Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో వినిమయం చేసే వస్తువులు/ సరుకులు/ సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులే వినియోగదారులు. ఏ వ్యాపారానికైనా మూలస్తంభాలు వినియోగదారులే. వినియోగం ఉంటేనే ఉత్పత్తి ఉంటుంది. ఈ రెంటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వినియోగం మందగిస్తే ఉత్పత్తి కుంటు పడుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తుంది. వినియోగదారులే ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు. ప్రస్తుత నేపథ్యంలో వ్యాపార లావాదేవీలు బాగా విస్తృతమయ్యాయి. వస్తు సేవల వినియోగం పెరిగింది. వస్తువుల నాణ్యత, పరిమాణం విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంలో వినియోగదారుని పాత్ర చాలా కీలకం. మహాత్మా గాంధీ వినియోగదారుల ప్రాధాన్యతను వివరిస్తూ 'మన వాకిట్లోకి విచ్చేసే వినియోగదారు ముఖ్యమైన సందర్శకుడు. మన పనిలో అతడు అంతరాయం కాదు. మన పని ముఖ్య ఉద్దేశమే అతడు. అతనికి సేవ చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా మనకు మేలు చేస్తున్నాడు' అని వినియోగదారుల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
మనం కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవల విషయంలో అడుగడునా మోసాలు, కల్తీలే. ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువ య్యాయి. ఈ మార్కెట్ మాయాజాలం కారణంగా వినియోగదారులు ఆర్థికంగా నష్ట పోవడమే కాదు, ఎంతో విలువైన ఆరోగ్యాన్నీ, కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు.
ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువు ఏదయినా ఉందా అని అడిగితే చెప్పలేని పరిస్థితి. ప్రతి వస్తువులోను, సేవలోనూ మోసాలు పెరిగిపోతున్నాయి. పాల విషయంలోనే చూసుకుంటే... ఒక పక్క పాడి పశువుల పెంచే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండగా, మరొక పక్క అనేక కొత్త పాల డెయిరీలు పుట్టుకొస్తున్నాయి. ఈ పాల డైరీలన్నిటికీ అవసరమైన పాలు ఎక్కడ నుంచి వస్తున్నాయంటే సమాధానం లేదు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మందులు, ఆహార పదార్థాలు, పానీయాలు ప్రాణాలు తీసిన సంఘటనలు అనేకం చూస్తున్నాం, వింటున్నాం. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్కెట్ మోసాలను చూస్తున్నాం. కొలతల్లో, తూకంలో కొనుగోలు దారులు అడుగడుగునా మోసపోతున్నారు. చిల్లర కొట్టు నుంచి బడా మాల్స్ అన్నిటిలోనూ ఇదే ధోరణి.
తాము విక్రయించే వస్తువు ధరలో సగం తగ్గించి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్లు అందచేస్తున్నామని ఇది కూడా నిర్ణీతకాలం పాటు మాత్రమే అంటూ లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రకటనలు గుప్పించి విక్రయాలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలను చూస్తున్నాం. ఇది వాస్తవమా కాదా అనేది గ్రహించలేని స్ధితిలో వినియోగదారులున్నారు. ఇదివరకు వినియోగదారుడు మార్కెట్‌కు వెళ్లి వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అంతా ఆన్లైనే. అయితే కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, ఆశించిన మేరకు ప్రమాణాలు లేకపోయినా ఎవరినీ అడిగే పరిస్థితులు లేవు.
వినియోగదారుల ఉద్యమం
వినియోగదారుల సంరక్షణ, సంక్షేమం, సేవలు తదితర అంశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్లే, వారి ప్రత్యేక హక్కుల కోసం గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ప్రధానంగా ప్రముఖ అమెరికా రచయిత, రాజకీయవేత్త, వినియోగదారుల హక్కులకై పోరాడిన 'రాల్ఫ్ నాడార్' వినియోగదారుల హక్కుల పితామహుడిగా పేరొందాడు. 'రాల్ఫ్‌నాడార్' కృషి వల్లే... ప్రపంచమంతటా వినియోగదారుల ఉద్యమ సంఘాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా అమెరికాలో 1920లో వినియోగదారుల సంఘం ఏర్పడి, వారి హక్కుల కోసం ఉద్యమం ఆరంభమయ్యింది. కాలక్రమంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నార్వే, డెన్మార్క్‌లలో వినియోగదారుల సంఘాలు ఏర్పడి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమలు తీవ్రతరం చేశాయి. 1962, మార్చి 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెనడీ వస్తు, సేవల విషయంలో కొనుగోలుదారునికి కావలసిన '1. భద్రత హక్కు, 2. సమాచార హక్కు, 3. ఎంచుకునే హక్కు. 4. తన ఫిర్యాదును వినేటట్లు చేసే హక్కు' వంటి న్యాయపరమైన హక్కుల కోసం అమెరికా కాంగ్రెస్ (దిగువసభ)లో వినియోగ దారుల హక్కుల బిల్లును ప్రతిపాదించారు.
జాన్.ఎఫ్.కెనడీ ఒక సభలో ప్రసంగిస్తూ 'వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇవ్వడం, ధరలు మరీ ప్రియంగా ఉండడం, ఔషధాలు సురక్షితంగా లేకపోవడం, వినియోగదారు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలు చేసుకొన్న సందర్భాలలో వినియోగదారు ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. డాలర్ తన విలువను కోల్పోయినట్లవు తుంది. దేశ ప్రయోజనం దెబ్బతింటుంది కూడా' అన్నారు. ఈ ప్రసంగ ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణనలోకి తీసుకొన్న కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ (సిఐ) ప్రాంతీయ సంచాలకుడు అన్వర్ ఫజల్ కెనడీ హక్కుల బిల్లు కోసం ప్రసంగించిన మార్చి 15 తేదీనే 'ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం'గా పరిగణించాలని 1972లో తీర్మానిం చారు. దానితో 1973 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మార్చి15 ను వినియోగదారుల హక్కుల దినంగా ప్రకటించారు. 1982 నుండి ఈ దినోత్సవాన్ని ప్రపంచంలోని అన్ని దేశాల జరుపుకుం టున్నాయి. అప్పటి నుంచి ప్రతీ ఏటా ఒక థీమ్ ప్రకటించి, ఆ లక్ష్య సాధనకు అంతర్జాతీయ వినియోగదారుల సంఘం విశిష్ట కృషి చేస్తోంది. దానిలో భాగంగా 2023 ఏడాదికి 'క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ద్వారా వినియోగదారులకు సాధికారత' అనే థీమ్ ప్రకటించారు.
మన దేశంలో...
1985లో ఐక్యరాజ్యసమితి వినియోగదారుల హక్కులను గుర్తిస్తూ తీర్మానం చేసి ఆమోదించారు. తరువాత, దీనిని హర్షిస్తూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ లోక్‌సభలో 1986లో భారతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం డిసెంబర్ 24న అమల్లోకి తెచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం డిసెంబర్ 24ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ప్రకటించారు. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చ్ 15ని నిర్వహించుకుంటున్నాం.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ముఖ్యోద్దేశం లాభాపేక్ష గల వ్యాపారుల దోపిడీని అరికట్టి, వినియోగదారుల హక్కులను, బాధ్యతలను గుర్తు చేసి, వారిని చైతన్యపరచడం, న్యాయం జరిగేలా చూడడం. వినియోగదారులను అనేక మోసాల నుంచి కాపాడడానికి ఈ చట్టం పాశుపతాస్త్రంగా పనిచేస్తుంది.
ఈ చట్టం వినియోగదారులకు ఆరు హక్కులు ప్రకటించింది. అవి-
1. వినియోగదారుల రక్షణ : మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదకారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు. అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి.
2. సమాచారం పొందే హక్కు : అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, ప్రమాణం గురించి తెలియజేయాలి.
3. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు: వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి రేటు తెలుసుకోవడం.
4. ప్రాతినిధ్యం వహించే హక్కు: వినియోగదారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం.
5. వినియోగదారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవా లోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు: వినియోగదారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం.
6. వినియోగదారుల విద్య హక్కు: వినియోగదారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవడం.
ఈ చట్టం చేయకముందు వినియోగదారులకు ఏవిధమైన హక్కులూ వుండేవికావు. వినియోగదారులను నష్టపరచిన వ్యాపారులకు శిక్షలు మాత్రమే వుండేవి. అందుచేత వారికి కలిగిన నష్టాన్ని పూరించుకొనే అవకాశం వుండేది కాదు. ఈ చట్టం చేసిన తరువాత భారత దేశంలో లక్షలాదిమంది వినియోగదారులు పరిహారం కోసం వినియోగదారుల కోర్టులకు వెళ్లి పరిహారం పొందగలిగారు.
అయితే 1986 చట్టం అమల్లోకి వచ్చినప్పుడు మార్కెట్ పరిథి చాలా తక్కువ. ఆ సమయంలో సూపర్ మార్కెట్లు, ఇ-కామర్స్ వంటివి లేవు. ఇప్పటిలా ఇతర దేశాలతో వస్తు ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు లేవు. దీంతో పాత చట్టాల ఆధారంగా ఫిర్యాదు చేయడం సమస్యగా మారింది. ఈ కారణంగానే భారత ప్రభుత్వం 2019 లో వినియోగదారుల రక్షణకు కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
నూతన వినియోగదారుల
పరిరక్షణ చట్టం ప్రత్యేకతలు
ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటయింది. ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయడానికి పనిచేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్లు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా, దర్యాప్తు జరిపి ఆ తయారీ/ అమ్మకందారులు, ప్రకటన/ ప్రసారకర్తల మీద జరిమానాలు విధిస్తుంది.
ఈ కామర్స్ వేదికలు అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవడానికి కూడా చట్టంలో నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం కేసు పరిశీలనా పరిధి జిల్లా స్థాయిలో రూ. కోటి, రాష్ట్ర స్థాయిలో రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు, జాతీయ స్థాయిలో రూ. 10 కోట్ల కంటే ఎక్కువ జరిమానా విధిస్తారు.
వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా చట్టంలో చేర్చారు. ప్రధానంగా వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. దీని వల్ల న్యాయ ప్రక్రియ సులభమవుతుంది. ఇరు పక్షాలు అంగీకరిస్తే కమిషన్ మధ్యవర్తిత్వం ఏర్పాటు చేస్తుంది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల లోపు కేసులు దాఖలు చేయటానికి ఎలాంటి రుసుమూ ఉండదు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
ఈ చట్టంలో ఉత్పత్తి బాధ్యత అనే కొత్త అంశాన్ని చేర్చారు. దీని వలన వస్తువు తయారీదారుడు/ సేవలు అందించినవాడు, అమ్మకం దారుడు నష్టపరిహారం చెల్లింపుకు బాధ్యులవుతారు. నకిలీ వస్తువులు లేదా నాణ్యతలేని వస్తువులు తయారు చేసినవారికి శిక్ష విధించే అధికారం కోర్టుకు ఉంది. మొదటిసారి నేరం రుజువైతే సంబంధిత వ్యక్తికి రెండేళ్ళవరకూ, రెండోసారి నేరం రుజువైతే లైసెన్స్ పూర్తిగా రద్దు చేయవచ్చు. వినియోగదారుడు చేసిన ఫిర్యాదును ఈ-కామర్స్ వేదికలు నలభై ఎనిమిది గంటల్లోగా స్వీకరించి, అది అందిన నెల రోజుల్లోగా పరిష్కరించాలని కొత్త చట్టం చెబుతోంది.
వస్తు ఉత్పత్తి, సేవలకు సంబంధించి హామీ, గ్యారెంటీ విషయాల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం, మౌలిక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం... వంటి వాటిని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు.
వాణిజ్య ప్రకటనల మోసాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చర్యలు తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్, టెలీషాపింగ్, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్ వివాదాలు సీసీపీఏ పరిథిలోకి వస్తాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేండ్ల జైలు, రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అధికారం సీసీపీఏకు ఉంది. సరైన రీతిలో ఉపయోగించుకుంటే వినియోగదారుల చేతిలో ఈ చట్టం ఓ బ్రహ్మాస్త్రమే.
అవగాహనా లోపం
వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువు విషయంలో కేవలం ఆ వస్తువు ధరను మాత్రమే చూస్తారు. కొందరైతే ధరతో పాటు ఎక్స్పౖౖెరీ (గడువు ముగిసే) తేదీని గమనిస్తారు. అయితే ఆ వస్తువు నిర్ధా రించిన బరువు ఉందా అనేది పరిశీలించే వాళ్ళు అరుదు. గతంలోగానీ, వర్తమానం లో గానీ వినియోగదారుల హక్కుల రక్షణకు చట్టాలు లేకపోవడం కంటే, ఉన్న చట్టాల గురించి వినియోగదారులకు సరైన అవగా హన లేకపోవడం వల్లనే మరింత దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా చట్టాలు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతల గురించి తెలియక పోవడం, తెలిసినా చిన్న మొత్తాల కోసం, సమయం 'వృథా' చేసుకోవడం ఎందుకని ఎవరికి వారు చట్టం తలుపులు తట్టకపోవడం వల్ల, మార్కెట్‌శక్తులు విని యోగదారులను తేలిగ్గా మోసం చేస్తు న్నాయి. అసలు వినియోగదార్లు హక్కుల పరిరక్షణకు ఓ ప్రత్యేక చట్టం ఉందనే విషయం కూడా ఇప్పటికి కూడా తెలియని వారు అనేకులు ఉన్నారంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
నిరక్షరాస్యులైన వినియోగదారులు మోసపోయారు అంటే అర్థం ఉంది. విద్యాధికులు కూడా ఈ మోసాలను గుర్తిం చలేక పోవడం ఆశ్చర్యం. గుర్తించినా దాని పై చట్టబద్ద పోరాటం చేయడంలో అనేక మంది వెనుకడుగు వేస్తున్నారు. వ్యాపారస్తు లపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడి నప్పటికీ దానికి సంబంధించిన కీలక ఆధార మైన కొనుగోలు రశీదు లేనివాళ్లే ఎక్కువ.
రశీదులు కీలకం
సరుకులు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుని కొంటాం కానీ బిల్లు తీసుకోవడంలో శ్రద్ధ చూపం. ఒకవేళ వ్యాపారి ఇవ్వడానికి సిద్ధపడినా తీసుకోని వినియోగదారులు ఎందరో. కొందరు వ్యాపారస్తులు బిల్లు అవసరం లేకపోతే కొంత ధర తగ్గిస్తాం అని కూడా ఆఫర్ ఇస్తారు. ఇలా బిల్లు లేకుండా కొనుగోలు చేసిన వస్తువు నాణ్యతలో కానీ పరిమాణంలో కానీ తేడా వస్తే అమ్మకం దారుడిపై ఎటువంటి చర్య తీసుకోవడానికీ ఆధారం వుండదు. కొన్నిసార్లు బిల్లు తీసుకున్నప్పటికీ వాటిని జాగ్రత్త చేయడంలో శ్రద్ధ చూపరు. అటువంటప్పుడు వస్తువుకు గ్యారంటీ/వారంటీ ఉన్నా అమ్మకం దారుపై వస్తు నాణ్యత విషయంలో చర్యలు తీసుకోలేం. ఇటువంటి కారణాల వల్లనే లక్షలాది మంది వ్యాపారస్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు.
దేశ వ్యాప్తంగా వినియోగదారుల్లో చైతన్యం తీసుకు రావడానికి అనేక స్వచ్చంద సంస్ధలు ఏర్పాటయ్యాయి. వాటిలో 'ఆసరా' (అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్) ఒకటి. వస్తువులు, సేవల నాణ్యత, పరిమాణం, ధరల విషయంలో వినియోగదారులు మోసపోతే వారిలో చైతన్యం నింపి, వారికి న్యాయ సహాయం అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన స్వచ్చంద సంస్థ ఇది.
2013లో ప్రారంభమైన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణకు అవసరం అయిన సేవలను అందిస్తుంది. వినియోగదారులు వస్తుసేవల కొనుగోలు విషయంలో దోపిడీకి గురైనప్పుడు, తమ ఫిర్యాదులను తెలిపేందుకు, సలహాలు పొందేందుకు ఆసరా సంస్థ టోల్ ఫ్రీ నెంబరు 18008899895 ఏర్పాటు చేసింది. దీనికి కాల్ చేసి, వినియోగదారులు నేరుగా సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వినియోగదారులే తమ హక్కులను పరిరక్షించుకోడానికి సరైన బాధ్యతలు తీసుకోవాలి.
మన దేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అమలులోకి వచ్చి 38 ఏండ్లు కావస్తున్నా, ఇంకా ఆశించినంత మేలు జరగడంలేదనే చెప్పాలి. పట్టణ, నగర ప్రాంతాల్లో వినియోగ దారులకు ఈ చట్టం పట్ల కొంత అవగాహన ఉన్నా, నిర్లిప్తతతో వ్యాపారుల నుంచి నష్ట పరిహారం కోరేందుకు ముందుకు రావడంలేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పేదరికం, నిరక్షరాస్యత వల్ల వినియోగదారుల హక్కుల పట్ల సరైన అవగాహనలేదనే చెప్పాలి.
వస్తువుల నాణ్యత/ కొనుగోళ్లకు సంబంధించిన జాగ్రత్తల సమాచారాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం మరింత కషి చేయాలి. వస్తువులలో నాణ్యత లేకున్నా, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్న కార్పొరేట్ సంస్థలను కట్టడి చేస్తే చాలా వరకు వినియోగదారులు రక్షింపబడతారు.
కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సిబ్బందికి వ్యాపార భవనాల అద్దెలు ప్రకటనల కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసే సంస్ధలు వెయ్యి రూపాయిల వస్తువుని ఐదు వందలకే ఎలా ఇస్తున్నారనే విషయాన్ని విద్యాధికులు కూడా అర్ధం చేసుకోలేక పోతున్నారు. వ్యాపారం చేసేది తాను లాభాలను ఆర్జించడానికే తప్ప వినియోగదారుల శ్రేయస్సు కోసం కాదనే విషయాన్ని వినియోగదారులు గుర్తించాలి.
వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవాలంటే ముందుగా నిర్ధిష్ట బాధ్యతలను చేపట్టాలి. అవి లేకుండా ఎప్పటికీ మార్కెట్ మోసాల నుంచి బయట పడటం సాధ్యం కాదు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో మొదటి అడుగు వినియోగదారులదే కావాలి. వినియోగ దారులు కళ్లు తెరిస్తేనే హక్కుల రక్షణ సాధ్యమవుతుంది. అప్పుడే పరిరక్షణ చట్టాలకు సార్ధకత చేకూరుతుంది.
2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం
ప్రపంచీకరణలో భాగంగా వ్యాపార సేవా కార్య కలాపాల స్వరూప, స్వభావాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగానూ 'ఆన్లైన్' లావాదేవీలకు ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో 'ఆన్లైన్' మోసాలూ పెరిగాయి. ఈ నేపథ్యంలో 1986 నుంచి అమలులో ఉన్న వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యుగానికి తగిన విధంగా సవరించింది. 1991, 1993లోనూ చట్ట సవరణలు జరిగినా జూలై 20, 2020 నుంచి అమలులోకి వచ్చిన 2019 వినియోగదారుల చట్టం, వినియోగదారుల హక్కుల పరిధిని విస్తృతపరిచింది. ఈ నూతన చట్టం పాత మోసాలకు పగ్గాలు బిగిస్తూనే, డిజిటల్ మోసాలకు కళ్లెం వేసేందుకు ఉద్దేశించిన చట్టంగా పేర్కొనవచ్చు.
వినియోగదారుని బాధ్యతలు
- అవసరమైన వస్తువులను మాత్రమే కొనడం.
న కొనే వస్తువులు గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. మోసపూరితమైన ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వస్తువుల నాణ్యత పట్ల రాజీపడకూడదు.
- కొనుగోలు సమయంలో సరైన రశీదు తీసుకోవాలి. కొన్ని రకాల వస్తువుల విషయంలో గ్యారంటీ /వారంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి.
- నాసిరకం వస్తువులు/ మోసపూరిత వ్యాపారస్తుల పట్ల వినియోగ దారుల ఫోరమ్‌లను ఆశ్రయించడానికి వెనుకాడకూడదు.
- ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్‌మార్క్ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి.
- వస్తువు తయారీ తేదీ, ముగింపు గడువు తేదీ, ధర తదితర వివరాలను సరిచూసుకున్న తర్వాతే వస్తువులను కొనాలి.
- మోసపోయినపుడు వెంటనే వినియోగ దారుల సేవా కేంద్రాల ద్వారా సరైన సమాచారం తెలుసుకొని ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందాలి.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578