Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
నవతెలంగాణ-దుబ్బాక
ఒడ్డుదాటే దాకా ఓడమల్లన్న.. ఒడ్డు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ఏ పార్టీ అయినా రైతుల పేరు వాడుకొని గద్దెనెక్కుతూ నేడు వారి సమస్యలను పట్టించు కోవడం లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నక్కల యాదవ రెడ్డి విమర్శించారు .రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని గొప్పలు చెప్పడమే తప్పా ఏ ప్రభుత్వమైనా వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి అధ్యక్షతన శనివారం దుబ్బాక పురపాలిక కేంద్రంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల ద్వితీయ మహా సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండల రైతులతో పలు అంశాలపై చర్చించి పంటలు వేసే విధానం పట్ల అవగాహన కల్పించారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించిందని మండిపడ్డారు. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ రైతులు పండించిన సేపులను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా అడ్డుకొని నెలలు తరబడి రోడ్లపైనే ఉంచడం జరిగిందన్నారు. తద్వారా ఆ రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను మానుకొని రైతుల కోసం పాటుపడాలన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రెండున్నర ఏళ్లపాటు తమ సంఘం వీరోచిత పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న టీఆర్ఎస్ సర్కారు రైతులను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి మద్దతు ధరను చెల్లించాలని, గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతన్నలను తక్షణమే ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పత్తి, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభిం చాలన్నారు.
నూతన మండల కమిటీ ఎన్నిక
మహాసభల్లో భాగంగా తెలంగాణ రైతు సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా నక్కిరెడ్డి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఆర్.మోహన్ రెడ్డి, కార్యదర్శిగా ఎస్. మహేందర్ రెడ్డిలతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.భాస్కర్, నాయకుడు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లారపు తిరుపతిరెడ్డి, రామారం రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, చంద్రా రెడ్డి, కిషన్, పర్శరాములు, పలువురు పాల్గొన్నారు.