Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్) :
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టిని పెట్టి చెట్ల పెంపకం చేబడుతుండగా మరో వైపు ఏపుగా పెరిగిన చెట్లను అధికారులు నరుకుతున్నారు. కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న మొక్కలు నరికేస్తున్నారు. మనోహరాబాద్ మండంలోని దండుపల్లి నుంచి రంగాయిపల్లికి వెళ్లే దారికి ఇరువైపులా గ్రామాల సర్పంచ్‌లు నాయకులు పెద్ద ఎత్తున మొక్కలను పెట్టి వాటిని సంరక్షించారు. దాంతో మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. దాంతో విద్యుత్ తీగలకు ఆటంకం కలుగుతుందనే కారణంతో విద్యుత్ అధికారులు పెరిగిన చెట్లను నరికేస్తున్నారు. అధికారుల, సర్పంచ్ల ముందు చూపు కొరవడడంతోనే ఏపుగా పెరిగిన చెట్లను విద్యుత్ అధికారులు నరికేస్తున్నారు. మండల అధికారులు, సర్పంచ్‌లు ముందుగానే విద్యుత్ లైన్లకు ఆటంకం లేని స్థలాలను ఎంపిక చేసి మొక్కలను నాటితే ఏపుగా పెద్దగా పెరిగిన చెట్లను నరికివేతకు గురయ్యేవేకావని ప్రజలు అంటున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను మొక్కల పెంపకానికి కేటాయిస్తుంది. దాంతో అధికారులు మొక్కల పెంపకం కోసం సర్పంచ్‌లపై వత్తిడి తీసుకువచ్చి పెంపకం చేపడుతున్నారు. కానీ ముందు చూపు లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నెరవేరకుండా పోతుంది. ఇప్పటికైనా అధికారులు మొక్కలను నాటే ముందు విద్యుత్ లైన్లను చూసి మొక్కలను నాటాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.