Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 4, 5 తేదీలలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలి
నవతెలంగాణ-మెదక్ టౌన్
మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ కోరారు. ఆదివారం మెదక్ కేవల్ కిషన్ భవనంలో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం వండే మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2000ల వేతనాన్ని పెంచుతున్నట్లుగా ప్రకటించి 8 నెలలు గడుస్తున్నా, జీఓ ఇవ్వలేదని, వేతనాలు చెల్లించడం లేదన్నారు. 20 సంవత్సారాలుగా పని చేస్తున్న వారికి రూ.1000 లు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు పెంచకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కరోనా కారణంగా ఆక్షయపాత్ర వల్ల జిల్లాలో చాలా మంది ఉపాది కోల్పోయారని ఆమె అన్నారు. ప్రభుత్వం వేతనాలు, బిల్లులు సకాలంలో చెల్లించక పోయిన కార్మికులు అప్పులు చేసి భోజనం విద్యార్థులకు వండి పెట్టారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన రూ.2000లు వేతనాలు చెల్లించాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే 3 సంవత్సారాల కాలంలో మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాలు, కర్తవ్యాలు చర్చించేందుకు మధ్యాహ్న భోజన కార్మికుల ఆలిండియా మహాసభలు హైదరాబాద్లో నవంబర్ 4, 5 తేదీలలో జరుగుతున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో సత్యమ్మ, బూదమ్మ, చెంద్రకళ, చెంద్రమ్మ, సుజాత తదితులు పాల్గొన్నారు.