Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్ లేదు
- చదువురాని ఆయమ్మ, చిద్రమవుతున్న చిన్నారుల జీవితాలు
- అంగన్వాడీ టీచర్ను నియమించాలని గ్రామస్తుల వేడుకోలు
నవతెలంగాణ-నిజాంపేట
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలను అంగన్వాడి కేంద్రాలకు ఖర్చు చేస్తుంది. అంగన్వాడి కేంద్రాలలోని టీచరులను భర్తీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇప్పటికీ ఎక్కడ భర్తీ చేయలేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ లేక ఆయమ్మతోనే స్కూల్ నడిపిస్తున్నారు. చదువు రాని ఆయమ్మతోనే రెండు సంవత్సరాలు కాలం గడిచిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాలలో చదువుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నవి. వారికి ప్రతిరోజు గుడ్లు, పాలు బాలామృతం లాంటి పోషక పదార్థాలు ఇస్తున్నారు. మూడు సంవత్సరాల నుండి పిల్లలను అంగన్వాడి స్కూల్లకు పంపించినట్లయితే, ఐదవ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్లడానికి అవకాశముంటుంది. ప్రభుత్వం విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలపై వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఈ స్కూల్లో 25 మంది విద్యార్థులు ఉన్నారని ఆయమ్మ నున్నావత్ గోరి తెలిపారు. విద్యార్థులను తోలుకు రావడం, వంట చేసి పెట్టడం, పిల్లలను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందంటూ ఆయమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడి కేంద్రాలలో టీచర్లు లేకుండా కొనసాగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ ఇన్చార్జి సూపర్వైజర్ జయంతిని వివరణ కోరగా టీచర్ లేని మాట వాస్తవమేనని, అతి త్వరలోనే అంగన్వాడీ టీచర్ ను నియమిస్తామన్నారు. సంబం ధిత జిల్లా శిశుసంక్షేమ అధికారులు వెంటనే స్పందించి నగరం గ్రామంలో అంగన్వాడీ టీచర్లను నియమించాలని, లేనియెడల విద్యార్థుల జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.