Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాథ అంధుడి అవస్థలు వర్ణనాతీతం సంవత్సరకాలంగా బస్టాండ్లోనే నివాసం నీళ్ల సీసా, పళ్లెం, దుప్పటే ఆయాన ఆస్తులు
నవతెలంగాణ-వర్గల్
అయినవాళ్లందరినీ దూరం చేసుకొని అనాథగా మిగిలాడు వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన అరేపల్లి నర్సిములు. సంవత్సరకాలంగా బస్టాండ్లోనే జీవనం సాగిస్తున్నారు. ఓ నీళ్ల సీసా, పళ్లెం, దుప్పటి ఆయనకు ప్రస్తుతం ఉన్న ఆస్తులు. ఆకలి వేస్తే ఊర్లోకి వెళ్లి అన్నం తెచ్చుకుని తింటాడు. దొరికిన రోజు తింటాడు. లేనిరోజులు పస్తులే పడుకుంటాడు. నర్సిములు గతంలో ఆరోగ్యవంతంగా ఉండేవాడు. ఈయనకు సాగు భూమి, ఇల్లు, భార్య పిల్లలు ఉండేవారు. తనకు ఉన్న ఆస్తులను, ఇల్లును అమ్ముకొని జల్సాలు చేశాడు. స్నేహితులకు మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇస్తే తిరిగి ఇవ్వకుండా తనను మోసం చేసాడని వాపోతున్నాడు. మూడు సంవత్సరాలుగా ఆయన కంటిచూపు పూర్తిగా పోయింది. ఉండడానికి ఇల్లు లేకపోవడంతో రోడ్డున పడ్డాడు. భార్యా పిల్లలు ఆయనను వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం అనాథగా మారి ఆ గ్రామ బస్టాండ్లో ఉంటున్నాడు. వాన, చలి, ఎండ ఇవేవీ తేడా లేకుండా బస్టాండ్లోనే కాలం వెళ్లదీస్తున్నాడు. మెయిన్ రోడ్డుపై బస్టాండ్లో ఉంటున్న నర్సింలును ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపనపోలేదు. 'నాకు కళ్లు కనిపించడం లేదు. పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాకు పింఛన్ మంజూరు చేయాలని గ్రామంలోని పలువురు నాయకులకు విన్నపించుకున్నా ఫలితం లేకుండా పోయింది' అని వాపోతున్నాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నర్సింలు విలాసవంతమైన జీవితం గడుపుతూ భార్యా పిల్లలను పట్టించుకోకపోవడంతో దూరమయ్యారు. కూతరు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో అనాథగా మారాడు. ఆకలి వేసినప్పుడు గ్రామంలోనికి వెళితే ఎవరైనా అన్నం పెడితే తింటానని, పెట్టకపోతే మంచినీళ్లు తాగి పస్తులు పడుకుంటున్నానని అంటున్నాడు. ఎలాంటి సహాయం కావాలి? నర్సిములును నవ తెలంగాణ ప్రశ్నిస్తే తనను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలని దీనస్వరంతో విన్నవించుకున్నాడు. జిల్లా అధికారులు స్పందించి నర్సిములును అనాథాశ్రమంలో చేర్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.