Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు
- పట్టించుకోని అధికారులు ఆందోళనలో ప్రజలు
నవతెలంగాణ-ములుగు
ములుగు మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో ఏడు విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 1,092, సింగల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 410 ఉన్నాయి. ఇంటి మీటర్లు 10,137, వ్యవసాయ బోరు బావి కనెక్షన్లు 4,756, కమర్షియల్ మీటర్లు 1,343, కంపెనీల కనెక్షన్లు 55 ఉన్నాయి. మండలంలో ఏఈ, లైన్మెన్లు ముగ్గురు, జూనియర్ లైన్మెన్లు ముగ్గురు, 21 మంది ఆపరేటర్లు మండలంలో పని చేస్తున్నారు. మండలంలోని తునికి బొల్లారం, నర్సాపూర్, శ్రీరారంపూర్, కొత్తూరు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టాయి. వైర్లు లూజ్‌గా మారి కిందికి వేలాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు గ్రామానికి చెందిన కీసర భిక్షపతికి చెందిన గేదె, మేక విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాయి.
షాక్ వస్తోంది
మా ఇంటి ప్రహరీ లోపల మెయిన్ విద్యుత్ వైర్లు బిగించారు. వర్షం పడినప్పుడు మెరుగులు దుంకడంతో పాటు కరెంటు షాక్ వస్తోంది. భయంతో జీవనం సాగిస్తున్నాం. అధికారులకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
- ముత్తోళ్ల ముత్యాలు, తునికి బొల్లారం
ఇంటి పక్కనే ట్రాన్స్ఫార్మర్
ఇంటిపక్కనే ట్రాన్స్ఫార్మర్దాని పక్కనే మురికి కాలువ ఉంది. కిరాణా షాప్ పక్కనే విద్యుత్ స్తంభం ఉంది. దానికి సింగల్ఫేస్ ట్రాన్స్ఫార్మర్ బిగించారు. దీని పక్కనే మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ నుంచి నీరంతా వృథాగా పోవడంతో నిరంతరం తడిగా ఉంటోంది. ఆవైపు వెళ్తే షాక్‌కు గురవుతున్నారు.
పరిష్కరిస్తాం.
- సత్యనారాయణ, కొత్తూరు
మండలంలో విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తాం. ఈ మండలానికి బదిలీపై కొత్తగా వచ్చాను. నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నా, కొత్తూరు, తునికి బొల్లారం సమస్యలను గుర్తించి పరిష్కరిస్తాం.
- రియాజ్, ఏఈ