Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవ తెలంగాణ-సిద్దిపేట అర్బన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో జరిగిన సీఐటీయూ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అర్హులైన వారికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదన్నారు. నేటికీ లక్షల సంఖ్యలో పేదలకు ఇండ్లు లేక పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్నారన్నారు. ఇండ్ల కోసం లక్షల సంఖ్యలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు చూపడం లేదన్నారు. ఇండ్లు లేని నిరుపేదల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలన్నారు. స్థలం లేని వారికి స్థలం కేటాయించి, అందులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కళావతి, బండ్ల స్వామి, ఎం పద్మ, కాట మధు జిల్లా కోశాధికారి జి భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, సింగిరెడ్డి చంద్రారెడ్డి, తునికి మహేష్, ఇప్పకాయల శోభ జిల్లా కమిటీ సభ్యులు వేణుగోపాల్, రంగారెడ్డి, గుంటిపల్లిసధాకర్, మండల భాస్కర్, ఆరుట్ల రవి, కే భాస్కర్, రాపాక కుమార్ తదితరులు పాల్గొన్నారు.