Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘటన స్థలానికి చేరుకొని నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-వెల్దుర్తి
ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో డీసీఎం ఇరుక్కున్న సంఘటన మండల కేంద్రంలోని ఆరెగూడెం ఉప్పు లింగాపూర్ గ్రామాల మధ్యన గురువారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పులింగాపూర్ నుంచి వెల్దుర్తికి వస్తున్న ఆటో, వెల్దుర్తి నుంచి ఉప్పులింగాపూర్ వైపు వెళుతున్న డీసీఎం ఆటోకు సైడ్ ఇవ్వబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో ఇరుక్కుందని తెలిపారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియడంతో టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతం నెల రోజుల క్రితం రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, గుంతలలో మోకాలు లోతుల్లో నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. రోడ్ల్లపైన ఏర్పడిన గుంతలలో నాట్లు వేసి నిరసన తెలిపిన రోజున టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడికి దిగి ఒకటి రెండు గుంతలను ఎత్తిచూపడం సరికాదని, త్వరలోనే గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేస్తామని మాటిచ్చారన్నారు. మాట ఇచ్చి నెల రోజులైనా ఇప్పటివరకు రోడ్ల దుస్థితి పట్టించుకునే నాధుడే కరువయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికార పార్టీ టీఆర్ఎస్ రోడ్ల దుస్థితిని పట్టించుకుని గుంతలు పూడ్చి రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చాలని డిమాండ్ చేశారు.