Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చరిత్రను విస్మరించే వారు చరిత్రను నిర్మించలేరు' అని మన బాబాసాహెబ్ అంబేద్కర్ సెలవిచ్చారు. ఇది అక్షర సత్యం. చరిత్రను విస్మరించడమే కాదు, చెరిపేయ చూడటం, వక్రీకరించే ప్రయత్నం చేయటం మరింత దుర్మార్గమైన చర్యే అవుతుంది. ఎవరు ఈ పనికి పూనుకుంటారు? హీన చరితులు మాత్రమే ఈ పనిచేస్తారు. గతకాలపు చరిత్రను తుడిచేసి, తమకనుకూలమైన చరిత్రను తిరగరాయించుకునే వాళ్లు నియంతలు. వీళ్లంతా హీన చరితులుగా కాలగర్భంలో కలిసిపోతారు. ఇది చరిత్ర చెబుతున్న పాఠం. సత్యాన్ని కొంత కాలం కప్పిపెట్టవచ్చు కానీ పూర్తిగా నిర్మూలించడం కుదరని పని. చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు. చరిత్ర పునాది మీదనే వర్తమానం, భవిష్యత్తు కొనసాగు తుంది. ఈ భవిష్య గమనాలను తమ ఆలోచనల చుట్టూ తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నవాళ్లు గత కాలపు వాస్తవాలపై మసిపూసే పనికి పూనుకుంటున్నారు. ఈ వికృత చేష్టకు పాల్పడుతున్న వారి పన్నాగాలను పసికట్టి, పనిపట్టవలసివుంది!
మనదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పాత్రలేని బీజేపీ, సంఫ్‌ు పరివారం, పాత్ర పోషించిన వారిని చరిత్ర నుండి తొలిగించే పనికి సిద్ధమైంది. దేశానికి జాతిపితగా మనం గౌరవించుకునే మహాత్మాగాంధీ నిర్వహించిన జాతీయోద్యమ సంఘటనలను, ఆయన జీవిత విషయాలను ఎన్.సి.యి.ఆర్.టి. సిలబస్ నుండి తొలగించింది నేటి కేంద్ర ప్రభుత్వం. ఎందుకనంటే, దేశ ఐక్యత కోసం, స్వాతంత్య్రం కోసం పనిచేసిన గాంధీని హతమార్చిన నాధూరాంగాడ్సే వారసులు వీరయినందువల్ల, దాన్ని పాఠంగా చదవడాన్ని తుడిచేస్తున్నారు. శాంతి, సహనం భారతీయ ఆత్మ అని ప్రబోధించిన మహాత్మున్ని అత్యంత కిరాతకంగా హత్య చేయటమనేది వ్యక్తి నిర్మూలనే కాదు, భారతీయతత్వాన్ని, ఐక్యతను అంతమొందించడమనే ఉగ్రవాద చర్య అది. గాంధీయేమీ విప్లవాన్ని కోరుకోలేదు, రామరాజ్యాన్నే ఆశించాడు. అయినా భారతీయులందరూ ఐక్యంగా జీవించాలని కృషిచేశాడు. విభజన, విచ్ఛిన్నకారులకు ఇది నచ్చని అంశం. క్రమేనా హంతకుల చరిత్రను, ఉదాత్త నాయకులుగా ప్రవేశపెట్టినా ఆశ్చర్యం పడవలసింది లేదు. కేవలం హిందూ ముస్లిం ఐక్యతకు గాంధీ చేసిన కృషికి సంబంధించిన చాప్టర్లనన్నింటినీ తొలగించడంతోనే వీరి దుర్బుర్థి అర్థమవుతుంది. ఇక భారతదేశాన్ని పరిపాలించిన మొఘలు సామ్రాజ్యం గురించి మొత్తం అధ్యాయాలను తొలగించారు. ఒక్క మొఘలులే కాదు అనేక జాతులవారు, మతాలవారు దేశాన్ని పాలించారు. ఇక్కడి సమాజంలో కలిసిపోయి స్థిరపడిపోయిన వాళ్లూ ఉన్నారు. విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు ఆదాన ప్రదానాలతో భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న నేటి సమాజాన్ని మత ప్రాతిపదికన విడదీయాలన్న ఆలోచనలో భాగమే ఈ చర్యలన్నీ.
మహాత్ముని హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నిషేధానికి సంబంధించిన చరిత్రనూ పాఠ్యభాగాలనుండి తొలగించి భావితరాలకు చరిత్ర తెలియకుండా చేస్తున్నారు. యువత మస్తిష్కాలలో అబద్దాలను, అసత్యాలను చొప్పించి తమ లక్ష్యాలను సులభతరం చేసుకోవాలన్న కపటత్వం ఇందులో దాగివుంది. దేశంలో నూతన విద్యా విధానం పేర కాషాయ ఆలోచనలను నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ తొలగింపులు జరుగుచున్నవి. ఇంకా సిలబస్‌లోంచి 'ప్రజాస్వామ్యం- భిన్నత్వం' అనే అంశాలనూ ఉద్యమ చరిత్రనూ తొలగించడం వారి అప్రజాస్వామిక విధానానికి మచ్చుతునక. విద్యారం గాన్ని మొత్తంగా తమకనుకూలంగా మార్చుకుని, చరిత్రను వక్రీకరించి, విద్యార్థుల మెదళ్లలో విషబీజాలు నాటాలని చూస్తున్నారు.
పాఠ్య గ్రంథాలలోని చరిత్ర తుడిచివేత ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు చారిత్రక కట్టడాలనూ కనుమరుగు చేయాలన్న ఆలోచనలూ బహిరంగపడుతున్నాయి. అసోంలోని బీజేపీ శాసనసభ్యుడు రూప్ జ్యోతికుర్మి చారిత్రక కట్టడాలయిన తాజ్‌మహల్, కుతుబ్‌మినార్ మొదలైనవాటిని కూల్చేయాలని పిలుపునిచ్చాడు. అందుకోసం తన సంవత్సర కాలపు జీతాన్ని ఇస్తానని ప్రకటించాడు. ఇది వ్యక్తిగతమైన అభిప్రాయమే కాదు, సంఫ్‌ు పరివార్ యొక్క ఆలోచనలో ఉన్న విషయాలివి. తుడిచేయడం, కూల్చేయటం విధ్వంసకారుల కార్యక్రమం. ముఖ్యంగా విద్యారంగంలో విషం నిండిపోతే భవిత ఉన్మాదమై తాండవిస్తుంది. చరిత్ర అబద్ధాలతో నిండితే భవిష్యత్తు అనర్థమై అపార్థాలను పండిస్తుంది. వక్రీకరణకారుల వక్రబుద్ధిని నిలదీసి నిలువరించకుంటే చరిత్ర హత్యకు గురవుతుంది. భవిష్యత్తుపై చీకట్లు కమ్ముతాయి. మేధావులారా మేల్కొనండి!