Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెట్రోల్యాబ్స్లో చిరుత పట్టివేత
- చిరుత పులిసంచారంతో భయం గొప్పిట్లో ప్రజలు
నవతెలంగాణ-జిన్నారం
దట్టమైన అడవులు... కీకారణ్యాలలో ఉండాల్సిన చిరుతపులులు కంపెనీలలో, కర్మాగారాలలో ప్రత్యక్షమవడం ఇటు జనం.. అటు పారిశ్రామికవర్గం గజగజ వనిగకి పోతున్నారు. క్రూర మృగాలు అరణ్యాల నుంచి జనావాల మధ్యకు వస్తుంటే జనం బిక్కుబిక్కుమంటూ విస్తుపోతున్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని పెట్రోల్ ల్యాబ్స్ పరిశ్రమలోని హెచ్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా పులి ప్రత్యక్షమైన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పెట్రోలెక్ లో పులి ఆకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో పరిశ్రమ వర్గాలు యాజమాన్యానికి, సంబంధిత విభాగం అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీధర్‌రావు, గడ్డపోతారం గ్రామపంచాయతీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి, హెట్రో ల్యాబ్స్ ఇన్చార్జి రవిబాబు, అధికారులు విజయ భార్గవి, నజీమా, బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి, జిన్నారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాశ్ బృందం పరిశ్రమ వద్దకు చేరుకొని పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పులిని నిర్బంధించేందుకు శత విధాలా ప్రయత్నించారు. చివరకు అధికారులు మత్తుమందు బుల్లెట్స్ ప్రయోగించడంతో పులిని నిర్బంధించగలిగారు. మధ్యాహ్నం తరువాత పులిని నిర్బంధించి బోన్లో జూకు తరలించారు. దీంతో జనాలు, పారిశ్రామిక వర్గాలు,హెట్రోలాబ్స్ పరిశ్రమ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, సిబ్బంది చేసిన సేవకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
కనిపించని వాటి మాటేమిటి?
కొంతకాలంగా జిన్నారం మండలం పరిసర ప్రాంతాలలో అక్కడక్కడా పులులు సంచరిస్తున్నాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కాజిపల్లి పారిశ్రామిక ప్రాంతం, జంగంపేట పరిసర ప్రాంతం, గుమ్మడిదల శివారు ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయి. ఎటువైపు నుంచి పులులు వచ్చి దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గడ్డపోతారం హేటిరో పరిశ్రమలో ఓసారి చిరుత పులి ప్రత్యక్షమై హడలెత్తించింది. కాజీపల్లి నుంచి ప్రారంభమైన అటవీ ప్రాంతం గుమ్మడిదల, నర్సాపూర్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర ప్రాంతం వరకు విస్తరించి ఉంది. మంగంపేట గ్రామ శివారులో గతంలో ఓ పశువుపై పులి దాడి చేసిన సంఘటన తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పులులు ఉన్నాయా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పులులు, ఇతరత్రా క్రూర మృగాలు ఏమైనా సంచరిస్తున్నాయా? ఒకవేళ సంచరిస్తే వాటిని ఎలా నిర్బంధించాలని ప్రణాళిక రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు.