Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల గ్రామీణ వికాస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ సీఎఫ్ఎల్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో గురువారం చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ శివ భారతి మాట్లాడుతూ రైతులు, మహిళా సంఘాల సభ్యులకు సేవింగ్స్, బ్యాంకు గోల్డ్ లోన్, డిపాజిట్లు తదితర అంశాలపై వివరించారు. బ్యాంకుల్లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను వినియోగించుకోవాలని కోరారు. సైబర్ క్రైం నేరాల వల్ల ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకుల పేరు చెప్పి ఫోన్లో మీ వివరాలు అడిగితే అవి మోసపూరితమైనదని గ్రహించాలన్నారు. విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఉన్నతమైన చదువులు చదివే విద్యార్థులకు విద్యా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ముద్ర రుణాలు, స్టాండ్ అఫ్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు వ్యాపారం చేసుకోవడానికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు అందిస్తున్నామన్నారు. బ్యాంకులో తీసుకున్న రుణాలు సకాలంలో వడ్డీ చెల్లిస్తే వారి సిబిల్ స్కోర్ పెరిగి భవిష్యత్లో ఎక్కువ రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద నెలకు రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు కట్టుకునే వెసులుబాటు ఉంటుందని, ఈ పథకం ఆడపిల్లకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఏటీఎం రూపే కార్డు ద్వారా లక్ష రూపాయల వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం ఏ పీజీవీబీ కళాజాత బృందం మ్యాజిక్ ద్వారా జరిగే మోసాల గూర్చి తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కత్తుల కృష్ణవేణి, చేర్యాల ఆర్ధిక అక్ష్యరాస్యత కేంద్రం ఫీల్డ్ ఇన్వెస్ట్ గేటర్ పోతుగంటి కర్ణాకర్, ప్రజలు పాల్గొన్నారు.