Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారుల లాభాల కోసమే కార్మిక చట్టాల రద్దు
- సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-జహీరాబాద్
కేవలం కొంతమంది పెట్టుబడిదారుల లాభాల కోసం కోట్లాది మంది కార్మికుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టేందుకు సిద్ధపడిందని, పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం కోసం వాళ్ల లాభాలు రెట్టింపు చేయడం కోసమే కార్మిక చట్టాలను రద్దు చేసిందని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు ఆరోపించారు. శుక్రవారం మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో జరిగిన సమావేశంలో సాయిబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన నిలబడుతూ కోట్లాది మంది పేద కార్మికులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం అమలు చేయకుండా, చట్టాలను అమలు చేయకుండా, రూ.21 వేలకు పంచకుండా తాత్సారం చేస్తూ పెట్టుబడిదారుల కొమ్ము కాయడం సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు అమలు చేయాలని, కాలపరిమితి ముగిసిన జీవోల స్థానంలో కొత్త జీవోలు ఇవ్వాలని ఈనెల 26న జరుగుతున్న కార్యక్రమం జయప్రదం చేయాలని, తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోలను ఇవ్వాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ సభ్యులు సుదీప్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జై.మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కమిటీ కన్వీనర్ ఎస్.మహిపాల్ మహీంద్రా అండ్ మహీంద్రా యూనియన్ జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి, నాయకులు కనక రెడ్డి, వీరయ్య గౌడ్, నరేష్, శ్రీకాంత్, కిరణ్ తదితరులు ఉన్నారు.