Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతటి నిరంకుశ నేతలైనా ప్రజాగ్రహానికి తలొంచాల్సిందే. యూదు దురహంకార నేత నెతన్యాహు విషయంలో ఇది అక్షర సత్యం. న్యాయ సంస్కరణల పేరుతో న్యాయ వ్యవస్థను కుళ్లబొడిచి, దానిని నిర్వీర్యం చేయాలని చూసిన ఈ మితవాద నేతకు ఇజ్రాయిలీ ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. మూడు నెలలపాటు ఉవ్వెత్తున సాగిన నిరసనలతో అప్రతిష్టాకరమైన ఈ న్యాయ సంస్కరణల బిల్లును తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు పచ్చి నిరంకుశవాది నెతన్యాహు ప్రకటించక తప్పలేదు. అతి పెద్ద కార్మికసంఘం 'హిస్తాద్రుత్' సమ్మెలు, ఆందోళనలకు పిలుపునివ్వడంతో వైద్యం నుంచి విమానాల వరకూ సమస్త రంగాలు స్తంభించిపోయాయి. రాయబారులు, దౌత్య ప్రతినిధులు సహా సిబ్బంది అంతా సమ్మెలో పాల్గొనడంతో గత్యంతరంలేని స్థితిలో నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇజ్రాయిల్ ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న దురాక్రమణ, జాతి ప్రక్షాళన వంటి చర్యలు ఇజ్రాయిలీ సెటిలర్లు, సైనికులు, రాజకీయ నాయకులకు వరంగాను, అక్కడ నివసిస్తున్న పాలస్తీనీయుల పాలిట శాపంగాను మారింది. దీనికితోడు అవినీతి ఊబిలో పీకల్లోతులో కూరుకుపోయిన నెతన్యాహు న్యాయవ్యవస్థ స్వతంత్రతనే హరించేలా వివాదాస్పద న్యాయ సంస్కరణల బిల్లును తీసుకొచ్చాడు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెలంచుకుంది. 'ఇజ్రాయిల్‌లో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలి' అన్న పేరుతో చేపట్టిన నిరసనోద్యమానికి యూనివర్సిటీ విద్యార్థులు, యువత, ప్రగతిశీల, ప్రజాతంత్ర వాదుల నుంచి విశేషంగా మద్దతు లభించింది. దీంతో ఇజ్రాయిల్ గత కొన్ని వారాలుగా నిరసనలతో అట్టుడుకుతోంది. తాను ఏం చేసినా న్యాయ వ్యవస్థ ప్రశ్నించకూడదనే ధోరణి నరనరాన జీర్ణించుకున్న నెతన్యాహుకు తన ప్రజల నుంచే ఊహించని రీతిలో తిరుగుబాటు వచ్చేసరికి కంగుతిన్నాడు. యూదు దుర్హంకార ప్రభుత్వ దమనకాండకు ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 87మంది పాలస్తీనీయులు బలయ్యారు. గడచిన సంవత్సరం ఇజ్రాయిలీ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌పై జరిపిన హేయమైన దాడిలో 146మంది పాలస్తీనీయులు చనిపోయారు. ఇజ్రాయిల్ 1948లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పాలస్తీనా భూభాగంలో 900కి పైగా కమ్యూనిటీలను (గ్రామాలు, పట్టణాలు) యూదులు ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ప్రభుత్వ నిరంకుశ పోకడలు పెరిగిపెరిగి, చివరికి ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా పరిణమించాయి. 75ఏండ్లుగా అనుసరిస్తూ వస్తున్న విధానాలతో ఇప్పటికే పెళుసుగా మారిన ప్రజాస్వామ్యాన్ని నెతన్యాహు ప్రభుత్వం మరింత నిర్వీర్యం చేయడానికి పూనుకోవడంతో ఇజ్రాయిలీ ప్రజలు మేల్కొన్నారు. నెతన్యాహు ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండాను సాగనిచ్చేది లేదంటూ పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చారు. దేశంలో పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలని, ఇజ్రాయిల్ యూదు దురహంకార రాజ్యంగా కాకుండా ప్రజాస్వామ్యయుత ఆధునిక రాజ్యంగా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఇదే వారినందరినీ ఏకంచేసి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించేలా ప్రేరేపించింది.
ఇజ్రాయిల్‌లో న్యాయవ్యవస్థపై జరిగిన దాడి వంటిదే మన దేశంలోనూ ఇక్కడి మితవాద బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రి వంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇటీవల చేస్తున్న ప్రకటనలు దీనిలో భాగమే. న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వమే శాసించాలని నెతన్యాహు వాదించినట్టుగానే ఇక్కడ మోడీ ప్రభుత్వం కూడా వాదిస్తున్నది. ఇందుకోసం సెర్చి కమిటీ పేరుతో ఒక దానిని తెరపైకి తేవాలని చూసింది. సెర్చి కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ కమిటీ ద్వారా న్యాయవ్యవస్థలో తన మనుషులను నియమించు కోవాలని, తద్వారా న్యాయ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టు కోవచ్చని పన్నాగం పన్నింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సుప్రీం కోర్టు ఆదిలోనే దీనికి బ్రేక్ వేసింది. అయినా, న్యాయవ్యవస్థ స్వతంత్రతను హరించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న బీజేపీ, ఆరెస్సెస్‌లకు ఇజ్రాయిల్ పరిణామాలు ఒక హెచ్చరిక కావాలి.