Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తున్న శ్రీనివాస ఫార్మ్స్
: సీఐటీయూ ప్లాంట్ మేనేజర్ సామెల్‌కు వినతిపత్రం
నవతెలంగాణ- కౌడిపల్లి
కౌడిపల్లి మండలం తునికి శివారులో ఉన్న శ్రీనివాస ఫార్మ్స్ ప్రవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్న సుమారు 200 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు భయబ్రాంతులకు గురిచేస్తున్న శ్రీనివాస ఫార్మ్స్ పరిశ్రమపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి కె. నర్సమ్మ , జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజులు డిమాండ్ చేశారు. శనివారం పరిశ్రమ ప్లాంట్ మేనేజర్ సామేల్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పరిశ్రమ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు పరిశ్రమను నమ్ముకొని పనిచేస్తున్నారని వారికి ప్రతి నెల వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా నేడు కార్మికులను తొలగిస్తామంటూ చెప్పడం దుర్మార్గమన్నారు. పరిశ్రమలో జ్యోతి కాంట్రాక్టులో సుమారు నార్తిండియన్ కార్మికులు 160 మంది, కె ఆర్ కాంట్రాక్టులో 90 మంది, విఎంఆర్ కాంట్రాక్టులో 47 మంది కార్మికులు పని చేస్తున్నా ఏ ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. పరిశ్రమ 6 సంవత్సరం క్రితం ఏర్పడినప్పటి నుంచి పరిశ్రమను నమ్ముకొని పనిచేస్తున్న కార్మి కులకు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదని మండిపడ్డారు. గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఇప్పటి వరకు ఎంతమంది కార్మికులను పర్మినెంట్ చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ నవంబర్ నుంచి మారుతున్నారనే కారణం చూపించి కార్మికులను తొలగించాలని చూస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కులను అందకుండా చేసే పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరారు.