Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉచ్చూరి కిళాంబి వెంకట నరసింహాచార్యులు?' అంటే 'ఆయన ఎవరు?' అని తిరిగి ప్రశ్నించే వాళ్లంతా ఆచార్య ఆత్రేయ అనగానే ''ఓ అయన ఎందుకు తెలియదు? మన మనసుకవి!'' అంటూ చాలా దగ్గరితనం అనుభవిస్తూ జవాబు చెపుతారు. కొంచెం భాషా పరిజానం వున్నా వారైతే ''మనసు కవి, మన సుకవి'' అని కాస్త చమత్కారం కూడా చేస్తారు. మే నెల 7వ తారీకు ఆచార్య ఆత్రేయ పుట్టినరోజు.
ప్రపంచంలో అన్నిటికీ ఒక రోజంటూ వుంది. చివరకు టాయిలెట్ కు కూడా ఒక రోజు వుంది. కానీ గారడీ చేసే మాట వినని మనసుకి మాత్రం ఒక రోజంటూ లేదు. మనసుకు పుట్టిన రోజు అంటూ ఒక పుట్టిన రోజు చేయాలి అంటే ఆచార్య ఆత్రేయ పుటిన రోజును మించిన రోజు లేదు. తాను రాసిన 1400 కు పైగా పాటలలో మనసును, దాని పరాన్ముఖ కోణాలను వివరించే పాటలు వందకు పైగానే ఉంటాయి. ''మనసు మూగదే కానీ, మాటుంటది దానికి'' అనే ఆత్రేయ, ఆ మాట మౌనమనే భాషలో పలుకుతుంది అంటారు.
1921, మే ఏడవ తేదీన నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట దగ్గర వున్న ఉచ్చూరులో జన్మించిన ఆత్రేయ అసలు పేరు ఉచ్చూరి కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఈ పేర్లో వున్న ఉచ్చూరు ఆయన సొంత వూరు అయితే, కిళాంబి అయన ఇంటి పేరు. ఆత్రేయకి తన తల్లి అంటే చాలా ఇష్టం. ఆమె చనిపోయిన తరువాత తన పేరులో ఉన్న ఇంటి పేరును వదిలేసారు. సినిమా రంగానికి వచ్చాక తన పేరులో వున్నా ఆచార్యకి తమ గోత్రాన్ని ఆత్రేయని కలుపుకుని ఆచార్య ఆత్రేయగా మారారు. ఆత్రేయుడు అంటే చంద్రుడు అని అర్ధం. వెన్నెల లాంటి, అమతం లాంటి పాటలు రాయడానికి వెన్నెల వెనుక వుండే చీకటి లాంటి విషాన్ని తన మనసులో దాచిన చిన్మయ రూపుడు ఆత్రేయ.
ఆత్రేయ చినమామ జగన్నాధా చార్యులు గారు చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పనిచేసేవారు. ఆయన తన పలుకుబడి ఉపయోగించి తిరుత్తణి సెటిల్మెంట్ ఆఫీస్‌లో నెలకు 40 రూపాయల జీతంతో ఒక చిన్న వుద్యోగం ఇప్పిస్తే కొన్నాళ్ళు చేసి దాని మానేశారు. తరువాత జమీన్ రైతులో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేసారు. అప్పుడే 'స్వర్గసీమ' సినిమా విడుదల అయి ప్రభంజనం సష్టించింది. అన్ని పత్రికలూ ఆ సినిమాను ఆకాశానికి ఎత్తి సమీక్షలు చేస్తే ఆత్రేయ ఆ సినిమా బావోలేదని విమర్శించాడట. అలా విమర్శించడని ఆ పత్రిక యజమాని మందలిస్తే కోపం వచ్చి వుద్యోగం మానేశారు. కొంతకాలం నెల్లూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో పనిచేశారు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే నాటకాలంటూ తిరిగేవాడు. స్వయంగా నాటకాలు రాసేవారు. ఆత్రేయ సినిమా కవి కావడానికి ముందు మంచి నాటక రచయత, కవి.
ఆత్రేయ నాటకరంగం లోకి వచ్చే సమయానికి తెలుగు నాటక రంగం ఒక మెటా మార్ఫసిస్ కోసం ఎదురు చూస్తున్నది. పద్య నాటకాలు వెనకబడి, సాంఘిక ఇతివత్తాలు, సామాజిక సమస్యల మీద నాటకాల కోసం ప్రజలు తమకు తెలియకుండానే ఎదురుచూస్తున్న ఒక సంధికాలం అది. ఒక సమూలమైన మార్పును తెలుగు నాటకరంగం ఆశిస్తున్న కలం అది. ఆ సమూలమైన మార్పును ఆత్రేయ తన నాటకాల ద్వారా తీసుకుని వచ్చాడు. అందుకేనేమో చాట్ల శ్రీరాములు లాంటి నాటక నిపుణులు 'ఆధునిక నాటక యుగ కర్త ఆత్రేయ' ని కితాబు ఇచ్చారు.
పరిషత్ కోసం మొట్టమొదటగా 'శాంతి' అని ఒక నాటకం రాశారు ఆత్రేయ. పరిషత్‌లలో తగిన గుర్తింపు రాలేదన్న కారణంగా తాను ఎంతో ఇష్టంగా రాసిన 'శాంతి'ని చింపి పోగులు పెట్టేశారు. ఆ తరువాత రాసిన డాక్టర్ కోట్నిస్, సాధన కూడా ఇప్పుడు లభ్యం కావడం లేదు. అలా ఆత్రేయ రాసిన మొత్తం 13 నాటకాలలో మూడు నాటకాలు పోగా పది నాటకాలు మనస్వినీ ఫౌండేషన్ వాళ్ళు చారిత్రక నాటకాలు, సాంఘికనాటకాలుగా సంపుటీకరించారు. ఆత్రేయ రాసిన మొత్తం 23 నాటకాలలో 8 నాటకాలు అలభ్యం కాగా 15 నాటకాలు మాత్రం మనస్వినీ ఫౌండేషన్ వాళ్ళు ఆత్రేయ సమగ్ర సాహితిలో భాగంగా ప్రచురించారు
రాహుల్ సాంకత్యాయన్ రాసిన 'ఓల్గా తో గంగా'లోని పదకొండవ భాగం ప్రభ ఆధారంగా ఆకాశవాణి కోసం అశ్వఘోషుడు అనే నాటిక రాసారు. ఈకాలంలోనే కాదు ఆ కాలంలో కూడా మతం మనుషులను ఎలా విడదీస్తుందో ఈ నాటికలో ఆత్రేయ దశ్యమానం చేస్తారు. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిన అశ్వఘోషుడు ప్రధాన పాత్రగా ఈ కథ నాటిక నడుస్తుంది. దత్తమిత్రుడు అనే గ్రీక్ వర్తకుని కూతురు అయిన ప్రభను ప్రేమించిన అశ్వఘోషుడు పెద్దలు, ప్రభ హిందూ మతానికి చెందిన స్త్రీ కాదని అడ్డు చెప్పడం కారణంగా ఆమెను పెళ్లి చేసుకోలేక పోతాడు. ప్రభ సరయు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. రామాయణంలోని ఋష్యశంగుడు వత్తాంతం ఆధారంగా రాసిన నాటిక మాయ. మానవ కల్యాణానికి ఉపయోగపడని ఎంత గొప్ప ప్రతిభ అయినా, తపస్సు అయినా వ్యర్థం అని ఈ నాటిక చెపుతుంది. ఈ రెండూ చారిత్రక నాటకాలు.
ఇక సాంఘిక నాటకాలలో అందరికీ బాగా తెలిసినవి, అందరూ చెప్పేవి 'కప్పలు, ఎన్.జి.ఓ, విశ్వ శాంతి'. ఆత్రేయ సాహిత్యం మీద పరిశోధన చేసిన పైడిపాల మాటలలో చెప్పాలంటే ఎన్.జి.ఓ అచ్చమైన ఆధునిక ఆంద్ర నాటకానికి తొలిరూపం. అంతకు ముందు రాసి ప్రదర్శించిన పరివర్తన, ఈనాడు నాటకాల అనుభవంతో రంగస్థల స్వరూపాన్ని, స్వభావాన్ని అర్ధం చేసుకుని రాసిన నాటకం ఎన్.జి.ఓ. ఇది తెలుగు నాట ఒక సంచలనాన్నే సష్టించింది.
రాజకీయ నినాదాలతో నాటకాన్ని రక్తి కట్టించుకుంటాడు అని తన మీద వచ్చిన ఆరోపణలను కప్పలు నాటకం రాసి తొలగించుకున్నాడు. అయితే ఈ నాటకానికి జె.బి ప్రీస్ట్లీ లేబర్న్ గ్రోవ్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది అంటారు. యుద్ధం ఒక రాచపుండు. యుద్ధ విధ్వంసంతో తల్లడిల్లుతున్న ఈ ప్రపంచానికి శాంతి మాత్రమే స్వాంతన చేకూర్చగలదన్న కధాంశంతో రాసిన నాటకం విశ్వశాంతి. నిజానికి ఇదొక ప్రయోగం. నాటకం అంతా సంకేతాలతోనే నడుస్తుంది. భూదేవి, శాంతి, సమత ఆ సంకేతాలు. ఈ ప్రయోగాత్మక నాటకానికి రావలసినంత పేరు కానీ, ప్రాభవం కానీ రాలేదు. ఈ నాటకానికి ముందుమాట రాసిన మహాకవి శ్రీశ్రీ ''నాటక రంగమనే వైద్యశాలలో జరుగుతున్న ఒక శస్త్ర చికిత్స ఈ విశ్వశాంతి'' అన్నారు
ఆత్రేయ ఇలా నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ, చిరుద్యోగాలు చేస్తున్న కాలంలోనే నెల్లూరులోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకం వేయడంలో తర్ఫీదు ఇచ్చేవారు. ఆ నాటకం లో పాల్గొంటున్న ధనవంతులైన రెడ్ల పిల్లలు కార్లలోనూ, గుర్రపు బగ్గీలలోనూ రావడం చూసిన ఆత్రేయ అలవోకగా ''కారులో షికారు కెళ్లే'' పాట అనుకున్నారట. ఆ తరువాత సినిమా రంగంలోకి వచ్చిన తరువాత ఆ పాటను 'సంసారం' సినిమా కోసం అనుకున్నారు. చివరకు అది 'తోడికోడళ్ళు' సినిమాలో కుదురుకుని ఆత్రేయను శ్రీశ్రీ గా మార్చేసింది.
ఆత్రేయ నాటకాలు చూసిన విజయా అధినేతలు తాము కొత్తగా తీస్తున్న 'షావుకారు' సినిమాకు మాటలు రాయడానికి ఆహ్వానించారు. కానీ ఎందుకో ఆ సినిమా నుండి ఆత్రేయ తప్పుకున్నారు. ఆ తరువాత 'సంసారం' సినిమా ద్వారా ఆత్రేయ సినిమా రంగ ప్రవేశానికి అంతా సిద్ధం అయి చివరి నిమిషంలో తలకిందులయింది. ఆ తరువాత తన మానాన తను నాటకాలు ఆడుకుంటూ ఉంటే కోవెలమూడి సూర్య ప్రకాశరావు 'దీక్ష' సినిమాకు పాటలు రాయడానికి ఆత్రేయను పిలిచారు. నిజానికి ఆత్రేయ సంభాషణల రచయత కావాలి అనుకున్నారు. నాటకాలు రాయడంలో అనుభవం, సినిమా రచనకి పనికి వస్తుందనుకున్నారు. కానీ సూర్య ప్రకాశ రావు ''నువ్వు పాటలు రాయగలవు. నీ నాటకంలో సంభాషణలు రాసినంత సులువుగా, తేలికగా పాటలు రాయగలవు'' అని పట్టుపట్టారు. అలా 1951లో వచ్చిన 'దీక్ష' సినిమాలోని ''పోరా బాబూ పో'' అన్న పాటతో సినీ గీత రచయితగా తెరమీదకు వచ్చిన ఆత్రేయ ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు. 1990లో వచ్చిన 'ప్రేమ యుద్ధం' సినిమాలో ''ఈ మువ్వల గానం మన ప్రేమకు ప్రాణం'' అనే చివరి పాట దాకా ఆయనది అప్రతిహతమైన ప్రయాణం.
రాసి ప్రేక్షకులను, రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తారని పేరుపొందిన ఆత్రేయ, పాట రాయడానికి తానెంత ఏడుస్తానో ఎవరికీ తెలియదు అంటారు. అలతి అలతి పదాలతో, ఎలాంటి క్లిష్టమైన పదాలూ లేకుండా హాయిగా రాయడం ఆత్రేయ పద్ధతి. అయితే అలా సింపుల్‌గా రాయడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఒక్కొక్కసారి వాక్యం తెగక గిలగిలా కొట్టుకునేవాడు. రోజులు అలా గడచి పోతూ ఉంటాయి.
చిలక పలకదు. రాయలేకపోయిన తన అశక్తతని నవ్వు మాటున, చమత్కారం మాటున దాచేసేవాడు. ఒకసారి ఒక నిర్మాత పాటలు రాయడానికి ఆత్రేయకి ఒక కాస్ట్లీ హోటల్లో ఒక రూమ్ బుక్ చేశాడు. రెండు నెలలు అయింది చిలక పలకలేదు. ఆ నిర్మాతకి విసుగొచ్చి హోటల్ రూమ్ ఖాళీ చేయించాడు. రూమ్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆత్రేయ తలెత్తి చూస్తే హౌటల్ చోళ అని కనిపించింది. అప్పుడు ఆత్రేయ ''తప్పు అక్కడ జరిగింది బాబూ! మీరేమో చోళ హోటల్లో రూమ్ బుక్ చేశారు. మరి పల్లవి రమ్మంటే ఎలా వస్తుంది?'' అన్నాడట. ఆ నిర్మాత నెత్తీ నోరు కొట్టుకుని హోటల్ పల్లవి లో రూమ్ బుక్ చేస్తే అర్ధగంటలో పాటంతా రాసి ఇచ్చేశాడట.
మరొక నిర్మాత ఆత్రేయ పాటతో కొబ్బరికాయ కొట్టాలి అనుకున్నాడు. రెండు నెలలు ముందు చెప్పాడు. చివరకు రేపు ముహూర్తం అనగా కూడా ఆత్రేయ పాట రాయలేదు. చివరకా నిర్మాత వేటూరి దగ్గరకు వెళ్లి ''మీరే ఈ గండం గట్టెకించాలి!'' అంటే, వేటూరి... ''మీ సినిమాలో ఈ ఒక్క పాట మాత్రమే రాస్తాను. ఈ పాటకి నా పేరు వేయవద్దు. ఈ పాటకి నాకివ్వాలి అనుకున్న డబ్బు ఆత్రేయకే ఇవ్వాలి'' అని షరతులు పెట్టి పాట రాసి ఇచ్చేశాడట. ఆ సాయంత్రం ఆత్రేయ వేటూరి ఇంటికి ఫోన్ చేసి ''మీ అయన నా పరువు కాపాడాడమ్మా!'' అని వేటూరి భార్యకి చెప్పాడట. ఈ ఉదంతాన్ని వేటూరి తన 'కొమ్మ కొమ్మకో సన్నాయి' లో రికార్డ్ చేశారు.
ఆత్రేయ మనసు పాటలు రాయడం లో సిద్ధహస్తుడు అన్న విషయం తెలిసిందే. దాని వెనుక వున్నా రహస్యమేమిటో అని మదనపడవలసిన అవసరం లేదు. ఆత్రేయ జీవితంలో ముగ్గురు పద్మావతులు వున్నారు. ఒకరు తాను ప్రేమించిన పద్మావతి. మరొకరు తాను పెళ్లి చేసుకున్న పద్మావతి. ఇంకొకరు తనకు సేవ చేసిన పద్మావతి. తాను ప్రేమించిన పద్మావతి గురించే ఆయన పద్య రూపంలో రాసుకున్న ఆత్మకథలోని 'తొలి గాయం' అనే శీర్షికన బాణమనే ప్రియురాలిని సగోత్రం కారణంగా పెళ్లి చేసుకోలేక పోయాను అని రాసుకున్నది. ఆమెదీ ఆత్రేయదీ ఒకే గోత్రం కావడంతో తండ్రి ఒప్పుకోక పోవడంతో పెళ్లి చేసుకోవడం మానేశారు. ఆ తరువాత ఇలాంటి సన్నివేశాన్ని ఆత్రేయ రాసిన అశ్వఘోషుడు అనే నాటికలో చిత్రించాడు. ఇక రెండవ పద్మావతి పెళ్లి చేసుకున్న పద్మావతి. ఈ పద్మావతి అంటే ఆత్రేయకి ప్రత్యేకమైన కోపం లాంటిదేదీ లేదు. ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. కానీ మనసు సరిపుచ్చుకోలేదు. ఇక మూడవ పద్మావతి నెల్లూరులో టైఫాయిడ్ జ్వరంతో ఆయన హాస్పిటల్ పాలైనప్పుడు వ్యక్తిగత శ్రద్ధతో ఆయనకు సేవ చేసిన సిస్టర్ పద్మావతి. ఈ సిస్టర్ పద్మావతి అకాల మరణం ఆత్రేయను కంగదీసింది కూడా. బాణం వీణ వాయించడంలో నేర్పరట. వీణ పాటలు ఆత్రేయ రాస్తే అందులోకి పద్మావతి జ్ఞాపకాలు వచ్చి చేరాయేమో!
''వీణలోనా తీగలోనా ఎక్కడ వున్నది అపశ్రుతి?'' అని ఆ దేవుడే దిగివచ్చి అడిగినా ఆత్రేయ జవాబు చెప్పలేడు. ఆయన జీవితంలోని ముగ్గురు పద్మావతులూ జవాబు చెప్పలేరు. అందుకేనేమో ఆత్రేయ ''మనసు మూగది. మాటలు రానిది. మమత ఒక్కటే అది నేర్చినది'' అని అన్నది.
అంతేనా? కాదు, ''మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష'' అని కూడా అన్నాడు.
2
అప్పుడెప్పుడో ఒక ఆంగ్ల కవి యవ్వనాన్ని వసంతం తోనూ, వద్దాప్యాన్ని శిశిరంతోనూ పోల్చాడు. నిండు గ్రీష్మం అంటే పొగలు సెగలు కక్కే విరహాగ్ని జ్వాలలతో సమానం. ఆరు రుతువులలో దేని పరిమళం దానిదే అయినా వసంతమాసం ప్రత్యేకత వేరు. మన తెలుగు శ్రీశ్రీ ఋతువుల రాణి వసంత మాసం మంత్రం కవాటం తెరిచింది అని వసంతాన్ని బాల్యంతో పోల్చాడు. ఎవరు వసంత మాసాన్ని మనిషి జీవితంలోని ఏ దశతో పోల్చినా వసంతము, యవ్వనమూ రెండు మానవ జీవన ప్రకతిలో అజరామరమైన అద్భుత విషయాలే. యవ్వనానికి తొలి గేట్ వే పదహారేళ్ళ వయసు. పదహారేళ్ళ వయసు ఒక కత్యాద్యవస్థ. బాల్యావస్థ దాటి నూతన యవ్వనంలోకి అడుగుడుతున్న యువతీ యువకులకు ఆ కత్యాద్యవస్థ అంతా ఒక సమ్మోహన ప్రపంచంలా ఉంటుంది. చూపు ఒక చోట నిలవదు. కాలు ఒక చోట ఆనదు. హదయం పరిపరి విధాలా పరుగులు తీస్తుంది. తనదయిన ఒక మనిషి కోసం అది అన్వేషిస్తూ ఉంటుంది. రెక్కలు విప్పుకుని విహాయసంలో ఎన్నెన్ని వింతలనో తన అనుభవంలోకి తీసుకుంటుంది. ఒక్కసారి ఎదురుచూస్తున్న హదయం జాడ తెలిసిందా? అది చాలు. ఇరు హదయాలు తమదైన ఒక కొత్త లోకం సష్టించుకుంటాయి. ఆ లోకంలో వాళ్ళిద్దరికీ తప్పిస్తే మరొకరికి చోటుండదు. ఆ లోకంలో కనిపించే చెట్టులోనూ, పుట్టలోనూ, ఎగిరే గువ్వలోనూ, మోగే మువ్వలోనూ ఒకరికి మరొకరి రూపమే కనిపిస్తుంది. ఈ పదహారేళ్ళ వయసు చేసే గారడీని ఆచార్య ఆత్రేయ బాలచందర్ 'మరోచరిత్ర' కోసం హద్యంగా రచించాడు.
''పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్లకు కోటి దండాలు''
వెల్లువ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు. వెల్లువ వచ్చినట్టే పదహారేళ్ళ వయసు కూడా అలాగే వస్తుందట. వచ్చిన వయసు వెన్నెలలా విరబూస్తుందట. వెన్నెలలా విరబూసే, వెల్లువలై పోయే పదహారేళ్ళ వయసుకు ఒకటి రెండు కాదు కోటి దండాలు అనడంలో ఆత్రేయ చిలిపిదనం ముచ్చట గొలుపుతుంది.
''భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వేళలకు
నిన్ను నన్ను కన్న వాళ్లకు (2)
మనకై వేచే ముందు నాళ్లకు
కోటి దండాలు శత కోటి దండాలు''
ఆ చివరి వాక్యంలో ఆత్రేయ మాస్టర్ స్ట్రోక్ ఉంది. ''నిన్ను, నన్ను కన్నవాళ్లకు కోటి దండాలు శత కోటి దండాలు'' అంటున్నాడు. ఆ తల్లితండ్రులే లేకుంటే ఈ అపురూపమైన యవ్వనం పోత పోసుకున్న పుత్తడి బొమ్మ తనకు దొరికేదా? ఆ అపురూపమైన తొలి యౌవనాదుర్భావ ప్రేమానుభవం తనకు దొరికేదా?
ఈ అద్వితీయమైన, ఈ అజరామరమైన అనుభూతి మనసు ముంగిళ్ళలో రంగవల్లికలు తీర్చి దిద్దేదా? అందుకే నిన్నూ నన్ను కన్న వాళ్లకు కోటి దండాలు అంటున్నాడు. అంతటితో ఆగక మనకై వేచే ముందు నాళ్లకు కూడా కోటి దండాలు అంటున్నాడు. తమ ప్రేమ ముందు తరాలకి ఆదర్శం, అసలు తమ ప్రేమతోనే ప్రేమ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుందని ప్రతి జంటా అనుకుంటుందట. అందుకే కోటి దండాలు శత కోటి దండాలు. అదీ ఆత్రేయ.
ఆత్రేయ ఈ ఒక్క పాటనే కాదు, ఏ పాటనైయినా ఇంతే తమకంతో, ఇంతే శ్రద్ధతో రాస్తాడు. అది మంచి పాటా, చెడ్డ పాటా అన్న వివక్ష ఆయనకు లేదు. ఏ పాటైనా ఎవరిదో ఒకరి హదయాన్ని కదిలించక మానదు.
''ఎట్టాగో ఉన్నాదో ఓలమ్మీ! ఏటేటో అవుతుందే చిన్నమ్మీ'' పాటకూడా అంతే తమకంతో రాసి బూత్రేయ అనే పేరును కూడా ఆనందంగా స్వీకరించాడు.
ఆత్రేయకి బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'తొలికోడి కూసింది' సినిమాలో రాసిన ''అందమైన లోకమనీ రంగురంగులుంటాయనీ'' అనే పాటకు నంది అవార్డు అందుకున్నారు.
ఆ పాటలోనే ఆయన ''గడ్డి తిని ఆవు పాలిస్తుంది
ఆ పాలు తాగి మనిషి విషమవుతాడు
అది గడ్డి గొప్పతనమా, పాల దోష గుణమా?'' అని ప్రశ్నిస్తాడు.
3
నేనింకా ఒక ఆఖరి నాటకం రాయవలసి వుంది అని ఎప్పుడూ చెప్పే ఆత్రేయ 'ఎర్రమల్లెలు' అనే పేరుతో ఒక నాటకాన్ని ప్రారంభించి, దాన్ని రాయలేక పూర్తి చేయమని గణేష్ పాత్రోను కోరారు. పాత్రో కూడా ఆ నాటకాన్ని పూర్తి చేయలేదు. నాటకాన్ని ప్రేమించిన మనం సినిమాను పెళ్లాడాం. నాటకాన్ని మరువలేం. సినిమాను విడవలేం. మన బతుకులు ఇంతే అని గణేష్ పాత్రోతో అన్నారు. నాటకరంగంలో తాను రాయవలసిన నాటకం రాయకుండానే అసంతప్తితో పెన్ను మూసిన ఆత్రేయకి, పధ్నాలుగు వందల పాటలు రాసిన ఆత్రేయకి ఏ పాటైనా సంతప్తిని ఇచ్చిందా?
కష్ణ, శారద నటించిన 'ఇంద్రధనుస్సు' సినిమాలోని ఆ ఒక్క పాటంటే ఇష్టం ఆత్రేయకి.
''నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమ వాసివి'' అన్నదే ఆ పాట.
ఆ పాటలోని ''తలుపు మూసినా, తల వాకిటనే పగలూ రేయీ నించున్న
పిలచి పిలచి బదులే రాక అలసి తిరిగి వెడుతున్నా
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు
నను వలచానని తెలిసేలోగా నివురై పోతాను''
అన్న వాక్యాలు అంటే మరీ ఇష్టం. మనసు అనే మధు కలశాన్ని చేయి జార్చుకున్న ఆచార్య ఆత్రేయ
చలన చిత్ర నిర్మాతలు సంతసిల్ల
సురకవి వరుండిది విని యచ్చెరువు పొంద
గురువు మల్లాది, శ్రీశ్రీయు సరసనుండ
తరలె నాత్రేయ పరమపదమ్ము చేర!
అని తన నిష్క్రమణని అందమైన తేట గీతిలో రాసుకున్న ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13 న నివురై పోయాడు
(ఇవాళ ఆత్రేయ పుట్టిన రోజు. ఒక మనసు పుట్టిన రోజు)
- వంశీకృష్ణ, 9573427422