Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమృద్ధిగా విటమిన్ 'సి'.. మెండుగా కాల్షియం
- ఆహారం జీర్ణమయ్యేందుకు పీచు పదార్థం
- అతిసారం, చక్కెర వ్యాధిక చక్కటి ఔషదం
- ఈ సీజనల్ ఫలాన్ని కచ్చితంగా రుచి చూడాలి : వైద్యులు
నవతెలంగాణ-మునిపల్లి
సీజన్ వస్తోందంటే చాలు.. కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. సీతా ఫలాలు ఆ కోవకే చెందుతాయి. కేవలం శీతలకాలంలో మూడు నెలలకు పైగా మాత్రమే లభించే సీతాఫలంలో బోలె డన్నీ ఔషద గుణాలుంటాయి. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది.
మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణ జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే 'కస్టర్డ్ యాపిల్ అనీ షుగర్ యాపిల్' అనీ పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా దేశాలతోపాటు మనదేశంలోనూ విరివిగా పండుతుంది. గ్రామాల్లో శీతలఫల చెట్లు చెప్పలేనంతగా ఉంటాయి. చాలామంది పచ్చి సీతాఫలాలను ఇంటికి తీసుకువెళ్లి గోనే సంచిలో పెట్టి మాగపెడుతుంటారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతీ ఒక్కరి ఇంట్లో ఇది కచ్చితంగా జరిగే ఉంటుంది. ఈ పండును తినడంతో పాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్క్రీములు, జామ్లో వాడుతుంటారు. మనందరికీ పండుగానే సుపరిచితమైన ఇది ఛత్తీస్గఢ్ వాసులకు మాత్రం అద్భుత ఔషధీఫలంగా ఉపయోగపడుతున్నది. దీని ఆకులు, బెరడు, వేరు ఇలా అన్ని భాగాల్నీ అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడతా రు. మనదగ్గర కూడా చాలామంది సెగ్గడ్డల కు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు. వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. బెర డుని మరిగించి తీసిన డికాక్షన్ డయేరియాని తగ్గిస్తుంది. అలాగే ఆకుల కషాయం జలుబుని నివారిస్తుంది.
లభ్యమయ్యే ఔషదాలు..
ఈ పండులో 100గ్రా గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20-25గ్రా పిండిపదార్థాలు, 2.5గ్రా ప్రొటీన్లు, 4.4గ్రా పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్, థైమీన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభి స్తుంది. ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు ఎముకల పరిపుష్టికి తోడ్పడ తాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌష ధంలా పనిచేస్తుంది.హృద్రోగులు, కండరాలు, నరాల బలహీ నత ఉన్నవారు దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయో జనం ఉంటుంది. డైటింగ్ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. పండులోని సల్ఫర్ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది. వీటి ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుం టే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది. సీతాఫలంలో సి విటమిన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి.