Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఐ కొనుగోలు చేయాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
నవతెలంగాణ- కొండాపూర్
పత్తి క్వింటాలుకు రూ.12 వేల మద్దతు ధర నిర్ణయించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొండాపూర్ మండలంలోని మందాపూర్ గ్రామంలో గురువారం పంట పోలాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పత్తి పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పత్తి పంట సాగు, దిగుబడి తగ్గి పోయినా భారత దేశంలో మాత్రం పత్తి ధర పెరుగుదల లేదన్నారు, గత సంవత్సరం వ్యవసాయ సీజన్లో బహిరంగ మార్కెట్లో పది, పదకొండు వేల రూపాయల ధర ఉందని ప్రస్తుతం ఆరు వేల రూపాయల ధర కూడా రైతులకు లభించడం లేదన్నారు. పత్తి పంట సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి పంట మద్దతు ధర క్వింటాలుకు రూ.12 వేలను ప్రకటించి కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులను బలవంతం చేయకూడదన్నారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సంజరు రాములు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.