Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కరకురాని వానలతో రైతన్న ఆగం
- చెరువులను తలపిస్తున్న పంట పొలాలు.. ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ-పుల్కల్
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమ యంలో అకాల వర్షాల ధాటికి నీటిపాలైంది. కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పూత, కాత దశలో ఉన్న పత్తి చేన్లలో వరద నీరు నిలిచి పంట మొత్తం దెబ్బతింటున్నది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే సరిగ్గా చేతికొచ్చే సమయానికే వర్షాలు పడి.. నోటికాడి ముద్దను ఎత్తుకెళ్లినట్టు అయిం దని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పుల్కల్ ఉమ్మడి మండలంలో 15వేల హెక్టార్లలో పత్తి పంట, 19 వేల హెక్టార్లలో వరి సాగు, 430 ఎకరాలలో మిర్చి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవలే వరు సుగా కొన్ని రోజుల తరబడి వర్షాలు పడడంతో.. పంట చేలన్నీ నీటితో నిండిపోయాయి. గతంలో వర్షాలకు దెబ్బ తిన్న పత్తి పంటల్లో.. కాస్తో కూస్తో కాయలు వచ్చాయి. కాగా ప్రస్తుతం చేన్లన్నీ నీటితో నిండి ఉండడంతో ఆ కాయలు కూడా కుళ్లిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు వాపోతున్నా రు. ఇక మిరప తోటలో వేర్లు కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టామని.. ఇలా అయితే ఏం చేసి అప్పులు తీర్చాలని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి : చైతన్య, మండల వ్యవసాయ అధికారి
అధిక వర్షపాతం కారణంగా పత్తి పంట లేత పసుపు రంగుకు మారుతుంది. కాయ కుళ్లే అవకాశం ఉంది. వర్షాలు అనంతరం పత్తి పంటకు పురుగు అగ్గితెగులు ఆశించే అవకాశం ఉంటుంది. మిరప పంటకు వేరు కుళ్లి కాండం, కొమ్మలకు ఆకుపచ్చ తెగుళ్ళు ఆశించవచ్చు. వరి పూత దశలో ఉన్నందున తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో పంటలను రక్షించుకోవచ్చన్నారు.