Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనావాసాల మధ్య టపాసుల విక్రయాలు
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
- నిబంధనలు పాటించని వ్యాపారులు
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వ్యాపారస్తులు అంతా.. మా ఇష్టమనే విధంగా వ్యవహరిస్తున్నారు. జనావాసాల మధ్య యథేచ్ఛగా బాణాసంచా దందా జోరుగా సాగిస్తున్నా అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడే అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు హడావుడి చేస్తూ తర్వాత పట్టించుకోకపోవడం శరామామూలైపోయిందని ప్రజలు మండిపడుతున్నారు. బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యాపారస్తులు జనసంచారం ఉండే రోడ్లపై నిబంధనలకు విరుద్దంగా యథేచ్ఛగా టపాసుల విక్రయాలు సాగిస్తున్నారు. టపాసుల విక్రయ దుకాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ఎక్కడా కానరావడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి టపాసుల విక్రయదారులు తగిన జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పిస్తారో? లేదో వేచిచూడాలి.
నిబంధనలు ఇలా..
- జనవాసాల మధ్య టపాసుల అమ్మకం చేపట్టరాదు
- బాణాసంచా విక్రయదారులు రెండు దుకాణాలకు మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి
- దుకాణాలను రేకుల షెడ్డులోనే ఏర్పాటు చేయాలి
- దుకాణం ఎదుట 200 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు బ్యారల్స్ అందుబాటులో ఉంచాలి
- దుకాణం వద్ద మంటలు ఆర్పే యంత్రాన్ని(ఫైర్ ఎక్స్టింగ్విషర్) విధిగా ఏర్పాటు చేయాలి
- దుకాణాల వద్ద చెత్తాచెదారం వేయకూడదు
- షాపులలో పెట్రోమాక్స్లైటుగానీ, దీపాలుగానీ వాడరాదు
- విద్యుత్ సరఫరాకు అతుకులు లేని ఐఎస్ఐ మార్క్ కలిగిన వైర్లనే వాడాలి
- దుకాణాలకు 100 మీటర్ల పరిధిలో టపాసులను కాల్చరాదు
- 18 సంవత్సరాలలోపు పిల్లలను షాపులో పనికి పెట్టుకోకూడదు
- విక్రయదారులు కాటన్ దుస్తులనే ధరించాలి
ఉపాధ్యాయులే టపాసుల దుకాణం నిర్వహణ
నవ తెలంగాణ-కౌడిపల్లి
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు పక్కదారి పడుతూ వ్యాపారం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. కౌడిపల్లి మండల పరిధిలోని పీర్యతండా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కరుణాకర్‌రెడ్డి, మాన్సింగ్ తండా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మాణిక్యం, సలబత్‌పూర్ తండా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ముగ్గురు కలిసి లక్షలాది రూపాయలు వెచ్చించి టపాసుల దుకాణం ఏర్పాటు చేసినా పట్టించుకునే వారేకరువయ్యారు. కూకట్పల్లి రోడ్డుకు ఇరువైపులా టపాసుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అవేవీ తీసుకోకుండానే తాము ఉపాధ్యాయులమని, తమను ఎవరు అడుగుతారని దర్జాగా టపాసుల దుకాణం నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాల్సిన ఉపాధ్యాయులు ఎప్పుడూ టపాసుల దుకాణానికి ఎప్పుడు వెళ్తామా? అని వారి పని విధానం కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ రమేష్‌ను వివరణ కోరగా ఉపాధ్యాయులు ఎలాంటి టపాసుల దుకాణాలు నిర్వహించరాదని తెలిపారు.