Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోనే ఒక అతి పెద్ద సంఘటిత పోరాటానికి శత సంవత్సరం. సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల స్వాగతోత్సవం. దేశ స్వాతంత్య్ర పోరాట ఉద్యమాన్ని పునరుజ్జీవనోద్యమాలతో అనుంధానించే ఒక ముఖ్యమైన ఘట్టానికి తొలిమెట్టు వైకోమ్ సత్యాగ్రహ పోరాటం. ఈ పోరాటమే అస్పృశ్యతకు వ్యతిరేకంగా కేరళ సహా దేశంలోని అనేక చోట్ల జరిగిన పోరాటాలకు, రాజకీయ ఉద్యమాలకు ప్రేరణ. నాటి సత్యాగ్రహ స్ఫూర్తి... ఆంగ్లేయులపైనే కాదు, ఆధిపత్యపు అరాచకం మీద కూడా నడిచింది. అంటరానితనం నిర్మూలన కోసం, అట్టడుగు వర్గాలకు గుడి దారులు తెరిపించిన అరుదైన ఉద్యమం ఇది. 'వైకోమ్ సత్యాగ్రహుల పోరాటం, స్వరాజ్య పోరాటానికి ఏమాత్రం తక్కువ కాదు' అని 'యంగ్ ఇండియా' పత్రికలో గాంధీజీ అంటాడు. అన్ని కులాలకూ దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని, వైకోమ్ లోని ఆలయ వీధుల్లో నిషేధాన్ని తొలగించాలని 1924 మార్చి 30 నుంచి, 1925 నవంబర్ 23 వరకు 603 రోజుల పాటు ఈ నిరసన జరిగింది. అస్పృశ్యతకు వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక భాగమే. ఆచారాలను, కులతత్వాన్ని తిరస్కరించాలన్న పిలుపు ఈ పోరాటంలో ప్రతిధ్వనించింది.
'తరతరాల బూజుభావాలకి పాతర్లలాంటి ఈ ధర్మశాస్త్రాల్ని / కులం పట్ల పవిత్ర భావాల్ని నూరిపోస్తోన్న ఈ ధర్మశాస్త్రాల్ని / ధర్మశాస్త్రాలకి దాస్యం చేయమని బోధిస్తోన్న ఈ మతాన్ని / పునాదులతో పాటు మూలమట్టంగా నాశనం చేయండి' అంటారు 'సత్యకామ జాబాలి'లో సివి. అణగారిన వర్గాల దేవాలయాల ప్రవేశం కోసం మొదటిసారిగా జరిగిన సంఘటిత ఉద్యమం. నారాయణగురు శిష్యుల్లో ఒకరైన జాతీయ కాంగ్రెస్ నేత టికె మాధవన్ అన్ని కులాలకూ దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలంటూ 1918లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాన్ని ఎవరూ పట్టించుకోక పోవడంతో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గాంధీజీ సైతం తన మద్దతు ప్రకటించారు. అలా మొదలైన వైకోమ్ ఉద్యమంలో అనేక నిమ్నకులాలతో పాటు అగ్రవర్ణంగా పేరొందిన నాయర్లు సైతం పాల్గొన్నారు. ముగ్గురు చొప్పున దేవాలయం వీధుల్లోకి శాంతియుతంగా వెళ్లడం, వారిని అరెస్టు చేయగానే, మరో ముగ్గురు బయల్దేరడం. ఇదే తంతు రోజులపాటు కొనసాగింది. క్రమంగా జైళ్లన్నీ నిండిపోయాయి. భారీ వర్షాలకు సైతం వెనక్కు తగ్గలేదు. నారాయణగురు తన వేలూరు మఠాన్ని సత్యాగ్రహులకు కార్యాలయంగా మార్చారు. 1925 మార్చిలో జైలు నుంచి విడుదలైన గాంధీజీ వైకోమ్ రావడంతో సత్యాగ్రహులకు బరింత బలం చేకూరింది. పునరుజ్జీవనోద్యమ ఆలోచనలు ప్రతివారినీ ప్రభావితం చేసే గొప్ప ప్రవాహంగా ఎదిగాయి. ఉద్యమం తీవ్ర రూపం తీసుకోవడంతో ట్రావెన్కోర్ మహారాణి దిగి వచ్చింది. నాలుగింట మూడు ఆలయ దారుల్లో అన్ని కులాల వారికీ అనుమతిచ్చింది. దీనికి గుర్తుగా సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి కేరళలో ప్రారంభమయ్యాయి.
కుల ఆధారిత సమాజం సష్టించిన నిషేధాలు, ఆచారాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో కులతత్వం లేని ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రధానమైనది. వైకోమ్ సత్యాగ్రహ ఆందోళనల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు... అదే స్థాయిలో చైతన్యాన్ని, స్ఫూర్తిని పొందారు. ఇప్పుడు సత్యాగ్రహ శత జయంతి జరుపుకుంటున్న సమయంలో ఈ చైతన్యం మరింత స్ఫూర్తిని రగిలించేదిగా ఉండాలి. సత్యాగ్రహం వైకోమ్ ఆలయ ప్రాంగణంలో జరిగినప్పటికీ అన్ని కులాలు, మతాల వారు పాల్గొన్న ఉద్యమం. కుల ఆధారిత నిషేధాలు, వివక్ష, స్వేచ్ఛ నిరాకరణలకు వ్యతిరేక పోరాటానికి నాంది. మతోన్మాదం పెచ్చుమీరి, సంఫ్ పరివార్ శక్తులు దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులకు తెగబడుతోన్న వైనం నాటి పరిస్థితికే మాత్రం తీసిపోదు. నేడు ఈ పరిస్థితిని ఎదుర్కోవడమంటే... నాటి వైకోమ్ సత్యాగ్రహ ఉద్యమానికి నిజమైన వారసత్వాన్ని కొనసాగించడమే. 'నా పుట్టుక అసహ్యమైనప్పుడు / పరమ అసహ్యమైన పుట్టుక నుండి / కళ్ళు తెరిచిన దేవుళ్ళను కొలుస్తున్న / మీ పుట్టుకనే నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను' అంటాడో కవి. ఇది నిరంకుశత్వంపై పోరాటం. తనకు జరిగిన అవమానాల వేదన నుంచి రగిలిన చైతన్య స్ఫూర్తితో స్వేచ్ఛా, సమానత్వం కోసం సాగించే సమరం. ఇది మన వారసత్వం.