Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
నవతెలంగాణ-పుల్కల్
ఉమ్మడి మెదక్ జిల్లాకు తలమానికంగా నిలిచిన సింగూరు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.17.87 కోట్లను కేటాయించింది. ప్రాజెక్టు నిర్వహణతో పాటు కాలువల నిర్మాణం, మరమ్మతులు, ఇతరత్రా అభివృద్ధి పనుల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను వెచ్చించనున్నారు. దీంతో అందోల్ నియోజకవర్గం రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల ద్వారా ప్రధాన కాలువల పనులు, నీటి పంపిణీల కాలువల అభివృద్ధి కోసం అవసరమైతే భూసేకరణ కొరకు కూడా నిధులను వెచ్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సింగూరు కాలువ నీటి వినియోగంతో ప్రతీ ఎకరాకు సకాలంలో పంటలు పండించుకోవచ్చని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా పేరొందిన సింగూర్ ప్రాజెక్టు ప్రాంతం పూర్తి స్థాయిలో అన్ని వసతులతో కూడా మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుండడంతో సింగూర్ వద్ద ప్రతి రోజు సందడి నెలకొని ఉంటుంది. వర్షాకాలంలో వరద నీరు పెద్ద ఎత్తున చేరుకుని సింగూరు ప్రాజెక్ట్ పర్యావరణాన్ని తిలకించేందుకు వచ్చే వారిటీ మరింతగా సందడిని నిలుపుకుంటుంది. కాగా అక్కడ ఉన్న పార్కులో మరమ్మత్తులు చేయాల్సిన ఆవశ్యత ఎంతైనా ఉంది. ఇప్పటికే ఆ పార్కులో ఉన్న చెత్తా చెదారంతో పాటు మందుబాబులకు అడ్డగా మారడంతో అసౌకర్యం, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పర్యాటక అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.బడ్జెట్ లో కేటాయించిన నిధుల వ్యయంతో పార్కును తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. నిధుల సద్వినియోగానికి అధికారులు, పాలకులు కృషి చేయాలని పేర్కొన్నారు.