Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సరిహద్దులో విజృంభిస్తున్న కన్జేక్టి వైటిస్
- కంటి ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
నవతెలంగాణ-జహీరాబాద్
జిల్లా సరిహద్దు ప్రాంతాలైన మొగుడంపల్లి, జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లో కరడ్లకలక వైరస్ భయాందోళన కలిగిస్తున్నది. కన్జేక్టి వైటిస్ అనే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీంతో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ఆసుపత్రుల ఎదుట బాధితులు క్యూ కడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ రోగం భారీన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శ్యామ్‌రావు సూచిస్తున్నారు.
కండ్లకలక లక్షణాలు..
కళ్ళకలకను సామాన్య పరిభాషలో పింక్ ఐస్ అనికూడా అంటారు. వైద్య పరిభాషలో కన్జేక్టి వైటిస్ అంటే కంటిలో ఇన్ఫెక్షన్ వైరస్ లేదా బ్యాక్టీరియా రావడం. ఇది చలి, వర్షాకాలంలో చాలా సహజంగా వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో వాతావరణం తడిగా ఉండడంతో ఇది సోకు తుంది. కళ్ళకలక అదే కంజక్టి వైటిస్ ఒకరినుండి మరొకరికి సోకే అవకాశం ఉంది. కన్జెక్టి వైటిస్ ఎలర్జీ లేదా రసాయనాల రియాక్షన్ కారణంగా వస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వాళ్ల కళ్ళు ఎర్రబడుతుంటాయి. కంటి చుట్టుపక్కల దురద ఉంటుంది. కంటి నుండి నీరు కారుతుంటుంది. కంట్లో పుసులు కట్టడం. కంట్లో గుచ్చుకున్నట్లు, నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ వ్యాధి సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శ్యామ్‌రావు పలు సూచనలు చేశారు. అన్నిరకాల వైరస్లు, బ్యాక్టీరియా నుంచి మనల్ని మనం రక్షించుకో వాలంటే ఎక్కువసార్లు చేతులను కడగాలి. చేతితో కంటిని తాకొద్దు. ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం పరిశుభ్రంగా ఉంచేందుకు మెత్తటి టవల్స్ వాడాలి. వర్షాకాలంలో టవల్స్ తడిగా ఉంటాయి కాబట్టి.. బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రతిరెండు రోజులకు ఒకసారి టవల్స్ మార్చాలి. ఒకరి టవల్‌ను మరొకరు పంచుకోవద్దు. కాలం చెల్లిన మేకప్ సామగ్రిని వాడొద్దు. సహజంగా చాలామంది కళ్ళు ఎర్రబడ గానే కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించకుండా సమీపంలో ఉన్న మందుల దుకాణం వారు ఇచ్చిన కొన్నిరకాల డ్రాప్స్‌ను వేస్తుంటారు. వచ్చిన ఇన్ఫెక్షన్కు కారణం ఏమిటి, బ్యాక్టీరి యా వల్ల వచ్చిందా లేక ఇన్ఫెక్షన్కు కారణం అయిన అంశాలు తెలుసుకున్నాకే కంట్లో చుక్కలు వేసుకోవాలన్నారు. అలాకాకుండా డాక్టర్ సలహా లేకుండా ఆకురసాలు లేదా ఇతర చుక్కలు వాడొద్దు. కళ్ళకలక వచ్చిన వ్యక్తి వాడిన తలగ డను తొందరగా మార్వాలి. కండ్లకలక వచ్చిన వారు కళ్ళకు అద్దాలు ధరించడం మంచిది.