Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డిలోని స్థానిక సుంద రయ్య భవన్లో సీఐటీయూ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుధ్య పనులతో పాటు గ్రామాల్లో అనేక పనులు చేస్తున్నప్పటికీ వారికి కనీస వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్య పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చి రూ.8,500 ప్రకటించినా.. అనేక గ్రామాల్లో అమలు కావడం లేదన్నారు. సబ్బులు, నూనెలు ఇతర చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగు తున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కనీస వేతనం చట్టపరమైన సౌకర్యాల కోసం భవిష్యత్తులో కార్మికులు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల కోసం ఆలోచించాలని లేనట్టయితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు బాబు రావు, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు సత్తయ్య దశరథ్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.