Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గిరిజన యువకుడు ధరావత్ నిఖిల్ నాయక్‌ను హత్య చేసినవారిని నేటికీ పట్టుకోకపోవడం ముమ్మాటికి పోలీసుల వైఫల్యమే నని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మానిక్ మాట్లాడుతూ.. యువ లాయర్ ధరావత్ నిఖిల్‌ది ముమ్మాటికీ కుల దురహంకార హత్యేనని ఆరోపించారు. హత్య జరిగి పది రోజులు కావస్తున్నా.. ఇంతవరకు నిందితులను గుర్తించక పోవడం దారుణమన్నారు. దీనికి ఆ జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు టెక్నాలజీ పరంగా ప్రథమ స్థానమని చెప్పుకునే ప్రభుత్వం నిఖిల్ హత్య జరిగి 10రోజులు కావస్తున్నా దుండగులను ఎందుకు గుర్తించలేదో పోలీసులు సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. హత్య చేసిన దుండగులను పట్టుకోకపోతే జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లలో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దళిత, గిరిజన ప్రజా సంఘాలను సంప్రదించి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు, జిల్లా సహాయ కార్యదర్శి రామచందర్ ప్రవీణ్ ,జిల్లా కమిటీ సభ్యులు దాస్,గంగారం, జయరాం,మోసప్ప, వసంత్, గణపతి, కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.