Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-జహీరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కనీసం మానవత్వం లేకుండా ఆశ వర్కర్లతో టీబీ పేషంట్స్ తేమడ సేకరించి టెస్టులు చేయించాలని నిర్ణయించి అధికారులతో బలవంతంగా అమలు చేయించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ మాట్లాడుతూ అధికారులు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీంతో ఆశ వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పెద్ద ఎత్తున అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు టార్గెట్లు పెట్టి తేమడ సేకరించి టెస్టులు చేయించాలని ఒత్తిడి చేస్తున్నారని, దీంతో ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున ఆరోగ్యం గురించి ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే కొంతమంది అనారోగ్యాలు పాలై ఇబ్బందులు పడ్డారన్నారు. వీరికి అరకోర వేతనం ఇస్తూ, పారితోషికానికి సంబంధం లేని పనులను చెబుతూ అదనపు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన రకంగా ఫిక్స్డ్ వేతనం తక్షణమే అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, తేమడ టెస్ట్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు నందమ్మ, శశికళ, శ్యామల, లక్ష్మీ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.