Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, మీ తండ్రి చనిపోయినందున మీకు ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం కింద డబ్బులు వస్తాయని నమ్మబలికించాడు. వారి నుంచి ఫోన్ ద్వారా కొంత డబ్బు వేయించుకున్నాడు. వారికి ఎలాంటి పథకం కింద డబ్బులు ఇప్పించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు చేర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ దర్యాప్తు చేశారు. బుధవారం చేర్యాల పట్టణంలో మరికొంతమందికి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్న మోసగాళ్లు కామారెడ్డి జిల్లాకు చెందిన విస్లావత్ నారాయణ, రాథోడ్ బాలాజీలను గురువారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుల నుంచి రూ.1.40 లక్షలు రికవరీ చేసినట్టు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. నిందితులు గతంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక, కొమురవెళ్లి మండలాలు, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం, జోగులంబ జిల్లాలో కూడా ఇలాంటి మోసాలు చేసినట్టు విచారణలో తేలిందన్నారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ భాస్కర్ రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకట్, భాస్కర్, నవీన్, రమేష్ చాకచక్యంగా నిందితులను పట్టుకున్నందుకు వారిని ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ అభినందించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు ఇప్పిస్తామని చెబితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.