Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి
నవతెలంగాణ-కొమురవెల్లి
వడ్ల కొనుగోలు కేంద్రాలు లేక రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతూ గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నక్కల యాదవరెడ్డితో కలిసి తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.1,600కే అమ్ముకుంటున్నారని అన్నారు. రైతులు ఒక్కో క్వింటాల్‌కు రూ.450 నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. లేనిపక్షంలో రైతులను ఏకం చేసి ఆందోళనలను నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు తడకపెల్లి శ్రీనివాస్, నాయకులు సున్నం యాదగిరి, ఆరుట్ల దయానంద్, నీల బిక్షపతి, తాడూరి మల్లేశం, సార్ల యాదయ్య, నరసింహులు, శ్రవణాచారి, కానుగుల రాజు, అత్యం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.