Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెమ్ టెక్నాలజీస్ నైపుణ్య అభివద్ధి శిక్షణ కేంద్రంను ప్రారంభించాలి
వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్డెస్క్
జిల్లాలో దళితబంధును పటిష్టంగా అమలు చేయాలని, లబ్ధిదారులు ఆర్థికంగా అభివద్ధి చెందేలా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శనివారం రాత్రి జిల్లా అధికారులతో పలు అభివద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బందులో వంద శాతం గ్రౌండింగ్ పూర్తి కావాలన్నారు. (444) మంది లబ్ధిదారులకు ఇచ్చిన యూనిట్లను అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలన్నారు. వ్యక్తి వారీగా, గ్రామం, నియోజ కవర్గం వారీగా దళిత బంధు తో లాభపడ్డారా అన్న విషయమై వారి జీవన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వారు ఎంచుకున్న యూనిట్ తో విజయవంతం అయ్యేలా పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. మంత్రి త్వరలో లబ్ధిదారులతో నేరుగా కలిసి మాట్లాడనునట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లాకు ప్రత్యేక అభివద్ధి నిధుల (ఎస్డీఎఘ) కింద మంజూరు చేసిన రూ.374 కోట్లతో చేపట్టిన పనులకు టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి, చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. నిమ్జ్ ప్రాజెక్ట్ వెమ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నైపుణ్యత అభివద్ధి శిక్షణ కేంద్రాన్ని దసరా తరువాత జహీరాబాద్‌లోని సమీకత వసతి గహంలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూములు కోల్పోయిన కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాలలో ఆసక్తి గల నిరుద్యోగ యువత నుండి నైపుణ్యత అభివద్ధి శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరించి శిక్షణ నివ్వాలని సూచించారు. జిల్లాకు 5 పీహెచ్‌సీల కు రూ.7.80 కోట్లు, 6 బస్తీ దవాఖానాలకు రూ.78 లక్షలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. పనులు త్వరగా పూర్తయ్యేలా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. జహీరాబాద్ ఆటోనగర్ కు సంబంధించి క్షేత్ర పరిశీలన చేసి తగు మంజూరు తీసుకోవాలని టీఎస్ఐఐసి అధికారులకు ఆదేశించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమల యాజమాన్యాల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పరిశ్రమలు అధికంగా ఉన్నప్పటికీ పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా ఈ ప్రాంత అభివద్ధికి దోహదపడటం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కంపెనీస్ యాక్ట్ మేరకు సిఎస్ఆర్ కింద వివిధ అభివద్ధి పనులకు నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికి, ఇప్పటివరకు ఏ ఒక్కరు జమ చేయకపోవడం పై మంత్రి అసంతప్తి వ్యక్తం చేశారు. నియంత్రణ పద్ధతిలో సిఎస్ ఆర్ నిధులను రాబట్టాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఈ, పరిశ్రమల శాఖ జీఎం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, తదితరులతో టీం ఏర్పాటు చేసి పరిశ్రమల లెక్కలను తనిఖీ చేయాలన్నారు. కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ కు సూచించారు. ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, తెలంగాణ హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.