Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
రాజ్యాంగ సంస్థలను ధ్వసం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా దళిత్ సోషన్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యుయు) ఆధ్వర్యంలో నవంబర్ 5న ఢిల్లీలో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారని.. ఈ సదస్సును జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ కోరారు. ఈ మేరకు సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన కేవీపీఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ లౌకిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం, ప్రజాస్వామ్యంను అపహాస్యం చేయడం వంటి అనేక చర్యలను బీజేపీ చేస్తోందన్నారు భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ఉన్మాద చర్యలకు ఉసిగొల్పడం వంటి దారుణాలను బీజేపీ ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఉపా చట్టాలు తెచ్చి మేధావులను జైల్లో నిర్బంధించడం కల్బూర్గి, ఫన్సారే, దబోల్కర్, గౌరీ లంకేశ్వరి, వంటి మేధావులను హతమార్చి ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్రలు వేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నదన్నారు. మరోవైపు రాజ్యాంగ పునాదులను పెకిలిస్తూ, బార్డర్ల సమస్య, మతోన్మాద ఎజెండా ముందుకు తెచ్చి పబ్బం గడుపుకుంటున్నదన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించి, రిజర్వేషన్లు ఎత్తివేసి, రాజ్యాంగం పై దాడి చేస్తున్నదన్నారు. దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలురాస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ.. రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం నవంబర్ 5న నిర్వహించే జాతీయ సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సామాజిక,అభ్యుదయ ప్రగతిశీల, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి శివకుమార్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు దాస్, దత్తు కార్యకర్తలు ఎల్లయ్య, సాయిలు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.