Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు కందుకూరి విరేశలింగం పంతులు. మానవ శరీరానికి రక్త ప్రసరణ.. హృదయం.. ఎంత అవసరమో సమాజానికి గ్రంథాలయాలు అంత అవసరం' అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఈ మహనీయుల మాటలు మనం గమనించినట్లయితే మానవ జీవితానికి, పుస్తకానికి ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. యంత్రం కంటే వేగంగా ప్రయాణిస్తున్న మనిషి తన రోజువారి జీవన విధానంలో ఎన్నో ఒత్తిళ్లు, ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వాటి నుంచి తప్పించుకోవడానికి నానాయాతన పడుతున్నాడు. కానీ తన జీవితంలో వెలుగులు నింపి మానసిక ప్రశాంతతను అందించే పుస్తకాన్ని మరుస్తున్నాడు. పెరుగుతున్న సాంకేతికత దృష్ట్యా అంతా సెల్ఫోన్, వాట్సాప్లపైనే ఉంటున్నాడు. దాన్ని ఆసరాగా చేసుకున్న చిన్నారులు కూడా గేమ్స్ ఆడుతూ దాంతోనే కాలాయాపన చేస్తున్నారు. పిల్లలకు తమ సొంత వ్యక్తిత్వం ఉంటుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ వస్తుంది. వారి ఆలోచలు, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. దీన్ని మనం ఎప్పటికప్పుడూ గమనించాలి. వారు పెరిగేకొద్దీ విజ్ఞానం అందించే పుస్తకాలు వారికి చేరువవ్వాలి. గ్రంథాలయం, అందులో ఉన్న గ్రంథ సంపదతో అనుబంధం నిరంతరం సాగుతూ ఉండాలి. అలాంటి పుస్తక సంపద కలిగిన గ్రంథాలయాలు నేడు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం...
సమాజంలో ఉన్నత, నైతిక విలువలున్న పౌరులుగా మనగలగే ప్రయత్నం చేయడంలో గ్రంథాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పూర్వ కాలం నుంచి నేటి వరకూ మానవ అభివృద్ధికి మార్గాలు పుస్తకాలు. వాటిని భద్రపరిచే విజ్ఞాన నిలయాలు మాత్రం గ్రంథాయాలయాలే. ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ మానవ జీవితానికి పుస్తకాలు వారధులుగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. ఉన్నత, నైతిక విలువలున్న పౌరులుగా మనగలగే ప్రయత్నం చేయడంలో గ్రంథాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 'నేటి బాలలే రేపటి పౌరులు. గ్రంథాలయాలు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేదిగా జ్ఞానఘనులు' అన్నారు పెద్దలు. విద్యార్ధులు గ్రంథాలయం దానిలో ఉన్న గ్రంథ సంపదతో అనుబంధం నిరంతరంగా సాగాలి. ప్రస్తుత సమాజంలో ఎంతసేపు చదువు, చదువు అంటూ బాలలను యంత్రాలుగా మార్చేస్తున్నారు. బాలలకు చదవడం అంటే పాఠ్యపుస్తకాలు మాత్రమే చదవడం కాదు. కథల పుస్తకాలు, మానసిక ఉల్లాస పుస్తకాలు, ప్రేరణకొల్పే పుస్తకాలు, సామాజిక అవగాహన, స్పహ కలిగిన పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు విద్యార్థులకు అనుగుణంగా ఉండే పుస్తకాల కలిగిన గ్రంథాలయంతో పఠానుబంధం ఉండాలి.
పేరుకే గ్రంథాలయాలు
భారత ప్రభుత్వ సర్వే 2021 లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 15,07708 పాఠశాలలున్నాయి. వాటిలో 10,32,570 ప్రభుత్వ పాఠశాలలు, 84,362 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, 3,37,499 ప్రయివేట్ పాఠశాలలు 53,277 ఇతర పాఠశాలలున్నాయి. కర్నాటక రాష్ట్రంలో అత్యధికంగా అంటే 97.8 శాతం పాఠశాల గ్రంథాలయాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి 99.8 శాతం అత్యల్పంగా మేఘాలయ 10.14 శాతం గ్రంథాలయాలు నడుస్తున్నవి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేటు పాఠశాలలు, గురుకులాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో జవహర్ నవోదయ విద్యాలయాలలో చక్కటి గ్రంథ సంపద కలిగినటువంటి గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నవి. వాటితో పాటు సరైన సమయంలో, సరైన సమాచారాన్ని, సరైన పాఠకునికి అందించే గ్రంథ పాలకులు ఉండటం ఆహ్వానించదగ్గ విషయం. గురుకుల పాఠశాలల్లో పరిశీలించి నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, వెనుకబడిన తరగతుల పాఠశాలలు, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు, షెడ్యూల్డ్, తెగల పాఠశాలలో చక్కటి గ్రంథాలయ నిర్వహణ, గ్రంథ సంపద (పుస్తకాలు) విద్యార్థులకు అందుబాటులో ఉన్నవి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయివేటు పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ పాఠశాలల్లో కానీ గ్రంథాలయాలు పేరుకు మాత్రమే పెట్టబడుతున్నవి. గ్రంథ సంపద (పుస్తకాలు) అర్హత కలిగిన గ్రంథపాలకుడు గ్రంథాలయాన్ని వినియోగించుకునేందుకు టైం టేబుల్లో సమయం కేటాయించకపోవడం బాధాకరం. విషయమేమంటే విద్యార్థి ఫీజులో గ్రంథాలయ ఫీజు కూడా ఉండటం గమనార్హం. వారి నుండి గ్రంథాలయం కోసం వసూలు చేసిన రుసుము కూడా గ్రంథాలయానికి ఉపయోగించకపోవడం ఇబ్బంది కలిగించే అంశం.
బడ్జెట్ కేటాయింపు నామమాత్రమే...
పాఠశాల గ్రంథాలయంలో బొమ్మల పుస్తకాలు, వేదాంత పుస్తకాలు, ఆట బొమ్మల పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు, కథల పుస్తకాలు, విద్యార్థులకు అర్థమయ్యే సరళ భాషలో, అదేవిధంగా విద్యార్థులను ఆకర్షించే విధంగా పుస్తకాలు పాఠశాల గ్రంథాలయాలలో ఏర్పాటు చేయడం వాటితో పాటు విద్యార్థి టైం టేబుల్ కచ్చితంగా గ్రంథాలయ గంట( సమయం)ఉండి తీరాల్సిందే. ఆ గ్రంథాలయాన్ని సరే ఒక పద్ధతిలో అమర్చి విజ్ఞానాన్ని కావాల్సిన విద్యార్థులకు అందించే గ్రంథపాలకుడు ఉండాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే నామమాత్ర బడ్జెట్ పాఠశాలలకు కేటాయించినప్పటికీ గ్రంథాలయాలకు వినియోగించకుండా ఇతర వాటికి ఉపయోగిస్తున్నారు. కచ్చితంగా గ్రంథాలయాలకు బడ్జెట్ కేటాయించి నూతన పుస్తకాలు విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు అందించాల్సిన అవసరముంది. విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్ళించే కార్యక్రమాలు రూపొందించాలి.
విజయానికి విజ్ఞానం అవసరం...
జీవితంలో విజయానికి కావాల్సిన జ్ఞానం అవసరం. అది గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తకాలను వల్లవేయడం వల్లనే వస్తుందనేది సత్యం. అటువంటి విద్యా పరిజ్ఞానం విద్యార్థులకు అలవాటు చేయడం చాలా ముఖ్యం. ఇది కళాశాల గ్రంథాలయాలో మాత్రమే లభ్యమవుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విషయా నికొస్తే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమ్మవారి ప్రసాదం కింద జూనియర్ కళాశాల కు పుస్తక ప్రసాదం అని టెక్స్ట్ బుక్స్ గ్రంథాల యాలకు అందించే వారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధా ట్రస్ట్ వారు ఉచిత పుస్తకాలను (మెటిరియల్) అందిస్తు న్నారు. గ్రంథాలయం
లో టెక్స్ట్ బుక్స్ కాకుండా విద్యార్థు లకు కావలసిన పోటీతత్వ పుస్తకాలు, మానసిక ఉల్లాసానికి సంబంధించిన పుస్తకాలు, సమాజ శాస్త్రాలు చదివే పుస్తకాలు, సామాజిక అవగాహన కలిగిన పుస్తకాలు, నీతి కథలు, చందమామ
లాంటి కథల పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు అందుబాటు లేవు. ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్డులకు గ్రంథాలయ ఫీజు వసూలు చేసి కూడా విద్యార్థులకు సరైన గ్రంథాలయ వసతులు కల్పించకపోవడం పట్ల పలువురి నుంచి అసహనం వ్యక్తమ వుతున్నది. ఇక ప్రయివేటు జూనియర్ కళాశాల విషయానికొస్తే అత్యధిక సంఖ్యలో ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న విద్యార్థికి కావలసిన గ్రంథాలయ వసతులు, ఆట స్థలం, ల్యాబరేటరీ వసతులు లేని పరిస్థితి. కళాశాలలో గ్రంథాలయానికి కావాల్సిన కనీస వసతులు లేకపోవడం, పుస్తకాలు కొనకపోవడం, కొన్న టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే కొనడం, వాటి నిర్వహణకు ఒక గ్రంథ పాలకుడు లేకపోవడం, నామమాత్రంగా గ్రంథాలయాలతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల ,మైనార్టీ ,షెడ్యూల్డ్, తెగల కళాశాలలో చక్కని గ్రంథాలయాలు వాటికి కావాల్సిన గ్రంథ సంపదను అందించడం సమయానికి బడ్జెట్ను కేటాయించడం గ్రంథపాలకులతో గ్రంథాలయాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయం.అందుకే ప్రతి సంవత్సరం ఆయా గురుకుల విద్యాసంస్థల నుంచి విద్యార్థులు జాతీయ సంస్థల్లో, పరిశోధన సంస్థల్లో, ఉన్నత విద్యలో ప్రవేశం కోసం అర్హత సంపాదిస్తున్నారు.
"Libraries store the energy that fuels the imagination. They open up windows to the world and inspire us to explore and achieve, and contribute to improving our quality of life." అని Sidney Sheldon చెప్పినట్లు అలాంటి కళాశాల గ్రంథాలయాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 2020 లెక్కల ప్రకారం 42,343 కళాశాలలుండగా, 1179 స్టాండర్డ్ ఎ లోన్ కళాశాలలున్నాయి. 60 శాతం కళాశాలల్లో గ్రంథాలయాలను నామమాత్రంగా నడపడం చాలా దయనీయం. ముఖ్యంగా ప్రయివేటు కళాశాలల్లో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా ఉంది. కనీస గ్రంథాలయ గది, మౌలిక వసతులు లేకపోవడం, నూతన పుస్తకాలు లేకపోవడం, టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ...
విద్యార్థి పట్టా పొందిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీలో నిలబడాలంటే అంతర్జాతీయ స్థాయి కనుగుణంగా సమాచారాన్ని అందిపుచ్చుకోవాలి. అలా కావాలంటే వసతులు, వనరులు ముఖ్యంగా గ్రంథాలయ వసతులు విద్యార్థికి అందించాల్సిన అవసరం ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉన్నది. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ 2020 ప్రకారం ప్రతి ప్రభుత్వ ప్రయివేటు విద్యా వ్యవస్థలో (పాఠశాల,కళాశాలలో) గ్రంథాలయాల నిర్వహణ తప్పనిసరి అని గ్రంథాలయాల కావలసిన పుస్తకాలను కానీ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్, డిజిటల్ రిసోర్సెస్ కానీ వివిధ మాద్యమాల ద్వారా, డిజిటల్ వేదికల ద్వారా, వివిధ పద్ధతుల ద్వారా అందిపుచ్చుకోమని చెప్పారు. కానీ ఆ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ (ఈబుక్స్,ఈ జర్నల్స్, ఈఆర్టికల్స్ ,ఈతీసేస్, ఈడిసెర్టేషన్స్, వీడియో లెక్చర్స్ ఆడియో లెక్చర్స్) కానీ అందిపుచ్చుకోవాలంటే కనీస ఎలక్ట్రానిక్ వనరులు, వసతులు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) అందు బాటులో ఉండాల్సిన అవసరం ఉన్నది. అవి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తప్పితే ప్రయివేటు డిగ్రీ కళాశాలల్లో, జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశా లల్లో ఎక్కడా లేని పరిస్థితి. రాధాకృష్ణ కమిషన్, కొఠారి కమిషన్, భారత గ్రంథాలయ పితామహులు రంగ నాథన్ రివ్యూ కమిటీ చెప్పినట్టు విద్యా రంగం బడ్జెట్లో కనీసం ఆరు శాతం నుంచి పది శాతం గ్రంథాలయాలకు కేటాయించాల్సిన అవసరమున్నప్పటికీ ఏ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో బడ్జెట్ను కేటాయించిన దాఖలాలు లేవు.
మేధో సంపత్తికి గ్రంథాలయాలు దోహదం...
విద్యార్థుల మానసిక, మేధో వికాసాన్ని పెంచడంలో గ్రంధాలయాలు అవిరళమైన పాత్ర పోషిస్తాయి. గ్రంథాలయాల ద్వారా పుస్తకం నుండి పొందిన జ్ఞానం ఫలితంగా సమాజంలో ఓ మంచి వ్యక్తిగా, గౌరవంగా ఉన్నత విలువలు కలిగిన శక్తి కలిగివుంటారు. అలాగే తమ మంచి ప్రవర్తన ద్వారా సమాజానికి ఉపయోగపడతారు. ఇవన్నీ విద్యార్థులకు అలవడాలంటే గ్రంథాలయంలో ఉన్న గ్రంథ సంపదకు మించిన జ్ఞానం మరొకటి లేదు. యువత గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి అందులో ఉన్న పుస్తక సంపద ద్వారా జ్ఞానాన్ని సంపాదించి సామాజిక,ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి.నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథ సంపదను, విద్యార్థుల అవసరాలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలను, నూతన శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి గ్రంథాలయాలను నిర్వహించి విద్యార్థులకు అందించే ప్రయత్నం చేయాలి. వాటి ద్వారా సముపార్జించిన జ్ఞానం ద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీలో నిలబడి గెలవగలిగే స్థాయిలో మనం విద్యార్థిని ఈ సమాజానికి అందించాలి. దీనికి సరైన ఆర్థిక వనరులు కల్పించి, పుస్తక సంపదను అర్హులైన గ్రంథ పాలకులచే విద్యార్థులకు సరైన సమయంలో అందజేయాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉన్నది. విద్యార్థులు చక్కటి జ్ఞానాన్ని సంపాదించి ప్రస్తుత కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో స్థిరపడటానికి సన్నద్ధమయ్యే విధంగా తయారు చేయవలసిన బాధ్యత విద్యాసంస్థలకు ఉండాలి. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లడం అక్కడ ఉన్న పుస్తకాలను ఉపయోగించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు వివరించాల్సిన అవసరం మనకే కాదు అందరిపైనా ఉన్నది...
తనిఖీ సమయాల్లోనే పుస్తకాలు...
విశ్వవిద్యాలయం నుంచి, అధికారిక సంస్థల నుంచి తనిఖీకి వచ్చినప్పుడు మాత్రమే గ్రంథాలయాల్లో పుస్తకాల సంఖ్య కనబడుతుంది. వాస్తవంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు , పుస్తకాలు, గ్రంథాలయాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఒకవేళ ఉన్నా పుస్తకాలు అతి తక్కువగా ఉండడం, టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండడం గ్రంథ పాలకులు లేక గ్రంథాలయ నిర్వహణ ఇబ్బందికరంగా ఉండడం జరుగుతున్నటువంటి పరిణామం.కళాశాల గ్రంథాలయంలో పాఠ్యపుస్తకాలతో పాటు పోటీ పరీక్షలు పుస్తకాలు, చరిత్ర, సామాజిక శాస్త్ర పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు, కాల్పనిక సాహిత్యం, వివిధ రాజకీయ నాయకులు జీవిత చరిత్రలు, జాతీయ అంతర్జాతీయ రాజకీయ సంభంధాల పుస్తకాలు, ఆంగ్ల సాహిత్యం, గొప్ప వ్యక్తుల రచనలు,.ప్రపంచ జ్ఞానాన్ని విద్యార్థికి అందుబాటులో ఉంచాలి.మెడికల్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో, ఫార్మసీ కళాశాలలో, ఆర్కిటెక్చర్ కళాశాలలో, బీఈడీ, టీటీసీ, దాదాపు 70 శాతం గ్రంథాలయాలు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం గ్రంథాలయాల కేటాయించే బడ్జెట్ 5శాతం కూడా లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. అనేకచోట్ల అర్హత లేని వ్యక్తులు గ్రంథాలయాన్ని నిర్వహించడం శోచనీయం. ఎంసీఐ, ఎ ఐసి టి, యన్ సి ఆర్ టి, వివిధ అధికార తనిఖీ సంస్థలు వచ్చినప్పుడు మాత్రమే గ్రంథాలయాలు తళతలాడుతాయి మిగతా సమయంలో గ్రంథాలయ నిర్వహణ, చదువరులు (విద్యార్థులు ఉపాధ్యాయుల) ఆశించి స్థాయిలో ఉపయోగించుకోక వెలవెలబోతున్నాయి. ఆ గ్రంథాలయంలో 90శాతం టెక్స్ట్ పుస్తకాలు వాటిలో 70 శాతం పాత పుస్తకాలే (సిలబస్ మారినవి) ఉన్నాయి.
- డా|| రవి కుమార్ చేగొని, 9866928327