Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొమురవెల్లి కనకయ్య
నవతెలంగాణ-కొండపాక
వ్యవసాయ కార్మికులకు కనీస కూలీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొమరవెల్లి కనకయ్య, తటోజు రవీంద్ర చారి అన్నారు. శుక్రవారం వెలికట్ట గ్రామ శివారులో విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు అనేక ఇబ్బందులతో జీవిస్తున్నా రన్నారు. వీరి పట్ల ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని, దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతుకు బాసటగా నిలుస్తూ రైతుల పొలాల్లో నిత్యం పనిచేస్తూ రెక్కలే ఆస్తులుగా దేశ సంపదకు దోహదపడుతున్నరన్నారు. వ్యవసాయ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ కార్మికులకు, కార్మిక వర్గానికి ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలిరేట్లను రూ.600 లకు పెంచాలని, సంవత్సరంలో కుటుంబానికి 200 పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో కూలీలకు కనీస కూలీ రేటు అమలు చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, సబ్సిడీ ధరలపై రేషన్ షాపుల ద్వారా 16 రకాల సరుకులను అందించాలని కోరారు. అర్హులైన వ్యవసాయ కార్మిక కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలను మంజూరు చేయాలని, రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం ధరణి వ్యవస్థను తెచ్చిన తర్వాత పేదల భూములకు హక్కులు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వహిస్తుం దన్నారు. వెంటనే ధరణి పోర్టల్లో మార్పులు తెచ్చి పేదల భూములకు పాస్ బుక్కులు ఇవ్వాలన్నారు. సెంటు భూ మిలేని కూలీలందరికీ కూలి బందు పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ కార్మికులు తమ హక్కుల సాధన కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించే పోరాటాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులను తమ హక్కులకై పోరాడేందుకు సంసిద్ధం చేసేందుకు అక్టోబర్ 31న సిద్దిపేట జిల్లాలో జరుగు జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కనకయ్య కోరారు.