Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిన ఉప కేంద్రం భవన నిర్మాణం
- పునాదులకే పరిమితమైన బేగంపేట ఆరోగ్య ఉప కేంద్రం
- మద్యం ప్రియులకు నిలయంగా తాత్కాలిక ఉప కేంద్రం
- జాప్యం చేయకుండా నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల వేడుకోలు
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని బేగంపేట ఆరోగ్య ఉప కేంద్రం ఎన్నో ఏండ్లుగా నిర్మాణానికి నోచుకోవడం లేదు. గతంలో బేగంపేట ఆరోగ్య ఉప కేంద్రం గ్రామస్తులకు ఎన్నో సేవలందించింది. పూర్తిగా శిథిలావస్థలోకి చేరడంతో నేడు గ్రామ పంచాయతీ ఆవరణంలో తాత్కాలికంగా కేటాయించిన భవనంలో గర్భిణులకు, రోగులకు సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారు. ఉప కేంద్రం వైద్య సేవలు కలగానే మిగులుతోందని ప్రజలు నిరాశ చెందుతున్నారు. 2021 జూలై 5న జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రూ.16 లక్షలతో నూతన ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి మానకోండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేశారు. దీంతో ఆరోగ్య కేంద్రం సిబ్బందితో పాటు గ్రామస్తుల్లో ఆశలు చిగురించాయి. పనులు ప్రారంభమై పునాదుల దశలోనే నిలిచిపోయాయి. ఆరోగ్య ఉప కేంద్రం పనులు పునాదుల దశకే పరిమితమైంది. నిర్మాణ పనులు జాడే లేకుండా పోవడంతో గ్రామస్తుల ఆశలు అడిఆశాలవుతున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలేకాలంలో ప్రజారోగ్యంపై ప్రజాప్రతినిధుల పట్టింపు కరువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నూతన ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణం కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని బేగంపేట గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేక సామాన్యులు వైద్య చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేగంపేట గ్రామంలో నూతన ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణం త్వరగా చేపట్టేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మద్యం ప్రియులకు నిలయం
తోటపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలోని బేగంపేట ఆరోగ్య ఉప కేంద్రానికి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోని భవనం కేటాయించారు. కనీస సౌకర్యాల్లేని భవనంలో సిబ్బంది గర్భిణులకు, రోగులకు వైద్య సేవలందిస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప కేంద్రం పరిసర ప్రాంతంలో పలువురు స్థానికులు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ఈ ఉపకేంద్రం మద్యం ప్రియులకు, దోమలకు నిలయంగా మారింది. ఉప కేంద్రం ఆవరణలో నిత్యం మద్యం సీసాలు దర్శనమిస్తుండడంతో ఆరోగ్య కేంద్రం సిబ్బంది విధులు నిర్వర్తించడానికి భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.