Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-కొండపాక
జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఆనంతరెడ్డి, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హన్మకొండ, సిద్ధిపేట, మెదక్ జిల్లాల మీదుగా 137.6 కిలో మీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించినట్లు, వీటిలో ఎల్కతుర్తి నుంచి సిద్ధిపేటకు 573.85 కోట్లతో నిర్వహణ వ్యయంతో 64 కిలో మీటర్లు మేర ప్యాకేజీ-2, సిద్ధిపేట నుంచి మెదక్ వరకూ 882.18 కోట్లతో నిర్వహణ వ్యయంతో 69 కిలో మీటర్లు మేర ప్యాకేజీ-1, సిద్ధిపేట జిల్లాలో దాదాపు 80 కిలో మీటర్ల మేర నేషనల్ హైవే, అలాగే జనగామ జిల్లా నుంచి చేర్యాల, సిద్ధిపేట మీదుగా సిరిసిల్లా వరకూ సుమారు 105 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేపై సాగుతున్న రహదారి నిర్మాణ అంశాలపై అధికార వర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఆర్అండ్ బీ, ఫారెస్ట్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, రెవెన్యూ, రైల్వే శాఖల సమన్వయంతో హైవే నిర్మాణంలో ఏలాంటి సమస్యలకు తావివ్వకుండా పనులు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ప్యాకేజీ-1 లో సిద్దిపేట రూరల్ మండలం తిమ్మాపూర్ నుంచి రంగధాంపల్లి వరకు 12 కిలోమీటర్లు మేర, ప్యాకేజీ-2 లో రంగదాంపల్లి నుంచి పాలమాకుల వరకు 10 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారి నిర్మించినట్లు కలెక్టర్‌కు తెలిపారు మిగతా రహదారి వెంబడి గ్రామ పరిధి ప్రాంతాల్లో మాత్రమే 4 లైన్ల రహదారి మిగతా ప్రాంతాల్లో అలాగే రెండు వరసల రహదారిగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలియజేశారు. రోడ్డు వెంబడి ట్రీ ఫీలింగ్ పర్మిషన్ సంబంధించిన పనులను డిఎఫ్ఓ కె.శ్రీనివాస్ మరొకసారి వెరిఫికేషన్ చేయాలని సూచించారు. భూ సేకరణ, ఇరిగేషన్ కాలువలు, ఎలక్ట్రికల్ సంబంధించి ఎస్టిమేట్లు, పర్మిషన్లు తొందరగా చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద ప్రాజెక్ట్ కావున డిజైనర్లో ఏమైనా లోపాలు ఉంటే సరిచూసుకోవాలన్నారు. భవిష్యత్తులో కాలువలు వచ్చే సూచనలు ఉన్న చోట మరొకసారి వెరిఫై చేసుకొని డిజైన్ తయారు చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా జిల్లాలో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులు ఉన్నందున వాటికి సంబంధించిన కెనాల్ పనులకు రహదారిపై బ్రిడ్జి వర్క్ సంబంధించి, రైల్వే లైన్ సంబంధించి బ్రిడ్జి వర్క్‌లు చేస్తున్న అధికారులను అందరితో సమావేశం ఏర్పరచుకొని నేషనల్ హైవేకు డిజైన్ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు మున్సిపాలిటీ జంక్షన్ ప్రాంతాల్లో హై లెవెల్ బ్రిడ్జి చుట్టూ భూసేకరణ ఎక్కువగా చేసుకోవాలని తెలిపారు. అండర్ పాస్-సబ్ బ్రిడ్జిలకు సంబంధించి డిజైన్‌ను మంత్రికి చూపించి వెరిఫై చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో పనులకు ఆటంకాలు లేకుండా నిర్మాణ పనులు ముందుకు సాగాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.