Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలాన్లు వేయడంలో పోలీసుల బాధ్యతారాహిత్యం
- కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పోలీసు అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-పాపన్నపేట
ఆటో ఫోటో కొట్టి లారీకి ఫైన్ వేయడం, బట్ట కాల్చి మీద వేస్తే చాలు ఎవడైనా కాలిపోని అన్నట్లు ఉంది కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం. వివరాలలోకి వెళితే పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఎంబడి రామ్ రెడ్డి అనే వ్యక్తికి టీఎస్ 15 యుబి 31 55 అనే నెంబర్ గల లారీ ఉంది. దీనిపై ఆధారపడి అతడి కుటుంబం జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ లారీ ఈ నెల 24వ తేదీన పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీ నగర్ లోని ఒక రైస్ మిల్లులో బియ్యం లోడ్ చేసుకొని ఇదే మండల పరిధిలోని నార్సింగి గ్రామ శివారులో ఉన్న గోదాములో లోడ్ ఖాళీ చేయడానికి వెళ్ళింది. ఆ రోజు నుంచి ఈ నెల 30 వరకు లోడ్ ఖాళీ కాకపోవడంతో అదే గోదాంలో ఉంది. అయితే అనుకోకుండా ఈ నెల 29వ తేదీ ఉదయం రామ్ రెడ్డి లారీ సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల పరిధిలో ఓవర్ స్పీడ్తో వెళుతున్నట్టు రూ.1100 ల ఫైన్ వేస్తున్నట్లు సమాచారంతో కూడుకున్న మెసేజ్ ఆదివారం ఉదయం రామ్ రెడ్డి ఫోన్కు వచ్చింది. దీంతో అతడు అవాక్కయ్యాడు. తమ లారీ ఈ నెల 24 నుంచి ఆదివారం ఉదయం వరకు అన్లోడ్ కాకపోవడంతో నార్సింగి శివారులో గల గోదాంలో ఉండగా తనకు ఫైన్ పడడమేంటని ఆందోళనకు గురయ్యాడు. ఏమీ అర్థం కాక టీఎస్ ఈ చాలన్ ఓపెన్ చేసి చూడగా లారీ స్థానంలో ఫోర్ వీలర్ ఆటో ఫోటో పంపుతూ ఇతడికి ఫైన్ వేశారు. ఆందోళనకు గురైన రామ్ రెడ్డి ఈ చలాన్ పూర్తిగా పరిశీలించగా లారీ స్థానంలో ఆటో ఉంది, ఆటో నెంబర్కు లారీ నెంబర్కు తేడా చూడగా రెండు అంకెల మార్పు కనిపించింది. లారీ నెంబర్ టిఎస్ 15 యుబి 31 55 ఉండాగా, ఆటో నెంబర్ టీఎస్ 15 యుబి 31 88 ఉంది. అంతేకాకుండా ఆటో పశువులను తీసుకెళ్తున్న ఫొటో సైతం ఇతడి మొబైల్ ఫోన్కు పంపారు. వాహనదారుల వద్ద ఏదైనా పొరపాటు జరిగితే వందల్లో ఫైన్లు వేస్తూ ముక్కు పిండి వసూలు చేసే అధికారులు, అత్యుత్సాహంతో పొరపాట్లు చేస్తూ వాహనదారుల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. లారీ డ్రైవర్ చదువుకున్న వ్యక్తి అవడం మూలంగా ఈ విషయం గమనించాడు, అదే చదువురాని వ్యక్తి అయితే చేసేది లేక ఫైన్ కట్టేవాడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సంబంధిత అధికారులు చేసిన పొరపాటును గుర్తించి తనకు వేసిన ఫైన్ ఉపసంహరించుకోవాలని లారీ డ్రైవర్ రామ్ రెడ్డి సంబంధిత పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.