Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సహకరించాలి
- ఐసీడీఎస్ అధికారులకు సభలో అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం
నవతెలంగాణ-కౌడిపల్లి
మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ సర్వసభ సమావేశానికి అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు హాజరు కావల్సిన సమావేశానికి టీఆర్ఎస్ నాయకులు, రైతులు సమావేశానికి హాజరయ్యారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఎంపీపీ రాజు అధ్యక్షతన శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐసీడీఎస్ అధికారులకు సభలో అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సమావేశంలో శాఖల వారీగా గత మూడు నెలలు జరిగిన అభివృద్ధి పనులను సభకు అధికారులు వివరించారు. తిమ్మాపూర్, పీర్ల తండా, జాజితాండ పంచాయతీ సర్పంచులు పెండింగ్ బిల్లులు, విద్యుత్, నీటి సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే త్వరితగతిన వాటిని పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ అధికారులు స్థానికంగా ఉండాలని సూచించారు. మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్దతు ధర ఇస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున పోడుభూమి సమస్యలు ఉన్నాయని, వాటిని స్థానిక సర్పంచులు అర్హులైన వారిని గుర్తించి నివేదిక సిద్ధం చేస్తే తాను ఆ సమస్యను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మండలంలో నీటి సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 15 రోజుల తర్వాత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రతి గ్రామ సర్పంచ్ ముందుకు వచ్చి మనఊరు మనబడిలో భాగంగా మంజూరైన పాఠశాలలకు ప్రవారీ, కిచెన్ షెడ్, టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావాలని కోరారు. సర్పంచులు ఒకరినొకరు అభివృద్ధి పనులపై చర్చించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గుంజరి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ గుప్తా, జెడ్పీటీసీ సభ్యురాలు కవిత అమర్ సింగ్, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో భారతి, మండల కో ఆప్షన్ హైమద్, పీఏసీఎస్ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చిలుముల చిన్న చిన్నంరెడ్డి, ఆర్డబ్య్లూఎస్ డీఈ కిషన్, పీఆర్ డీఈ అమరేశ్వర్, ఆర్డబ్య్లూఎస్ ఏఈ అరవింద్, ఆయా శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎల్లం పద్మ కిష్టయ్య, ఎంపీటీసీలు సారా స్వప్న కిషోర్ గౌడ్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.