Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని మనం మరిచిపోకముందే అలాంటి వ్యవహారమే మరోటి సంచలనం సృష్టించింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును అయోమయంలో పడేస్తే.. ఇప్పుడు వెలుగు చూసిన పదో తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్లో ప్రత్యక్షమైన ఘటన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇందుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు సహా మరో ఐదుగురిని అరెస్టు చేశామంటూ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన దరిమిలా... ఈ కేసు తీవ్రమైన సంచలనాన్ని రేకెత్తించింది. సంజరు ఆదేశాల మేరకే ఏబీవీపీ, ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు పది ప్రశ్నాపత్రాల తతంగాన్ని నడిపారన్నది అధికార బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతి నిధుల వాదన.
అయితే ఇక్కడే మరో అభిప్రాయం, అనుమానం వెల్లువెత్తకమానటం లేదు. గతంలో రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలు ఇదే విషయాన్ని రూఢ చేస్తున్నాయి. బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద తలకాయలు తెలంగాణలో పర్యటించేందుకు కొద్ది రోజుల ముందే ఇక్కడ ఏదో ఒక అలజడి రేపటం కాషాయ దళానికి ఆనవాయితీగా మారటం గమనార్హం. కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీ రాకకు ముందే ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాల వ్యవహారం కలకలం రేపిన విషయం మనకెరుకే. ఈనెల ఎనిమిదిన వందే భారత్ రైలును ప్రారంభించే నిమిత్తం ప్రధాని హైదరాబాద్కు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కూడా పేపర్ లీకేజీలాంటి అలజడులను క్రమం తప్పకుండా కొనసాగించటం ద్వారా మోడీ పర్యటనలో కూడా ఆ అంశాన్ని పదే పదే తమకు అనుకూలంగా మార్చుకోవచ్చన్నది రాష్ట్ర బీజేపీ నేతల వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొనటం గమనార్హం. మరికొద్ది నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వచ్చిన ప్రతీ అవకాశాన్ని, సందర్భాన్నీ తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో గద్దె నెక్కాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతున్నదనేది వారి వాదన. ఈ రకంగా అందలం ఎక్కటానికి ఎలాంటి అడ్డగోలు వ్యవహారాలకైనా పాల్పడే ఆ పార్టీ... ఇప్పుడు తెలంగాణలో గద్దె నెక్కేందుకు ఏకంగా పిల్లల భవిష్యత్తుతోనే రాజకీయ క్రీడలాడేందుకు సిద్ధపడుతుండటం అత్యంత దారుణం.
సరే.. ఇలాంటి అభిప్రాయాలు, వాదనలూ ఎలా ఉన్నా... బండి సంజరును అరెస్టు చేసిన వెంటనే ఢిల్లీకి చెందిన కాషాయ పరివారం ఆగమేఘాల మీద స్పందించింది. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిలు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ చేసిన హడావుడి, ఆర్భాటం అంతా ఇంతా కాదు. పదో తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్లో ప్రత్యక్షమవటంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజరు... నిజంగా ఎలాంటి తప్పూ చేయకపోతే ఆయన్ను పోలీసులు ఏమీ చేయలేరు. ఆ విషయం తెలిసినప్పటికీ హస్తినలోని బీజేపీ అగ్రనాయకత్వం ఆయన్ను అరెస్టు చేసిన వెంటనే ఎందుకు భుజాలు తడుముకుంటున్నదనేది ఇప్పుడు శేష ప్రశ్న. ఇక్కడ ఒక విషయం మన స్ఫురణకు రాక మానదు. లీకేజీల తతంగాలనేవి... బహుశా బీజేపీ నేతలకు తెలిసినంతగా మరొకరికి తెలియవేమో. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో అనేక సార్లు పేపర్లు లీకేజీలై నిరుద్యోగులు, విద్యార్థుల భవితవ్వం బుగ్గిపాలైన ఘటనలు అనేకం.
మరోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదిన్న రేండ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు చేయని కుట్ర, కుతంత్రం లేదు. బుజ్జగింపులు, బేరసారాలకు వింటే ఓకే... లేదంటే ఈడీ, సీబీఐ ద్వారా అదిరింపులు, బెదిరింపులకు పాల్పడటమనే పద్ధతులకు అది శ్రీకారం చుట్టిన, చుడుతున్న విషయం మనకందరికీ ఎరుకే. ఆ కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అప్రదిష్ట పాల్జేసేందుకు ఇక్కడి కమలం నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలను మనం కొట్టి పడేయలేం. కాకపోతే ఈ కుట్రలు, కుతంత్రాలు, పొలిటికల్ డ్రామాలు రాజకీయ క్రీడలకు బీజం మాత్రం ఢిల్లీలోనే పడుతున్నదనేది నగ సత్యం. అది ఎమ్మెల్యేల బేరసారాలైనా, టీఎస్పీఎస్సీ లీకేజైనా, పది ప్రశ్నాపత్రాల బాగోతమైనా అక్కడి డైరెక్షన్లోనే నడుస్తోందంటూ అధికార బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. గతంలో కొనసాగిన పరిణామాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. 'బీజేపీ డీఎన్ఏలోనే మోసం, దగా ఉన్నాయి...' అంటూ ఇటీవల ఒక జాతీయ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందువల్ల ఇలాంటి చర్యలకు అసలు మూలాలను తుంచేయాలంటే... దేశ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండాలి. ప్రజాతంత్ర, లౌకిక, వామపక్ష శక్తులతో కలిసి ఎప్పటికప్పుడు దాని ప్రజా వ్యతిరేక, మతతత్వ, కార్పొరేట్ విధానాలపై పోరాడటం ద్వారా అలాంటి పన్నాగాలను తిప్పికొట్టాలి. నిరుద్యోగులను ఆత్మహత్యల నుంచి కాపాడాలన్నా, విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలన్నా ఇప్పుడు మనకు ఈ పోరాటాలు తప్ప వేరే మార్గం లేదు.