Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫెడరల్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్(బిఎల్ఎస్) తాజా నివేదికను అనుసరించి అమెరికాలో గతంలో ఎన్నడూలేనంతగా కార్మికవర్గం పోరాటాలు చేస్తున్నది. 2019లో 1000మంది, అంతకుమించి పనిచేస్తున్న సంస్థలలో 25సార్లు సమ్మెలు జరిగాయి. వీటిలో 10సమ్మెలలో 20వేలు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. 1993 నుంచి కార్మికుల సమ్మెల వివరాలను బీఎల్ఎస్ సేకరించటం మొదలు పెట్టిన తరువాత ఇదే అత్యంత అధిక సంఖ్య. సమ్మెలలో పాల్గొనే కార్మికుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2018లో 4,85,000మంది కార్మికులు సమ్మె చేశారు. ఇది అంతకుముందు సంవత్సరంకంటే 20రెట్లు ఎక్కువ. గత రెండేండ్లలో సమ్మెలలో పాల్గొన్న కార్మికుల సంఖ్య గత 35ఏండ్లలో అత్యంత అధికంగా ఉంది.
ఈ రెండేండ్లలో పశ్చిమ వర్జీనియా, ఉత్తర కరోలినా, కెంటక్కీ, ఒరెగాన్, ఇతర రాష్ట్రాలలోను, లాస్ ఏంజెల్స్, ఓక్లాండ్, చికాగోవంటి ప్రధాన నగరాలలోను ఉపాధ్యాయులు సమ్మెలు చేశారు. 2019లో జనరల్ మోటార్స్‌లో పనిచేస్తున్న 46వేలమంది కార్మికులు 40రోజులపాటు సమ్మె చేశారు. ఈ సమ్మె చాలా సంవత్సరాల తరువాత జరిగిన మొదటి ఆటో కార్మికుల జాతీయ సమ్మె. అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో 30వేలమంది పచారీ కార్మికులు గతేడాదిలో సమ్మె చేశారు. చాలా సందర్బాలలో ఈ సమ్మెలు అధికారిక ట్రేడ్ యూనియన్ల నాయకత్వంతో సంబంధంలేకుండానే జరిగాయి. నిజానికి ఈ సమ్మెలు పెట్టుబడిదారీ వర్గ అనుకూల ట్రేడ్ యూనియన్లకు వ్యతిరేకంగా జరిగాయి.
కార్మికులు వామపక్ష ధోరణిలో వ్యవహరించటానికి గల కారణం వర్గపోరాటం తీవ్రతరం కావటమే. ప్రజలు ముఖ్యంగా యువత సోషలిజానికి స్థూలంగా మద్దతు తెలుపుతున్నట్టుగాను, పెట్టుబడిదారీ విధానాన్ని, అసమానతలను వ్యతిరేకిస్తున్నట్టుగాను అమెరికాలో జరిగిన అనేక సర్వేలలో వ్యక్తమైంది. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీచేయదలచిన వర్మోంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్‌కు వెల్లువెత్తుతున్న మద్దతులో ఈ రాజకీయ రాడికలైజేషన్ ప్రతిబింబిస్తోంది. ఐవోవా, న్యూయాంప్షైర్ రాష్ట్రాలలో జరిగిన డెమొక్రటిక్ పార్టీ తొలి రెండు ప్రైమరీ ఎన్నికల్లో శాండర్స్ గెలిచాడు. అమెరికన్లు సోషలిజంవైపు చూడటానికి సామాజిక అసంతృప్తి, కార్మికుల సమ్మెలే కాకుండా అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం కూడా కారణం. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థకున్న బలంవల్లనే అమెరికా పాలక వర్గాలు అమెరికాలో సోషలిజం వేళ్లూనకుండా చేయగలిగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ అప్రతిహతంగా సాగుతున్నప్పుడు అక్కడ కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగాయి. అలా కొనసాగినంత కాలం అమెరికా కార్మికులు సోషలిజం అవసరం ఉందని అనుకోలేదు.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో 'అమెరికా ప్రత్యేక స్థానం'కు గల వస్తుగత పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత 40ఏండ్లలో ప్రపంచంలో అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థకున్న ప్రత్యేక స్థానం క్రమంగా డొల్లగా మారింది. దానితో అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న విజయాలను పాలకవర్గాలు నాశనం చేశాయి. 'అపరిమిత అవకాశాలుగల దేశం' అని పేరున్న అమెరికా అప్పులు, ఆర్థిక అభద్రత, తక్కువ వేతనాలు గల దేశంగా మారిపోయింది. 'అమెరికా కల' 'అమెరికా పీడకల'గా పరిణమించింది. ముఖ్యంగా 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం తరువాత సంపదంతా కొందరి చేతుల్లోకే చేరింది. దానితో సామాజిక, వర్గ అసమానతలు పెద్దఎత్తున తీవ్రమయ్యాయి. అమెరికాలోని 400మంది అత్యంత ధనవంతులు జనాభాలోని కింది 64శాతం కంటే ఎక్కువ సంపద కలిగివున్నారు. 1930వ దశకంలో ఏర్పడిన మహా మాంద్యానికి ముందున్న దానికంటే సామాజిక అసమానతలు పెరిగాయి. సామాజిక అశాంతి పెరగటం, ప్రజలు సోషలిజంపట్ల ఆసక్తి చూపటం, యువత ముఖ్యంగా మహిళలు రాడికలైజ్ కావటంతో పాలకవర్గాలకు, ఈ వర్గాల ఆధీనంలోని మీడియాకు భయం పట్టుకుంది. పర్యవసానంగా ట్రంప్ పాలన కమ్యూనిస్టు వ్యతిరేక కార్యకలాపాలతో తలమునకలై ఉంది. కల్లుతాగిన కోతిలాగా సోషలిజాన్ని, వామపక్షాలను నిందించటం ట్రంప్‌కు నిత్యకృత్య మైంది. ఒక ఫాసిస్టు మితవాద ఉద్యమాన్ని నిర్మించటానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఉద్యమం కార్మిక వర్గాన్ని అణచివేసేందుకు, ద్రవ్య పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను సంరక్షించేందుకు ఉద్దేశించినది. అలాగే బెర్నీ శాండర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీలోని ఆధిపత్య వర్గం శాండర్స్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటమే కాకుండా సామాజిక అసమానతలకు, కార్పొరేట్ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడకుండా ఉండటానికి చేయగలిగిందంతా చేస్తున్నది. జాతి, లింగ రాజకీయాలతో కార్మికవర్గాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నది. వర్గ పోరాటం పెరుగుతున్నకొద్దీ ఈ ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి.
అమెరికాలో వివిధ రంగాలలో వర్గ పోరాటాలు తీవ్రం కావటం, కార్మికులు, యువత, మహిళలు ప్రగతిశీలంగా ఆలోచించటం, వీరంతా అసమానతలను, నియంతృత్వాన్ని, యుద్ధాన్ని వ్యతిరేకించటం ప్రపంచ ప్రజాస్వామ్య ఉద్యమంలో నిస్సందేహంగా ఒక పెద్ద ముందడుగు అవుతుంది. అంతిమంగా ఇది నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం పతనం కావటానికి దోహదపడుతుంది.