదల కాలేదంటే గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల శిక్షణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రానికి ఎంత శ్రద్ధ ఉందో తేటతెల్లం చేస్తోంది. పైపెచ్చు అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించకపోవడం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన సూచనలను పాటించక పోవడమే నిధులు విడుదల కాకపోవడానికి కారణమని తెలపడం మరీ అన్యాయం. అనేక రాష్ట్రాలకు ఈ విధంగా నిధులను నిలిపివేయడం పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఈ ముఖ్యమైన ఆర్‌జిఎస్‌ఎ పథకం పురోగతిని అడ్డుకుంటుందన్న పార్లమెంటరీ స్థాయీసంఘం ఆవేదన సహజమైనది, సహేతుకమైనదీను. కమిటీ సిఫార్సు చేసిన విధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏకరీతిలో నిధులు విడుదలయ్యేలా ఆర్థిక మంత్రిత్వశాఖ నిబంధనలు, అవసరమైన పత్రాల సమర్పణలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా ఉండాలి. అటువంటి విషయాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అత్యున్నత స్థాయిలో చేపట్టి ఆర్‌జిఎస్‌ఎ నిధులు జాప్యం లేకుండా విడుదలయ్యేలా చూడాలి.
రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా బదలాయించవలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం బిగబట్టడం ఫెడరల్ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించడమే. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఇటువంటి చర్యలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళనకరం. గ్రామ సీమల నుండి నాయకత్వం పైస్థాయికి ఎదిగి రావాలంటే వారికి చట్ట, రాజ్యాంగపరమైన అంశాలపై శిక్షణనివ్వడం, ఉపన్యాసం చేయడం మొదలు నచ్చజెప్పడంతో సహా తమ వాదనాపటిమతో ప్రజలందరినీ ఏకతాటిపై నడిపే విధంగా వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. అటువంటి కృషికి ఆర్‌జిఎస్‌ఎ వంటివి ఎంతో అవసరం. ఐఎఎస్, ఐపిఎస్ అధికార్లకూ విధాన నిర్ణేతలకూ ఎప్పటికప్పుడు శిక్షణనివ్వడానికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి వంటి అనేక ప్రముఖ సంస్థలున్నాయి. మరి అలాంటిది గ్రామీణ ప్రజాప్రతినిధుల శిక్షణ సంస్థల పట్ల కేంద్రం ఇలా వ్యవహరించడం తగునా? నిధులివ్వాలంటేనే ఏదో ఒక కొర్రీ వేసే వైఖరిని ఆర్థిక శాఖ విడనాడి ఆచరణాత్మకంగా వ్యవహరించడం అవసరం.
కేంద్రం తీరు అలా ఉండగా రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలకు వచ్చిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను విద్యుత్ బిల్లులకు మళ్లించడం వంటి చర్యలకు అక్కడక్కడ పాల్పడుతుండటం సరికాదు. సర్పంచ్ల చెక్ పవర్‌పై సైతం వేటు వేయడానికి పూనుకోవడం మరీ దారుణం. బాపూజీ ప్రవచించిన గ్రామస్వరాజ్యాన్ని సాధించాలంటే ఆయా గ్రామసీమల అభివృద్ధికి, పౌర అవసరాలు తీర్చడానికి అవసరమైన నిధులు లేకుండా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఏం చేయగలరు? ఎన్నికైన ఆ ప్రజా ప్రతినిధులు కేవలం ఉత్సవ విగ్రహాల మాదిరి మిగిలిపోవాలా? అంతకంటే ముఖ్యంగా ఆయా గ్రామాల దుస్థితికి బాధ్యత నిధులు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవలసి ఉంటుంది. గ్రామాలు బాగుంటేనే మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, యావత్ దేశం బాగుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్థానిక సంస్థలకు అందజేయాల్సిన నిధులను వాటికి వెంటనే జమ చేయాలి. లేకపోతే గ్రామీణాభివృద్ధికి నిధుల సాధన కోసం ఇప్పటికే ఆందోళనాబాట పట్టిన ప్రజా ప్రతినిధులు మరింతగా ఉద్యమించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితికి బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వాలదే.