Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశపు అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా గుర్తింపబడి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన రేఖ 1966లో బాలనటిగా అరంగేట్రం చేసి, 1970 ప్రారంభంలో ప్రధాన పాత్రల్లో కనిపించింది. ఇప్పటివరకు 180 చిత్రాలకు పైగా నటించిన రేఖ తన అందచందాలు, అభినయంతో అరుదైన నటిగా పేరుపొందింది. ఆరున్నర పదుల వయసు దాటినా, అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న రేఖ దక్షిణాదిన నటనలో ఓనమాలు దిద్దుకుని, ఉత్తరాదిన అనేక హిందీ చిత్రాలలో తన నటన,అందంతో కను విందు చేస్తూ.. ఈ నాటికీ నవతరం భామలకు ధీటుగా వెలుగులు విరజిమ్ముతుంది. రేఖను చూసి, ఆ నాటి ఆమె కథానాయకులు అబ్బుర పడుతూ ఉంటారు. రేఖతో నటించడం మొదలు పెట్టిన చాలా మంది నటీమణులు అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ, ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. 1981లో 'ఉమ్రావ్ జాన్' చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచిన రేఖ భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. 2012 లో రేఖ రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యింది.
తెలుగు నటి పుష్పవల్లి, తమిళ స్టార్ హీరో జెమినీ గణేశన్‌లకు 1954 అక్టోబర్ 10న భానురేఖ (రేఖ) జన్మించింది. పుష్పవల్లికి దర్శకులు వేదాంతం రాఘవయ్య సమీప బంధువు. ఆయన దర్శకత్వంలో యన్టీఆర్, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించిన 'ఇంటిగుట్టు'లో నాలుగేళ్ళ ప్రాయం లో రేఖ బాలనటిగా నటించింది. 1958లో విడుదలైన ఈ సినిమా భారీగా ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత 1966లో బి.యన్. రెడ్డి. దర్శకత్వంలో రూపొందిన 'రంగుల రాట్నం'లో 'దశావతారాల'ను వర్ణిస్తూ సాగే పాటలో ముద్దుగా మురిపించింది రేఖ. మొదట్లో సన్నగా పీలగా ఉన్న తరువాత ముద్దుగా బొద్దుగా తయారయింది. 15 ఏళ్ల వయసులోనే తన బొద్దు అందాలతో మురిపిస్తూ రాజ్‌కుమార్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం 'ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి సి.ఐ.డి. 999' లో నాయికగా నటించింది రేఖ. అందులో బికినీలో తడి అందాలతో రేఖ అలరించిన తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. ఆ తర్వాత 1970లో హిందీ చిత్రసీమలో నవీన్ నిశ్చల్‌తో కలసి 'సావన్ భాదో' లో నటించింది. ఆమె నటించిన ఈ మొదటి హిందీ చిత్రం హిట్ కొట్టింది. తెలుగులో 'అమ్మ కోసం' చిత్రంలో కృష్ణంరాజుకు జోడీగా అభినయించారు. ఉత్తరాది చిత్రాలలోనే తన లక్ పరీక్షించుకోవాలని ఆశించారు రేఖ. ఆరంభంలో రేఖ నటించిన అనేక చిత్రాలలో ఆమె బొద్దు గానే కనిపించారు. దక్షిణాది భామలు బొద్దుగానే ఉంటారని రేఖను చూసి కామెంట్ చేసేవారు. దానిని ఓ సవాల్‌గా తీసుకొని, తరువాతి రోజుల్లో యోగసాధనతో నాజూకు షోకులు సొంతం చేసుకున్న రేఖ నాటి మేటి హిందీ హీరోల సరసన హీరోయిన్గా నటించి మురిపించింది. 1972 లో 'రాంపూర్ కా లక్ష్మణ్', 1973 లో 'కహానీ కిస్మత్ కి', 1974 లో 'ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే' చిత్రంతో సహా పలు వాణిజ్య పరంగా విజయవంతమైన చిత్రాలలో నటించింది. 1975లో ఆమె యుద్ధ చిత్రం 'ఆక్రమన్'లో రాకేశ్ రోషన్ భార్య శీతల్ పాత్రలో నటించింది. మాఫియా ఇతివృత్తంగా రూపొందించిన 'ధర్మాత్మ' ఆ ఏడాదిలో ఆమె ఆర్థికంగా విజయం సాధించిన ఏకైక చిత్రం. ఫిరోజ్ ఖాన్ దర్శ కత్వం వహించి, నటించిన ఈ చిత్రంలో ఖాన్ చిన్న నాటి ప్రియురాలు అను పాత్రలో ఆమె నటించింది. అప్పటి దాకా అందాలతోనే కను విందు చేసిన రేఖ 1981లో 'ఉమ్రావ్ జాన్' లో నటిగానూ తనదైన బాణీ పలికించి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు. అనేక మంది ప్రముఖ దర్శకుల చిత్రా లలో రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరిస్తూనే ఉన్నారామె. ఆ మధ్య 'సూపర్ నాని'లోనూ రేఖ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకు లను ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆమె బయట ఏదైన షోకు వచ్చినా ఉత్సాహంతో కనిపిస్తుంది. 'ఆజ్ కల్ పావ్ జమీపర్ నహి పడ్తే హై మేరే', 'తేరే బినా జియా జాయేనా', 'సున్ సున్ దీదీ తేరే లియే ఏక్ రిష్టా ఆయాహై', 'ఆప్ కే ఆంఖోమే కుచ్ మెహకే హుయే రాజ్ హై', 'పర్ దేశియాఏ సచ్ హై పియా'... ఎన్నో హిట్ సాంగ్స్ రేఖకు గుర్తింపునిచ్చాయి.
కళాత్మక సినిమాలలో..
రేఖ అనేక ప్రధాన స్రవంతి సినిమాలతో పాటు కొన్ని బలమైన స్త్రీ పాత్రలు ఉన్న కళాత్మక చిత్రాలలో కూడా నటించి గొప్ప నటి అనిపించుకుంది. అత్యాచార భాదితురాలిగా 'ఘర్' సినిమాలో నటించి తన సీరియస్ నట ప్రయాణాన్ని మొదలెట్టింది. హృషికేశ్ ముఖర్జీ 'ఖూబ్సూరత్'లో రేఖను చూసి చాలామంది ముచ్చటపడ్డారు. ఆ తర్వాత ముజఫర్ అలీ దర్శకత్వంలో 'ఉమ్రావ్‌జాన్'లో నటించి రేఖ విమర్శకుల ప్రశంశలు పొందింది. ఒక వేశ్య జీవితాన్ని రేఖ సంపూర్ణమైన పరిణితితో ఆవిష్కరించగలిగింది. శ్యాం బెనగళ్ 'కలియుగ్', గిరిష్ కర్నాడ్ 'ఉత్సవ్' తో పాటు 'ఇజాజత్', 'విజేత' లాంటి చిత్రాలు ఆమెను పార్లల్ సినిమాల్లో వెలిగించాయి. మరోవైపు 'ఫూల్ బనే అంగారే', 'ఖూన్ భరీ మాంగ్' ఆమెను యాక్షన్ హీరోయిన్ను చేశాయి. రేఖ ఏదైనా బాగా చేసింది. రేఖ చేసిందంతా బాగుందనే పేరు వచ్చింది. అయితే రేఖ నటించిన ''కామసూత్ర, ఖిలాడియోన్ కా ఖిలాడి, ఆస్తా: ఇన్ ది ప్రిజన్ ఆఫ్ స్ప్రింగ్'' చిత్రాలు అత్యంత వివాదాస్పదమయ్యాయి.
గాయనిగా రేఖ
రేఖకు నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టిన హృషీకేశ్ ముఖర్జీ 'ఖూబ్ సూరత్' చిత్రంలో ఆర్.డి.బర్మన్ స్వరకల్పనలో ''ఖేడా ఖేడా...'' అనే పాటనూ ఆలపించి, గాయనిగా మారింది. తరువాతి రోజుల్లో ''అగర్ తుమ్ నా హౌతే..' చిత్రంలోనూ ఆర్డీ బర్మన్ బాణీలలోనే రూపొందిన ''కల్తో సండేకీ చుట్టీ...'' అనే పాటను పాడింది. ఖయ్యూమ్ సైతం తన స్వరకల్పనలో 'ఏక్ నయా రిస్తా' సినిమా కోసం రేఖతో ''ఎహ్ సాస్ కా సౌదా హై...'' పాట పాడించారు. ఇక రేఖ యోగాభ్యాసంతో రూపొందిన 'రేఖాస్ మైండ్ అండ్ బాడీ టెంపుల్' సైతం అప్పట్లో విశేషాదరణ చూరగొంది.
అమితాబ్ బచ్చన్‌తో ప్రేమాయణం
అమితాబ్‌తో రేఖ తొలి పరిచయం ఆయనకు జయ బాదురితో 1972లో పెళ్లి జరగడానికి ముందే జరిగింది. అయితే అమితాబ్- రేఖతో కలిపి 'అప్నే- పరాయే' అనే సినిమాను దర్శకుడు కుందన్ కుమార్ ప్రారంభించారు. అయితే కొన్నిరోజుల షూటింగ్ తర్వాత ఆ సినిమా ఆగి పోయింది. తర్వాత అమి తాబ్ స్థానంలో సంజరు ఖాన్‌ను తీసుకున్నారు. సంజరు ఖాన్ - రేఖ నటించిన ఈ సినిమాను 'దునియాకా మేలా' పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రం ఫ్లాపయింది. 1973లో 'నమక్ హరామ్' చిత్రం కోసం రేఖ- అమితాబ్ మరోసారి కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో రేఖ అమితాబ్ సరసన కాకుండా రాజేష్ ఖన్నాకు జోడీగా నటించింది. అందుకే ఈ సినిమా సమయంలో అమితాబ్- రేఖ మధ్యన పెద్దగా సంభాషణ ఏమీ జరగలేదు. ఇలా అప్పటివరకూ అమితాబ్- రేఖ మధ్య అంతగా పరిచయం పెరగలేదు. 1976లో అమితాబచ్చన్, రేఖ జీవితాలు పెద్ద మలుపు తిరిగాయి. దర్శకుడు దులాల్ గుహ వీళ్లిద్దరిని పెట్టి 'దో అంజానే' సినిమా తీశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమాలో వారి పేర్లు కూడా మొదట అమిత్ - రేఖ అని పెట్టారు. ఈ చిత్రంలో అమితాబ్ సరసన నటించడంపై రేఖ స్పందిస్తూ.. ''అప్పటి వరకూ ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే మేము కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం దొరకలేదు. దో అంజానే సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి పని చేయడానికి కాస్త భయ పడ్డాను. అయితే ఆ సినిమా సమయంలో నేను ఆయన నుంచి చాలా నేర్చుకునే అవకాశం లభించిందని రేఖ ఒక షోలో తెలిపారు. ఆ తర్వాత అమితాబ్-రేఖ కలిసి 14 సినిమాలలో నటించారు. కాగా, వీరిద్దరూ 1980లో చివరిసారి 'సిల్ సిలా' సినిమాలో కలిసి నటించారు. 1976-81 మధ్య విజయ వంతమైన చిత్రాల్లో నటించిన వీరిద్దరిది సినిమాల్లో ఎంత హిట్ పెయిరో... నిజ జీవితంలో వీరి ప్రేమ కథ అంతే ప్రాచుర్యం పొందింది. వాస్తవానికి అమితాబ్-రేఖ లవ్ ట్రాక్ బాహ్య ప్రపంచంలో పూర్తిగా బయట పడకపోయినా.. వీరిద్దరి ప్రేమ గాధ.. అంత త్వరగా మరిచిపోయేది కాదన్నది నిజం. అమితాబ్ - రేఖ రొమాన్స్ వార్తలు 1980 వరకూ చాలా హాట్ హాట్‌గా సాగుతున్న నేపథ్యంలో, అమితాబ్ సిల్సిలా సినిమా తర్వాత రేఖతో మరో సినిమా చేయకూడదనే షరతుపైనే జయా సిల్సిలాలో నటించ డానికి ఒప్పుకున్నారని, దీంతో అమితాబ్, రేఖ ఇద్దరూ కలిసి నటించిన సిల్సిలా చివరి సినిమా అయ్యింది. తర్వాత రేఖ దాదాపు 80 సినిమాలు చేశారు. అటు అమితాబ్ సిల్సిలా తర్వాత దాదాపు 150 సినిమాలు చేశారు. కానీ ఇద్దరూ కలిసి అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు. అంటే సిల్సిలాతో ఆ పరంపరకు తెరపడింది. సిల్సిలా తర్వాత 2015లో వచ్చిన ఆర్.బాల్కి సినిమా షమితాబ్లో అమితాబ్ లీడ్ రోల్ చేస్తే, అందులో రేఖ ఒక చిన్న పాత్ర పోషించారు. అయితే అమితాబ్-రేఖ కలిసి ఒక్క సన్నివేశంలో కూడా కనిపించరు.
సినీ ప్రపంచంలో ప్రేమకథలకు కొదవేలేదు. ఎన్నో జంటలు అందాల తెరపై ప్రేమిస్తూ.. ప్రేమిస్తూ నిజ జీవితంలోనూ ప్రేమబాటలో నడిచారు. కానీ అందులో కొందరే వివాహబంధంతో ఒక్కటయ్యారు. మరికొందరి ప్రేమకథలు కొద్దిదూరం సాగాక.. అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇకపోతే కొందరి ప్రేమగాథలు మూడుముళ్ల వరకూ వెళ్లక పోయినా.. వారి గాథలు అజరామరంగా నిలిచిపోయాయి. అలాంటి అజరామర ప్రేమగాథల్లో ముందుగా చెప్పుకునేది.. రాజ్ కపూర్-నర్గిస్ జోడీ గురించే. ఆ తర్వాత అమితాబ్-రేఖ ప్రేమ గాథ నిలిచింది. ఇవాళ రాజ్ కపూర్-నర్గిస్ లు ఈ లోకంలో సజీవంగా లేకపోయినా.. వీరిద్దరి ప్రేమకథ అమరం, అజరామరం. అచ్చం ఇలాగే అమితాబ్-రేఖల ప్రేమగాధ ఏళ్లు గడిచినా.. కాలం అనే నావలో కొట్టుకుపోకుండా శాశ్వతంగా నిలిచింది.
విఫలమైన వైవాహిక జీవితం
యావత్ భారతాన్ని తనవైపుకు తిప్పుకుని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అందగత్తె రేఖ నట జీవితం దేదీప్యమానంగా వెలిగింది కానీ, వైవాహిక జీవితం మాత్రం విఫలమైంది. రేఖ జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే. ఆమెకు ప్రేమ పెళ్ళిళ్ళు ఆచ్చిరాలేదు. బాలీవుడ్ హీరో వినోద్ మెహ్రాని ప్రేమించింది రేఖ. ఘాడంగా ప్రేమించుకున్న వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత రేఖని తీసుకొని తన ఇంటికి వెళ్ళిన వినోద్ మెహ్రాకు తల్లి నుండి వ్యతిరేకత వ్యక్తమవ్వడమే కాకుండా, ఘోరంగా అవమానించడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక రేఖ ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందట. వినోద్ మెహ్రా ఇంట్లో అంతగా అవమానం జరగడంతో కొన్నాళ్ల తర్వాత తాము ఇక కలిసి ఉండలేమని నిర్దారించుకున్న తర్వాత విడి పోయారట. ఆ తర్వాత 1990లో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ని రేఖ పెళ్లి చేసుకుంది. అయితే అనూహ్యంగా ఏడు నెలల కాపురం చేయకుండానే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో రేఖ నటించిన 'శేష్నాగ్' విడుదలైతే జనం ఆ పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ వాదన ఎవరూ వినలేదు. రేఖను మీడియా ఎప్పుడూ తన దష్టి నుంచే చూసింది. దాంతో రేఖ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.
రేఖ కేవలం నటిగా మాత్రమే కాకుండా గొప్ప మిమిక్రీ ఆర్టిస్టుగా కూడా పేరు సంపాదించుకుంది. యారానా మూవీలో నీతు సింగ్‌కు, 'వారిస్'లో స్మితా పాటిల్ కు, హిందీలో నటించిన దక్షిణాది తారలు శ్రీదేవి, జయసుధ, సౌందర్య వంటి వారికి డబ్బింగ్ చెప్పడం విశేషం. ఫ్యాషన్ అంటే ఇష్టపడేవాళ్లకు ఒక ఐడల్‌గా నిలిచారు రేఖ. ఆసక్తికరమైన విషయమేమంటే, మేకప్ అంటే ఎంతో ఇష్టపడే రేఖ ఆమె స్వయంగా తన మేకప్ తానే వేసుకుంటూ తనకు తానే డిజైన్ చేసుకుంటారు.హిందీ ఫిల్మ్ ఇండిస్టీలోనే ఒక జిమ్‌లో పేరు నమోదుచేసుకున్న తొలి తార రేఖ. హౌటల్ రమీ ఇంటర్నేషనల్‌లోని జిమ్‌లో ఆమె స్విమ్మింగ్, బేసిక్ ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేసేవారు.
రేఖ సినీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికి ఆమె ఇండిస్టీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. తనకి ప్రపంచాన్ని చుట్టేయడం ఇష్టం ఉండడంతో ముందుగా ఎయిర్ హౌస్ట్‌గా విధులు నిర్వహించి ఆ తర్వాత నటిగా ఇండిస్టీలోకి అడుగు పెట్టారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, సంజరు దత్, శత్రుఘ్న సిన్హా లాంటి స్టార్ హీరోలందరి సరసన నటించింది. రేఖ దిలీప్ కుమార్ తో నటించే అవకాశం రాకపోవడంతో ఈమెకు తీరని కోరికగా ఉండిపోయింది. సాధారణంగా సినిమా ఇండిస్టీలో ఇద్దరు హీరోయిన్ల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ రేఖ మాత్రం హేమామలినితో ఎంతో చనువుగా ఉంటూ, మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.
అవార్డులు
రేఖ 1981లో 'ఉమ్రావ్ జాన్' చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచిన రేఖ 2010లో భారత నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా అనేక అవార్డులు అందుకుంది. 2003లో ఫిల్మ్‌ఫేర్ ఆమెను 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు' తో సత్కరించింది. ఆమె ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ రెండు, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్ , స్టార్ స్క్రీన్ అవార్డ్స్ , జీ సినీ అవార్డ్స్ రెండు, స్టార్ డస్ట్ అవార్డ్స్ మూడు, బాలీవుడ్ మూవీ అవార్డ్స్ ను అందుకున్నారు. రేఖ పై 1999లో డీప్, మోహన్ రాసిన ''యురేఖా!: ది ఇంటిమేట్ లైఫ్ స్టోరీ ఆఫ్ రేఖ'' పుస్తకంతోపాటు, 2016 లో యాసర్ ఉస్మాన్ రాసిన ''రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరీ'' అనే జీవిత చరిత్ర పుస్తకాలు వెలువడ్డాయి.
ఇతర అవార్డులు
1977: ఉత్తమ నటిగా ఫిల్మ్ వరల్డ్ అవార్డ్,
1997: లాక్మే టైమ్‌లెస్ బ్యూటీ అవార్డ్,
2004: మహా స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్,
2005: సోనీ గోల్డెన్ గ్లోరీ అవార్డు,
2006: ఐడియా జీ ఎఫ్ అవార్డ్స్ - ఫ్యాషన్ ఫిల్మ్ స్టార్,
2012: బిగ్ స్టార్ ఎటర్నల్ యూత్ స్టార్ అవార్డ్,
2018: లక్స్ గోల్డెన్ రోజ్ లెజెండరీ బ్యూటీ అవార్డ్,
గౌరవాలు
1998: హిందీ చిత్రాలలో ఉత్తమ కథక్ డ్యాన్సర్‌గా లచ్చు మహారాజ్ అవార్డు.
2001: ముంబయి అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ వారిచే సినిమాకి చేసిన కృషికి అవార్డు.
2006: దీనానాథ్ మంగేష్కర్ అవార్డు,
2007: పీక్‌కి ద్వారా వినోద ప్రపంచంలోని లివింగ్ లెజెండ్,
2008: ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వారిచే బాలీవుడ్‌కు చేసిన విశిష్ట సహకారానికి అవార్డు,
2009: భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సహకారానికి మహారాష్ట్ర ప్రభుత్వంచే ''రాజ్ కపూర్ ప్రతిభా గౌరవ్ పురస్కార్'',
2018 కి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు.
-పొన్నం రవిచంద్ర, 9440077499