Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నియోజవర్గ అభివృద్ధిపై మాటల యుద్ధం
- తాను పూర్తి చేసిన లిప్టు ఇరిగేషన్ ప్రారంభించట్లేదన్న రాజనర్సింహ
- అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటున్న క్రాంతికిరణ్
- సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు మునిపల్లి మండల సమావేశంలో బాహాబాయి
ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అందోల్ నియోజకవర్గంలో రాజకీయ రచ్చ మొదలైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఉప ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నియోజకవర్గంపై పట్టు కోసం ఒకర్ని మించి ఒకరు ఎత్తులు వేస్తున్నారు. సంక్షేమ పథకాల మంజూరులో రాజకీయ రంగు పులుముకుంటోంది. నియోజకవర్గ అభివృద్ధిపై కూడా సవాళ్లపర్వం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్లు తెగ పోటీ పడుతున్నాయి. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మరోసారి గెలుపు దిశగా ముందుకు సాగుతుండగా మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ ఈసారి గెలిచి తీరాలన్నట్టు పావులు కదుపుతున్నారు. ఇద్దరూ నియోజకవర్గాన్ని అంటుపెట్టుకుని పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుండగా.. టీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లో ప్రచారం చేస్తోంది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
అందోల్ నియోజకవర్గ అభివృద్ధి అనే ఆంశం చర్చనీ యాంశమైంది. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే దామోదర రాజ నర్సింహ్మ విమర్శిస్తున్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని, తాను ఎమ్మెల్యేగా మంత్రి గా ఉన్నప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటూ రాజనర్సింహ్మ ప్రచారం చేస్తున్నారు. రేగోడు మండలంలోని గజ్వాడ గ్రామంలో టీఆర్ఎస్కు చెందిన 40 కుటుంబాలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఆ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉ న్నప్పుడు బోరంచలో రూ.21 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశానని, దానిని ఇంత వరకు ప్రారంభిం చలేదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ను ఉద్దేశించి విమర్శ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఖండించారు. టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా అంటూ తన క్యాంపు కార్యాలయంలో సవాల్ విసిరారు. ఓటమి తప్పదనే భయంతోనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు.
సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు వివాదం
సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు పులుము తున్నారనే వివాదం ఉంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాల్ని చూస్తున్నారనే విమర్శ ఉంది. ఇటీవల మునిపల్లి మండలంలో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ వివాదంగా మారింది. స్థానిక తహశీల్దార్ లబ్ధిదారులకు చెక్కులివ్వకపోవడం, రాతపూర్వకంగా హామీ ఇవ్వడం వంటి విషయాలపై మండల పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచ్లు నిలదీశారు. టీఆర్ఎస్ వాళ్లు కాదనే నెపంతోనే 10 మందికి చెక్కులివ్వలేదని సమావేశం లో బైటాయించి నిరసన తెలిపారు. ఆసరా పింఛన్ల మంజూ రులోనూ టీఆర్ఎస్ కానివాళ్లకు మంజూరివ్వడంలేదనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై నియోజకవర్గం లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ విమర్శల్ని టీఆర్ఎస్ నాయకులు తిప్పికొడుతున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు.
రెండు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు టీఆర్ఎస్
ఆందోల్ నియోజకవర్గంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ్మ గెలుపొంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదేళ్ల పాటు నియోకవర్గంలో అంతా తానై నడిపారు. తెలంగాణ ఆవిర్భవం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ వరుసగా గెలిచింది. ప్రస్తుత ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గత ఎన్నికల్లో రాజనర్సింహ్మపై 16465 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ వీరి మధ్యనే తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. దీంతో గెలుపు కోసం ఇద్దరూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఉండడం, నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేయడం క్రాంతి కిరణ్కు కలిసిరానుంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుండడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసొస్తుందన్న భరోసా కాంగ్రెస్లో కనిపిస్తుంది. రసవత్తరంగా సాగుతోన్న రాజకీయ రచ్చలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.