Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1952 నుండి అత్యంత తక్కువ సమయం జరిగిన లోక్సభ ఈ 17వ లోక్సభేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చర్చకూ ప్రశ్నకూ అవకాశమివ్వని ఈ సమయ హనన పరంపర అంతకంతకూ వేగం పుంజుకుంటోందనడానికి ఈ సమావేశాలు ఓ మచ్చుతునక. ప్రతిపక్షాల గొంతునొక్కే నిరంకుశ పోకడలకు ఇది ఒక పరాకాష్ట. ఈ స్థితిని ప్రతిఘటించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కేవలం పార్లమెంటు సభ్యుల పనేకాదు, పౌరసమాజమూ ప్రగతిశీలశక్తులందరి బాధ్యత. ఇప్పుడు ప్రశ్ననూ పార్లమెంటునూ కాపాడుకుంటేనే దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ.
ప్రశ్నకూ విమర్శకూ భయపడే పాలకపక్షం ఎంత బలవంతమైనదైతే మాత్రం ఏం ప్రయోజనం. సవాళ్ళకు జవాబు చెప్పలేనప్పుడు అది పలాయనమే చిత్తగిస్తుంది. తన జవాబుదారీతనంలేమిని కప్పిపుచ్చు కోవడానికి ఎలాంటి అనైతిక ధోరణులకైనా దిగజారుతుంది. ముగిసిన బడ్జెట్ సమావేశాల తీరు గమనిస్తే బోధపడే సారాంశమిదే. పార్లమెంటు మన శాసన వ్యవస్థకే తలమానికమైన చట్టసభ. దేశానికే దిశానిర్దేశం చేసే అత్యున్నత ప్రజాప్రాతినిధ్య వేదిక. అలాంటి చోట ఏ చర్చకూ అవకాశం లేకుండా పోయాక ఇక మన ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6న ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తరువాత ఎవరికైనా కలిగే అభిప్రాయం ఇదే.
మధ్యలో ఓ విరామంతో రెండు విడతలుగా ఇరవైఐదు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో... 133.6 గంటలు పనిచేయాల్సిన లోక్సభ కేవలం 45గంటలు (34.28శాతం) పనిచేసింది. 130 గంటలు పనిచేయాల్సిన రాజ్యసభ 31గంటలు (24శాతం) మాత్రమే పనిచేసింది. మిగతా సమయమంతా నిరంతర వాయిదాల పరంపరలోనే చెల్లిపోయింది. కాగా, కార్యకలాపాలు సాగాయని చెప్పుకుంటున్న ఈ కొద్దిపాటి సమయం కూడా ఏదో అర్థవంతమైన చర్చ చేసిందను కుంటే పొరపాటే! అందులో కూడా అత్యధికభాగం అధికార ప్రతిపక్షాల పరస్పర వ్యతిరేక ప్రహసనాలతోనే గడిచిపోయింది. సాధారణంగా ప్రశ్నలు సంధించడం, సమస్యలు లేవనెత్తడం, సమాధానాలు లభించనప్పుడు సభను స్తంభింపజేయడం ప్రతిపక్షాల పని. అది వారి ప్రజాస్వామిక హక్కు. ప్రజలిచ్చిన బాధ్యత. ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సమస్యలకు పరిష్కారాలు చూడం పాలకపక్షం విధి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా అధికారపక్షమే నిరసనలకు దిగడం, సభను అడ్డుకోవడం ఈ సమావేశాల విశేషం! ఇది ప్రతిపక్షాలనే కాదు, సమస్త పౌర సమాజాన్నీ విస్తుగొలిపే ఏలినవారి లీలా విన్యాసం!!
చట్టసభలు ''ప్రజా ప్రాతినిధ్య సభలు'' అన్న కనీస స్పృహ కూడా పాలకపక్షానికి లేకుండా పోతోంది. ఫలితంగా అవి వారి అధికార, అసహన ప్రదర్శనలకే తప్ప ప్రజోపయోగకర చర్చలకు అవకాశమే లేనివిగా మారిపోతున్నాయి. ఏలినవారి సన్నిహిత వ్యాపారి దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అక్రమాలకు, అవినీతికి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే... వాటి పట్ల రాజ్యాంగబద్ధమైన పర్యవేక్షక సంస్థలూ నియంత్రణా వ్యవస్థలన్నీ అంతులేని ఉపేక్షను ప్రదర్శిస్తుంటే... ఈ విపరీత పరిణామాల మీద మన పార్లమెంటులో చర్చకు అవకాశముండదు. కానీ, చర్చకు అవకాశమివ్వని ఈ అప్రజాస్వామిక స్థితిని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుని వ్యాఖ్యల మీద మాత్రం పెద్ద రచ్చే జరుగుతుంది. పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, ద్రవ్యోల్బణం, అవినీతి, అసమానతల వంటి ప్రజా సమస్యలన్నీ పార్లమెంటుకు అంటరానివిగా మిగిలిపోతున్నాయి. ఈ ప్రజాస్వామ్య సమాజంలో పార్లమెంటరీ వ్యవస్థకు ఉండవలసిన కనీస ప్రమాణాలు కూడా మృగ్యమైపోతున్నాయి. ప్రస్తుతం ప్రతి వ్యవస్థా నిర్మాణాన్నీ లోపలి నుంచే ధ్వంసం చేసే ప్రక్రియ వేగవంత మవుతున్న కాలంలో... పార్లమెంటూ అందుకు మినహాయింపు కాదని ఈ బడ్జెట్ సమావేశాలు హెచ్చరిస్తుండటం గమనార్హం.
కాస్తో కూస్తో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తప్ప బడ్జెట్ మీద పెద్దగా చర్చ జరిగిందే లేదు. ఆరు బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే సభ్యుల ఆందోళనల మధ్యే ఆమోదం పొందాయి. బడ్జెట్ పద్దులపై అసలు చర్చేలేదు. 45లక్షల కోట్ల 'భారీ బడ్జెట్' పట్టుమని పది నిమిషాల్లోనే ఆమోదం పొందింది. 1952 నుండి అత్యంత తక్కువ సమయం జరిగిన సభగా ఈ 17వ లోక్సభ నిలవబోతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చర్చకూ ప్రశ్నకూ అవకాశమివ్వని ఈ సమయ హనన ''ప్రక్రియ'' అంతకంతకూ వేగం పుంజుకుంటోందనడానికి ఈ సమావేశాలు ఓ మచ్చుతునక. ప్రతిపక్షాల గొంతునొక్కే నిరంకుశ పోకడలకు ఇది ఒక పరాకాష్ట. ఈ స్థితిని ప్రతిఘటించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కేవలం పార్లమెంటు సభ్యుల పనేకాదు, పౌరసమాజమూ ప్రగతిశీల శక్తులందరి బాధ్యత. ఇప్పుడు ప్రశ్ననూ పార్లమెంటునూ కాపాడుకుంటేనే దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ.