Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకటమావో
నవతెలంగాణ-చేర్యాల
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాటలకు చేతులకు పొంతనలేదని సీపీఐ(ఎం) చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో మంగళవారం కార్యకర్తలతో కలిసి వెంకటమావో మాట్లాడుతూ చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధునాతన వసతులతో కూడిన భవన నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసిందని, దసరా రోజున వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా చేర్యాల మంండల కేంద్రంలోని పాల సీతలీకరణ కేంద్ర స్థలంలో శిలాఫలకానికి భూమిపూజ చేయనున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్న మాటలలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కొత్త ఆసుపత్రిని నిర్మిస్తేనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుం దనే మాటలను ప్రజలు నమ్మవద్దని, ప్రస్తుతం మండల కేంద్రంలో గల 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరత కొట్టొ చ్చినట్టు కనబడుతోందన్నారు. సరిపోను డాక్టర్లను ప్రభుత్వం నియమించే పరిస్థితి లేదన్నారు. పిల్లల డాక్టరు, జనరల్ ఫిజీషియన్, రేడియాలజీ, పీడియాట్రిక్ స్పెషలిస్టులు, అనస్తియా డాక్టర్ లేరన్నారు. ఎంఎన్ఓ, ఎఫ్ ఎన్ ఓ, అల్ట్రా సౌండ్ మిషన్, డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ మిషన్లు ఆసుపత్రిలో అత్యవసరమన్నారు.
పోస్టుమార్టం నిర్వహించే డాక్టర్ లేడని తెలిపారు. సరైన పరికరాలు, మందులు లేక ప్రస్తుతమున్న ఈ ఆసుపత్రికి వస్తున్న రోగులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. దీన్ని పట్టించుకుని చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాని సిపిఐ(ఎం) తో పాటు ఇతర పార్టీలు, ప్రజాసంఘాల తరపున ఎన్నోసార్లు నిరసనలు తెలియజేసి ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏనాడు ఎమ్మెల్యే, మంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రి ఈ స్థితిలో ఉంటే కొత్తగా మూడు ఎకరాల స్థలంలో నిర్మించబోతున్నామని ఈ కొత్త భవనం నిర్మాణం అయిన తర్వాత చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయనడం సిగ్గుచేటు అన్నారు. ప్రస్తుతమున్న 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్లను సిబ్బందిని, అధునాతన పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నిర్మించబోయే ఆసుపత్రి ప్రస్తుతం ఉన్న దానికన్నా పెద్ద ఆస్పత్రిగా ఉండాలని, అందుకు 50 నుంచి 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోరుకునే మంత్రి, ఎమ్మెల్యే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని వ్యవహరించాలన్నారు. చేర్యాల ప్రాంత అభివృద్ధిని కోరుకుని తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇష్టానుసారంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలు గుణపాఠం చెబుతార న్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మేడిపల్లి చందు, కత్తుల భాస్కర్ రెడ్డి, చేర్యాల పట్టణ కమిటీ సభ్యులు ముస్త్యాల ప్రభాకర్, బోయిని మల్లేశం, కొమురవెల్లి మండల కమిటీ సభ్యుడు బక్కిల్లి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.