Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-సిద్దిపేటరూరల్
స్టేన్ బోరర్ వరి(మొగి) పురుగు వలన దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలను ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నారాయణరావుపేట మండల కేంద్రంలోని వరి పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు నోబీ పురుగు సోకడం వలన వరి పైరు ఎదగకుండా ఎర్రబారి పోతోందని వ్యవసాయ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పంట నష్టపోతున్నందున ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరారు. వ్యవసాయ అధికారులతో పంట నష్టం వివరాలను సేకరించి మంత్రి హరీశ్‌రావుకు నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రకతి, ఇతర కారణాల వలన పంటలకు తెగులు సోకుతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు రసాయనిక, సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పంటలను పరిశీలించి తెగుళ్ల నివారణకు అవసరమైన మందులను రైతులకు సూచించాలని, పంటలకు తెగలు సోకకుండా పంట వేసేటప్పుడు ముందస్తుగా వ్యవసాయదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలని అన్నారు. రైతు వేదికలో పంటలు సాగు చేసే విధానం, క్రమపద్ధతిలో మందుల వివరాలతో ఫ్లెక్సీలు పెట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, వ్యవసాయ శాస్త్రవేత్త విజరు కుమార్, వైస్ ఎంపీపీ సంతోష్ కుమార్, సర్పంచ్ శశి యాదగిరి,, ఎంపిటిసి పోరం అధ్యక్షులు స్వప్న ప్రభాకర్, సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, ఏఈఓ నాగర్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు
అధికారుల సూచనలు పాటిస్తేనే రైతులకు మేలు
నవతెలంగాణ-బెజ్జంకి
రైతులు పంటలు సాగు చేయడానికి సమాయత్తమవుతున్న సమయంలో వ్యవసాయ శాఖాధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు సూచించారు. మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు ఆదివారం మండల కేంద్రంలో తెగులుసోకి కొలుకున్న వరిపంట పొలాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వరి వంగాడాలు నాటే సమయంలో తీసుకున్న సస్యరక్షణ చర్యలు, జాగ్రత్తలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి నాటే ప్రక్రియలో రైతులు తీసుకున్న అజాగ్రత్తలు, వాతావరణ మార్పుల పరిస్థితి దష్ట్యా వరిపంటలో తెగుళ్లు ఆశిస్తున్నట్టు తమ దష్టికి వచ్చినట్టు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని, అధికార యంత్రాంగం సహాయ సహకారాలందించడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మండల వ్యవసాయాధికారి రైతులను సమన్వయం చేసుకుంటూ వరిపంటకు సోకిన తెగుళ్లపై నివేదిక రూపొందించాలని, ఆ నివేదికను మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఎంపీపీ నిర్మల, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ రాజయ్య, లక్ష్మారెడ్డి, దీటీ రాజు, మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, జిల్లా వ్యవసాయాధికారి శివ ప్రసాద్, ఏడీఏ మహేష్, శాస్త్రవేత్త విజరు, ఏఈఓలు రేణుకాశ్రీ, మానస, రచన, ఆత్మాధికారి సాయి చరణ్, రైతులు పాల్గొన్నారు.
ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని విజ్ఞప్తి
ప్రకతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల దష్ట్యా రైతులు సాగుచేస్తున్న వరి పంటలకు తెగుళ్లు సోకి 50 శాతం నశించిపోయాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరిపంటకు సోకిన తెగులుతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పేర్కొంటామని పాటీల్ తెలిపారు.
కలెక్టర్ ఏఓ గైర్హాజర్
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వరిపంట పొలాల పరిశీలన పర్యటనలో మండల ఏఓ గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. వరిపంట పొలాలకు సోకిన తెగుళ్లపై ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక రూపొందించాలని కలెక్టర్ సూచించిన సమయంలో ఏఓ గైర్హాజరీలో ఉండడం శోచనీయం.