Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలీలకు వారం వారం బిల్లులు చెల్లించాలి
- రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలి
నవతెలంగాణ -సంగారెడ్డి, కొండాపూర్
'గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు.. సవాళ్లు' అనే అంశంపై సెమినార్ పోస్టర్ను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలంలోని కలబ్గూర్, గంజి గూడెం గ్రామాల్లో.. అలాగే కొండాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవో జయలక్ష్మి, ఏపీఓ వీరప్ప చేతుల మీదుగా వేర్వేరుగా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు జి నర్సింలు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు కూడుబెట్టే గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని కూలీలతోపాటు తెలంగాణలో ఉన్న 57.47 లక్షల జాబ్ కార్డు కలిగిన 1 కోటి 20 లక్షల 33,000 మంది ఉపాధి హామీ కూలీల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. నిరుపేదలకు ఆదాయం, ఆహార భద్రత కల్పి స్తున్న ఉపాధి హామీని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పట్ల మొండి వైఖరి వీడి.. కూలీలకు రావాల్సిన డబ్బులను కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు, ప్రమాద బీమా, పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే 200 పని దినాలు, రోజు వేతనం రూ.600 ఇవ్వాలన్నారు. మేట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వా లని, కూలి వెంబడి పారితోషికం ఇవ్వాలన్నారు. ఫీల్డ్ అసిస్టె ట్లకు ఉద్యోగ భద్రత జీతభత్యాలు పెంపు కల్పించాలని ఈనెల 15వ తారీఖు నాడు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం సెమినార్ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, కేరళ వామపక్ష ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబి రాజేష్ అలాగే అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొంటున్నారన్నారు. కాబట్టి మండలంలోని రైతులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంగా రడ్డిలో రాములు, దుర్గయ్య, భారతమ్మ, లక్ష్మి, యాదమ్మ, శశికళ, సంగమేశ్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.