Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసేతు హిమాచల పర్యంతం అభిమానులను సంపాదించి, ఎందరో రసికుల కలల రాణిగా జేజేలు అందుకున్న షర్మిలా ఠాగూర్ మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 2013లో భారత ప్రభుత్వంచే 'పద్మ భూషణ్' పురస్కారాన్ని అందుకుంది. 'అమర్ ప్రేమ్', 'వక్త్', 'ఆమ్నే సామ్నే', 'ఆరాధన', 'సుహానా సఫర్', 'మౌసమ్', 'చుప్కే-చుప్కే' వంటి సినిమాలతో 70 వ దశకంలో బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగారామె. షర్మిలా నటించిన ప్రేమకథా చిత్రాలు చూసి, ఆమె వీరాభిమానులుగా మారినవారెందరో! ఆమెపై అభిమానంతో తమ ఆడపిల్లలకు 'షర్మిల' అని నామకరణం చేసిన వారూ లేకపోలేదు. అంతలా ఆ రోజుల్లో అభిమానులను ఆకట్టుకున్న షర్మిలాకు ప్రస్తుతం 77 ఏళ్ళ వయసు. ఆమె తనయుడు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సైతం తల్లి బాటలో పయనించి, నటులుగా అలరిస్తున్నారు. షర్మిలా ఠాగూర్ 2004-2011 వరకు ఇండియన్ సెన్సార్ బోర్డ్‌కు నాయకత్వం వహించింది. 2009 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ పోటీ జ్యూరీ సభ్యులలో ఒకరిగా ఉన్న షర్మిలా పుట్టినరోజు సందర్భంగా నవతెలంగాణ ఆదివారం అనుబంధం 'సోపతి'' పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
షర్మిలా ఠాగూర్ 1944 డిసెంబర్, 8న కాన్పూర్‌లో గీతీంద్రనాథ్ ఠాగూర్, ఇరా బారువా దంపతులకు జన్మించింది. షర్మిలా తండ్రి గీతీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్లో జనరల్ మేనేజర్‌గా పనిచేసేవాడు. గీతీంద్రనాథ్ బెంగాలీ కుటుంబానికి చెందిన వాడు కాగా, ఆయన భార్య ఇరా బారువా అస్సామీకి చెందినది. వీరిరువురు విశ్వకవి, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దూరపు బంధువులు. షర్మిలా కలకత్తాలోని సెయింట్ జాన్స్ డయాసిస్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూలులోను, లోరెటో కాన్వెంటులోను చదివింది. షర్మిలా తన 13వ ఏటనే సినీరంగ ప్రవేశం చేయడంతో చదువు పట్ల ఏకాగ్రత నిలుపలేక పోయింది. దీంతో తండ్రి సలహా మేరకు చదువుకు స్వస్తి చెప్పి సినిమా నటన వైపు దృష్టి సారించింది.
'అపూర్ సన్సార్' సినిమాతో నటిగా..
షర్మిలా ఠాగూర్ నటిగా తన ప్రస్థానాన్ని 1957లో సత్యజిత్ రే తీసిన 'అపూర్ సన్సార్' బెంగాలీ సినిమాలోని ''అపర్ణ'' పాత్రద్వారా ప్రారంభించింది. ఈ సినిమా కోసం సత్యజిత్ సత్యజిత్ రే కాస్టింగ్ చేస్తున్నప్పుడు 13 ఏళ్ల వయసు ఉన్న షర్మిలా ఠాగూర్‌ను చూసి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెళ్లారు. ఇంటికి వచ్చి ఫొటోలు తీయడానికి ఆయన వెంట ఇంటికి తీసుకెళ్ళి తన భార్య బిజోయా చేత అలంకరింప చేసి ఫొటోలు తీసుకున్నాడు. అవి తాను అనుకున్న అపర్ణ పాత్రకు సరిగ్గా సరిపోవడంతో 'అపూర్ సన్సార్' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత బెంగాలీలో 1960 లో సత్యజిత్ రే ''దేవి' సినిమాలో, 1963 లో హరిదాస్ భట్టాచార్య ''శేష్ అంక'', తపన్ సిన్హా '' ''నిర్జన్ సైకతె'', ''పార్థ ప్రతిమ్ చౌధురి'' ''ఛాయ సూర్జొ'' సినిమాలలో నటించింది. 1964 లో శక్తి సామంతా రూపొందించిన ''కాశ్మీర్ కీ కలీ'' సినిమా ద్వారా హిందీ చిత్రరంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత 1965 లో ''వక్త్'', 1967 లో ''యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్'' సినిమాల్లో నటించింది. కాగా ఈ సినిమాలో షర్మిలా ఠాగూర్ బికినీ దుస్తుల్లో కనిపిస్తుంది. ఒక భారతీయ సినిమా నటి బికిని ధరించి నటించడం ఇదే తొలిసారి. 1969లో ''ఆరాధన'' (షర్మిలా ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న చిత్రం), 1970లో సఫర్, 1971లో ''ఛోటీ బహు'' సినిమాల్లో నటించింది. 1972లో అమర్ ప్రేమ్, మాలిక్, 1973లో దాగ్ సినిమాలలో రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ జంటగా వచ్చిన ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాయి. షర్మిలా ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ జోడీకి మంచి పేరుంది. ఆమె 1975లో గుల్జార్ చిత్రం ''మౌసమ్''లో నటించింది. ఈ చిత్రం ద్వారా షర్మిలా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 1991 లో మీరా నాయర్ చిత్రం ''మిస్సిస్సిప్పి మసాలా''లో కూడా ఆమె సహాయక పాత్రను పోషించింది. షర్మిలా ధర్మేంద్ర సరసన 1966 లో 'దేవర్, అనుపమ', 1968 లో 'మేరే హమ్దమ్ మేరే దోస్త్', 1969 లో 'సత్యకం, యాకీన్', 1975 లో 'చుప్కే చుప్కే, ఏక్ మహల్ హో సప్నో కా', 1984 లో 'సన్నీ' మొదలైన ఏడు చిత్రాలలో నటించి విజయవంతమైన జంటగా గుర్తింపు పొందింది. షర్మిలా అమితాబ్ బచ్చన్ సరసన 1975లో 'ఫరార్', 1978లో 'బేషరమ్' సినిమాలలో నటించింది. 1975లో సంజీవ్‌కుమార్ సరసన 'మౌసం', 1991లో బెంగాలీ చిత్రం 'మంగళ్‌దీప్'లో నసీరుద్దీన్ షా సరసన నటించింది. షర్మిలా 1993లో 'ఆషిక్ ఆవారా', 1999లో 'మన్', 2005లో 'విరుద్ధ్', 2006లో 'ఏకలవ్య: ది రాయల్ గార్డ్' సినిమాలలో నటించింది. 2010లో వచ్చిన 'బ్రేక్ కే బాద్' చివరి చిత్రంతో నటన నుంచి విరమించుకుంది. అయితే 2022లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తోన్న 'గుల్ మొహర్'లో మళ్ళీ నటించింది. రాహుల్ చిట్టెల్ల రూపొందిస్తున్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్పారు, అమోల్ పాలేకర్, సూరజ్ శర్మ, సిమ్రాన్ నటిస్తున్నారు. ఇందులో ఇంటిపెద్ద పాత్రలో షర్మిల నటించారు.
షర్మిలా ఠాగూర్ 1966-1969 మధ్య కాలంలో తన సహచర నటీమణులైన ''నంద, వహీదా రెహ్మాన్'' లతో పాటు బాలీవుడ్లో అత్యధిక పారితోషికం పొందిన నటిగా రెండవ స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో సక్సెస్ జోడీగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న షర్మిలా 1970-1975 వరకు ముంతాజ్తో పాటు అత్యధిక పారితోషికం పొందిన నటిగా నిలిచింది. షర్మిలా రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, నషీరుద్దీన్ మొదలైన అగ్ర నటుల సరసన నటించింది. 1975లో గుల్జార్ తీసిన 'మౌసమ్' చిత్రంలో ఈమె నటనకు ఉత్తమ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. 2003లో గౌతమ్ ఘోష్ తీసిన ''అభర్ అరణ్యె'' అనే బెంగాలీ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయనటి లభించింది. షర్మిలా ఏ పాత్రలో నటించినా, అది పూర్తి చేసిన వెంటనే అందులో నుంచి బయటకు వచ్చేయడం అలవాటుగా చేసుకుని తన కెరీర్లో దాదాపు 100 కు పైగా చిత్రాల్లో నటించింది.
వ్యక్తిగత జీవితం
1960లో షర్మిలా ఠాగూర్‌కు సినిమాటోగ్రాఫర్ ''సౌమెందు రారు''తో నిశ్చితార్థం జరిగినా, 1967లో 'యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్' సినిమా పెద్ద హిట్ సాధించిన తర్వాత బెంగాలీ హిందూ బ్రాహ్మణురాలైన షర్మిలా ఠాగూర్‌కు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ముస్లిం మతానికి చెందిన ''మన్సూర్ అలీఖాన్ పటౌడీ నవాబ్''తో ఏర్పడిన పరిచయం వివాహానికి దారి తీసింది. షర్మిలా 1969 వ సంవత్సరం డిసెంబర్, 27 వ తేదీన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకుని ముస్లిం మతంలోనికి మారి, తన పేరును ''ఆయేషా సుల్తానా'' గా మార్చుకుంది. వివాహం చేసుకున్న తర్వాత వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ఆమె 23 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 16, 1970న మొదటి బిడ్డ ''సైఫ్ అలీ ఖాన్'' కు జన్మనిచ్చింది. 1976 లో రెండవ బిడ్డ ''సబా అలీఖాన్'' కు జన్మనివ్వగా, అక్టోబర్ 4, 1978 న తన 31 వ ఏట 3 వ బిడ్డ ''సోహా అలీ ఖాన్'' కు జన్మనిచ్చింది. వీరిలో సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ తల్లిబాటలో పయనిస్తూ సినిమా రంగంలో రాణిస్తుండగా... సాబా అలీఖాన్ మాత్రం వ్యాపార రంగంలో స్థిరపడింది. షర్మిలా వివాహమైన 41 సంవత్సరాల తర్వాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 70 సంవత్సరాల వయస్సులో శ్వాసకోశ వైఫల్యంతో 2011 సెప్టెంబర్ 22న మరణించారు.
సామాజిక సేవలో
షర్మిలాకు నటన ఒక్కటే ప్యాషన్ కాదు. ఆమె దేశంలోనే కాకుండా సరిహద్దుల్లో సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటుంది. షర్మిలా తన కుమార్తె సోహా అలీ ఖాన్‌తో కలిసి న్యూయార్క్‌లోని CRY గాలాలో ''ప్లెడ్జ్ 2016'' ప్రచారానికి కీలక ప్రసంగాలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల ప్రయోజనాల కోసం 43 వేల డాలర్లను సేకరించింది. క్యాన్సర్ రోగుల చికిత్సకు నిధులు సమకూర్చే లాభాపేక్షలేని సంస్థ Can Support నిర్వహించే కార్యక్రమాల్లో షర్మిల ఉద్వేగభరితంగా పాల్గొనడంతో పాటు, క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన నిధులను సేకరించేందుకు మారథాన్లు, వాకథాన్లలో పాల్గొంటున్నది. 2005లో యునిసెఫ్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైన షర్మిలా గత ఒక దశాబ్దంలో ఆమె పిల్లలపై వ్యాధి ప్రభావంపై కీలక దృష్టితో HIV/AIDS గురించి అవగాహన కల్పించడంలో సహాయం చేసింది.
హైదరాబాద్‌లో పుట్టలేదు
వికీపీడియాలో చెప్పినట్టుగా షర్మిలా 1946లో హైదరాబాద్‌లో పుట్టలేదు. 1944లో కాన్పూర్‌లో పుట్టింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంశంలో 5వ తరానికి చెందిన మహిళ షర్మిలాను నటిగా జనం గుర్తించడం మొదలుపెట్టాక, వారి హృదయాల్లో స్థానం సంపాదించగలిగింది. అప్పుడే గ్లామర్ గాళ్ అనే ఇమేజ్ నుంచి దూరమవ్వాలనే ఆలోచన.. ఇంకా మంచి పేరు పొందాలనే తపన తనలో పెరిగిందని ఆ మద్య హైదరాబాద్ వచ్చినపుడు షర్మిలా ప్రకటించింది.
షర్మిలా అక్టోబర్ 2004 నుండి మార్చి 2011 వరకు భారతీయ చలనచిత్ర సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా పని చేసింది. డిసెంబరు 2005లో ఈమెను ''యూనిసెఫ్ గుడ్‌విల్ ఎంబాసిడార్''గా ఎన్నుకున్నారు. షర్మిలా 2009లో జరిగిన ''కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్''కు జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది. 2016 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగిన లాహోర్ లిటరేచర్ ఫెస్టవల్కు హాజరయ్యింది.
అవార్డులు - సత్కారాలు
1975లో ''అభర్ అరణ్యె'' చిత్రానికి 'జాతీయ ఉత్తమ సహాయ నటి' అవార్డు అందుకున్న షర్మిలా 2003లో ''మౌసమ్'' చిత్రంలోని నటనకు 'జాతీయ ఉత్తమనటి' అవార్డుకు ఎంపికయ్యింది. 2013లో భారత ప్రభుత్వం చిత్రరంగంలో షర్మిలా చేసిన కృషిని గుర్తించి ప్రతిష్టాత్మకమైన ''పద్మభూషణ్'' పురస్కారంతో సత్కరించింది.
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు : 1970లో ''ఆరాధన'' సినిమాకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి పురస్కారం, 1998 లో షర్మిలా ఫిల్మ్‌ఫేర్ ''జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. 2002లో ''స్క్రీన్'' జీవన సాఫల్య పురస్కారం, 2010లో 'ఆనందలోక్'' జీవన సాఫల్య పురస్కారం, 2014లో సంస్కృతి కళాశ్రీ అవార్డును అందుకున్నారు. 2011లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిమ్ అకాడమీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2019లో హలో! హాల్ ఆఫ్ ఫేమ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2019 లో వోగ్ బ్యూటీ లెజెండ్ అవార్డు స్వీకరించింది.
-పొన్నం రవిచంద్ర, 9440077499