Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణిస్తే అంత్యక్రియలకు స్థలం లేదు
- మంత్రి చుట్టూ తిరుగుతున్న నిర్వాసితులు
- అందని పూర్తిస్థాయి నష్టపరిహారం, ప్యాకేజీ
- ఎక్కడా డంపింగ్ యాడ్స్ లేవు
- ఇంకా అందని ప్లాట్లు
నవతెలంగాణ-గజ్వేల్
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నిర్వాసితులకు సరైన వసతులు, ప్యాకేజీ, నష్టపరిహారం పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం మరణిస్తే ఎక్కడ అంత్యక్రియలు చేసుకోవాలో నిర్వాసితులకు తెలియడం లేదు. ఊరుగాని ఊరు, పట్టణంగాని పట్టణం మల్లన్నసాగర్ నిర్వాసితులను తరలించే ప్రాజెక్టు నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం ఇస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో అన్ని వసతులు ఉంటాయని భావించిన ఫలితం లేకుండాపోతోంది. ఈ గ్రామానికి ఇంకా స్మశానవాటిక నిర్మించలేకపోయారు. స్థలాలు కేటాయించలేదు. చనిపోయిన రోజు ఆ కుటుంబం బాధలు అంతాఇంతా కాదు. నాలుగు కిలోమీటర్ల ఉన్న గజ్వేల్ పట్టణంలో ఉన్న స్మశానవాటికకు తీసుకరావడం తప్పడం లేదు. అదేవిధంగా చెత్త వేయడానికి డంపింగ్ యార్డు లేదు. మల్లన్నసాగర్ ఆర్ఆర్ కాలనీలో ఎక్కడి సమ స్యలు అక్కడే మూలుగుతున్నాయి. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా భూనిర్వాసిత కాలనీ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. సమస్యలను తీర్చాలంటూ భూనిర్వాసితులు తొగుట తహసీల్దారు, గజ్వేల్, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయాలు, సిద్దిపేట కలెక్టరేట్, మంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ముంపు గ్రామాల్లో 11 పాఠశాలల్లో 50 మంది ఉపాధ్యాయులు గతంలో పని చేస్తుండగా, ప్రస్తుతం కేవలం మూడు పాఠశాలలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిల్లో 29 మంది ఉపాధ్యాయులను నియమించింది. వారిలో 10 మంది మాత్రమే విధులకు వస్తుండగా, 13 మంది కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏడాది క్రితమే పునారాస కాలానికి తొగుట, కొండపాక మండలం నుంచి భూ నిర్వాసితులు గజ్వేల్‌కి వచ్చారు. సింగారం, బ్రాహ్మణ బంజేడుపల్లి, లక్ష్మాపూర్, రాంపూర్ గ్రామాల ప్రజలు గజ్వేల్ ప్రజ్ఞాహర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్, ముట్రాజ్ పల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఏడాది క్రితం తరలివచ్చారు. వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. భూనిర్వాసిత కాలనీలో పూర్తి స్థాయి పనులు చేపట్టకపోవడం, చేసిన పనుల్లో నాణ్యత లోపించడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వర్షం వస్తే గోడలు పూర్తిగా నీరుపట్టడం, పూర్తిస్థాయిలో మురుగునీటి కాలువలు, రోడ్లు ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని ఒక ఏటిగడ్డ కిష్టాపూర్ పాఠశాలలో 400 మంది విద్యార్థులుంటే కేవలం నలుగురు మాత్రమే ఉపాధ్యాయులున్నారు. గ్రామాల్లో స్మశానవాటికలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన ముస్లిం మహిళ మృతి చెందితే సర్పంచ్ సంగాపూర్ గ్రామస్తులతో మాట్లాడి మృతదేహాన్ని ఖననం చేసే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు. ఇక ప్యాకేజీలు, పరిహారం విషయానికి వస్తే దాదాపు వంద కోట్లకుపైగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. బ్యాంకుల నిర్మాణం సాగుతుండగా, గ్రామాల్లో ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు బహిరంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవలే ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ చామరంచ ప్రతాప్‌రెడ్డి, ఎర్రపల్లి ఉపసర్పంచ్ మంత్రి హరీశరావును కలిసి తమ సమస్యలు విన్నవించుకోగా త్వరలోనే పరిష్కారం చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల మంత్రి హరీశ్‌రావు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష చేసి గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికైనా భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.