Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ రూరల్
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, మహిళలందరూ బతుకమ్మ పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకోవాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నుంచి అక్టోబర్ మూడు వరకు తొమ్మిది రోజులపాటు తీరొక్క రీతిన నిర్వహించుకునే బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ వివిధ శాఖ అధికారులకు విధులను కేటాయించారు. ఆ మేరకు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంగిలిపూల బతుకమ్మను జిల్లా సైన్స్ అధికారి బతుకమ్మ సమన్వయాధికారి రాజిరెడ్డిలతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. నువ్వులు నూకలు బెల్లంతో చేసిన బతుకమ్మను ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి బొడ్డెమ్మల చుట్టూ కోలాటం ఆడిపాడి సందడి చేశారు. ఇందులో స్వయం సహాయక సంఘ సభ్యులు మహిళ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిర రాజిరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. ఈ పండుగ సామాజిక సమైక్యతకు దోహదపడుతుందన్నారు మహిళలు పూలనే దేవతగా భావించి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని వారన్నారు. సోమవారం డీఆర్డీఓ ఆధ్వర్యంలో అటుకుల బతుకమ్మ కార్యక్రమంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.