Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం.. పరపీడన పరాయణత్వం' అని శ్రీశ్రీ చెప్పినట్టుగానే మన దేశమూ ఉంది. ఎందుకంటే బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి దేశం విముక్తయి స్వాతంత్య్రం సిద్ధించి, రాజ్యాంగం అవతరించి ఏడు దశాబ్దాలు దాటినా ఆ స్ఫూర్తిని విస్మరిస్తూనే ఉన్నారు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించిన భారత రాజ్యాంగం అంటే ఓ పుస్తకం మాత్రమే కాదు. అది దేశానికి మార్గదర్శి.. దిక్సూచి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కాదు అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం కర్తవ్యం. కానీ నేటి పరిస్థితి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందని మాత్రం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా రాజ్యాంగ ఆశయాలను సంపూర్ణంగా సాధించలేక పోవడమే కాదు నేటికీ దాని అమలులో అనేక అవరోధాలు చుట్టూ ముడుతూనే ఉన్నాయి. ఇంకా సామాజిక అంతరాలు తొలగిపోలేదు. ఆకలి మరణాలు ఆగలేదు. నేటికీ ఆహార భద్రత ప్రశ్నార్థకమే అయింది.ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక దోపిడీ పెరుగుతూనే ఉన్నాయి. ఇలా రాజ్యాంగ స్ఫూర్తికి హాని కలిగించే పరిణామాలు మన దేశంలో ఈ 72 ఏండ్లలో ఎన్నో ఉన్నాయి. ప్రజాస్వామ్యబధ్ధంగా ఎన్నికైనవారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ దాని స్ఫూర్తిని, సార్వభౌమత్వాన్ని కాపాడినప్పుడే రాజ్యాంగానికి విలువ. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఆదివారం అనుబంధం 'సోపతి' అందిస్తున్న కవర్ స్టోరీ..
ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యున్నత చట్టం అంటూ ఏదైనా ఉంది అంటే అది రాజ్యాంగం. దాని ద్వారానే ప్రభుత్వంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు అధికారాలు సంక్రమిస్తాయి. ఈ ప్రభుత్వాంగాల మధ్య సంబంధాలను అధికారాలను నిర్వచించి, నిర్ధారించేది కూడా ఇదే. చాలా దేశాల్లో ఇది మౌఖికంగానూ, అలిఖితంగానూ కొనసాగుతోంది. మరికొన్ని దేశాల్లోనైతే కేవలం ఆచారాలు, సంప్రదాయాలు ఆధారంగానే నడుస్తోంది. బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడాక వారు అమలు చేసిన చట్టాలను పక్కన పెట్టి మన దేశానికి అనువైన రాజ్యాంగాన్ని రూపొందించాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. విభిన్న దేశాల రాజ్యాంగాలను కూలంకషంగా పరిశీలించి మన వ్యవస్థ కు, పాలనకు అనుకూలించే అనేక మంచి అంశాల మేలు కలయికతో ప్రపంచం లోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించాడు. ప్రజాబాహుళ్యం, భారత రాజ్యాంగ నిర్ణయ సభ సుదీర్ఘ చర్చల అనంతరం రాజ్యాంగాన్ని సాధికార శాసనంగా 1949 నవంబర్ 26న ఆమో దించింది. ఆ తర్వాత 1950 జనవరి 26న దానిని ప్రజలకు అంకితం చేసి గణతంత్రంగా ప్రకటించింది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలకులు రాజ్యాంగ సవరణల ద్వారా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే 42వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 'సామ్యవాద, లౌకిక, గణతంత్ర' అనే పదాలనూ చేర్చారు. కానీ అమలు చేయడంలో వెనుకబడే ఉన్నారు.
ఓటు హక్కు దుర్వినియోగం
ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్యపాత్ర పోషిస్తుంది.స్తీ, పురుషులందరికీ కుల, మత, వర్గ, లింగ, జాతి బేధాలు లేకుండా సార్వజనీన ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధికారం కొనసాగుతుందని విశ్వసిం చారు. కానీ వాస్తవంలో నేడు ఓటుకు నోటు అనేది ప్రబ లంగా పేరుకు పోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఓట్లను కొనగలిగే ధనవంతులే నేడు ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూ తాము ఖర్చు చేసిన సొమ్ముకు ఎన్నో రెట్లు తిరిగి సంపాదించు కుంటున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేసి ఎన్నిక కాబడిన ప్రతినిధులు వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తప్ప బూర్జువా పార్టీల్లో మచ్చుకు కూడా కనబడని పరిస్ధితి సంతరించుకుంది. విద్యావంతులైన యువత ఓటు ప్రాధాన్యత తెలిసినప్పటికీ కూడా ఓటింగ్‌లో పాల్గొనడంలో శ్రద్ధ చూపడం లేదు.దీనివలన ఎన్నికల ఫలితాలు తారుమారు కావడం బాధాకరం.మన ఒక్క ఓటు వేయక పోవడం వలన వచ్చే నష్టమేమీ లేదనుకుంటున్న వారు అధికులు కావడంతో ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలు సరైన ప్రజాభిప్రా యాన్ని ప్రతిబింబించడం లేదు.ప్రభుత్వాలు కూడా ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టడం లేదు. స్వతంత్ర ప్రతిపత్తి అయిన ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల్లో జరిగే అక్రమాలు విషయంలో చూసీ చూడనట్లు పోవడం వలన ప్రజాభిప్రాయానికి అనుగుణమైన ప్రభుత్వాలు ఏర్పడటం లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
హక్కులకు, ఆదేశిక సూత్రాలకు తూట్లు
అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని హక్కులకు పాలకులు దశాబ్దాల కాలం నుంచి తూట్లు పొడుస్తూ వస్తున్నారు. ఏడు దశాబ్దాల గణతంత్రంలో పాల కులు తమ స్వభావాన్ని మార్చుకోకుండా ప్రాథమిక హక్కులు, సమానత, స్వేచ్ఛ, వనరుల పంపకం, తదితర అనేక అంశాలకు తిలోదకాలిస్తూ రాజ్యాంగ బద్ధమైన హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్నారు. నల్లచట్టాలు, విదేశీ పెట్టుబడుల ఆధిపత్యం, అణగా రిన వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశం లేకపోవడం కుల, మత వివక్ష, అణచివేత, విచ్చల విడి రక్తపాతం, ఎమర్జెన్సీ లాంటి చీకటి కాలాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. భారత ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన ప్రమాణాలు పెంపొందిం చడానికి రాజ్యాంగంలో నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకూ ఉన్న నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. వీటిలో సంపద సమాన పంపిణీ ప్రధానమైనది. అయితే ప్రస్తుత సమాజంలో సంపద కేంద్రీకరణ తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. సంపద కార్పొరేట్ వర్గాల వారి చెంతనే పేరుకుపోతూ ఉంది. ప్రభుత్వాలు కూడా వారికే ప్రత్యేక ప్రయోజనాలు, రాయితీలు కల్పిస్తున్నాయి.నిరపేక్ష పేదరికం తీవ్ర స్ధాయికి చేరుకుంటుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్ని ఏండ్లు గడిచినా ఇంకా ఆకలి కేకలు ఆగలేదు. ఆకలి సూచీలో మనం ఇంకా అట్టడుగు స్ధానంలోనే ఉన్నాం. స్త్రీ పురుషులు మధ్య వివక్షత పోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగం పేర్కొన్న 'సమాన పనికి సమాన వేతనం' సూత్రం సమీపకాలంలో సాకారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మద్యపాన నిషేధం అనేది ఒక కలగానే మిగిలింది. ప్రభుత్వాలు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి నేడు మద్యంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కార్మిక సంక్షేమం విషయంలో అందమైన చట్టాలు చేసినప్పటికీ ఆచరణలో మాత్రం మృగ్యమయ్యాయనే చెప్పవచ్చు. ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేని కోట్లాది మంది శ్రమజీవుల సంక్షేమం గురించి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ అంతంత మాత్రమే. కార్పొరేట్ వర్గాల భారీ పరిశ్రమల స్ధాపనకు ప్రోత్సాహకాలు కల్పించడం తప్ప, కుటీర పరిశ్రమల స్థాపనకు చూపుతున్న శ్రద్ధ నామ మాత్రమే.అదేశిక సూత్రాలలో మిగిలిన విషయాలపై ఏ మాత్రం శ్రద్ధ కనపరచక పోయినప్పటికీ అదేశిక సూత్రాలలో అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశమైన ఉమ్మడి పౌరస్మృతి అమలు పరచే విషయంలో మాత్రం ప్రస్తుత ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతూ ఉంది.అందరినీ సమానంగా చూసే విషయంలో శ్రద్ధ చూపకపోయినప్పటికీ దేశంలో అందరికీ ఒకే చట్టం అమల్లోకి తీసుకు వచ్చే ఉమ్మడి పౌర స్మృతి విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపుతుందనేది ప్రజలకు తెలియంది కాదు. అన్యాయాలు, దోపిడీల నుంచి రక్షణ కల్పించాలి అనే సూత్రం నేటికి కూడా ఫలవంతం కాలేదని మనకు నిత్యం జరుగుతున్న ఘటనలు తెలియచేస్తున్నాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛ ఏది?
భావ వ్యక్తీకరణ మానవులకు మాత్రమే ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచ్చు.భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల అధ్యాయంలో అధికరణ 19(1ఎ)లో పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. ప్రతి పౌరుడూ తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. మాటలు, రచనలు, ఇతర ప్రసార మాధ్య మాల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియ జేయవచ్చు. .ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు ప్రశ్నించాలి.ఎక్కడ నిర్మాణాత్మక ప్రతిపక్ష - అధికారపక్ష సమ్మేళనం ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యానికీ, ప్రజలకూ, సమాఖ్య వ్యవస్థకూ ఎంతో మేలు జరుగుతుంది.కానీ నేడు రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ ప్రతి పక్షాలను, ప్రజా సంఘాలను ఏ విధంగా అణచి వేస్తున్నారు అనేది చూస్తూనే ఉన్నాం. ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ ప్రచురించిన ప్రజాస్వామ్య సూచీలో భారత్ 53వ స్థానానికి పడిపోయింది. 2014లో 27వ స్థానంలో వున్న భారత్‌లో, ఈ ఏడేళ్ల కాలంలో ప్రజాస్వామ్యం సగానికి సగం పడిపోవడం ఆందోళనాకరం. దేశంలో ప్రజల ఆందోళనకు బలమైన స్వరాన్ని ఇచ్చే నాయకులు, పార్టీలు, ప్రజలు, మేధావులు, ప్రతిపక్షాలు, ప్రజా పక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యమే నిర్వీర్యమయ్యే ప్రమాదం ఎల్లపుడూ పొంచి ఉంటుంది. ప్రజల కోసం, ఎల్లప్పుడూ ప్రశ్నించే మేధావులు, ప్రజా పక్షాలు, ప్రతిపక్షాలు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో న్యాయ స్ధానాలు ద్వారా పలుమార్లు వీటిని కాపాడుకోగలిగారు. అయినప్పటికీ ఈనాడు ప్రభుత్వాలు బ్రిటీష్ కాలం నాటి రాజ ద్రోహం వంటి చట్టాలను ఉపయోగించి ప్రజల భావప్రకటన స్వేచ్ఛను అరికట్టాలని ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలేవి?
సమాఖ్య విధానంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలనేవి అతి ప్రధానమైనవిగా చెప్పవచ్చు. మన రాజ్యాంగపు మౌలిక లక్షణాలలో ఫెడరలిజం ఒకటిగా రాజ్యాంగ నిపుణులు పేర్కొంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యత కల్పించే క్రమంలోనే హక్కులు, బాధ్యతలను రాజ్యాంగంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా విభజించి స్పష్టంగా పేర్కొన్నారు. కాలగమనంలో రాష్ట్రాల పరిధిలో ఉండే అంశాలలోకి చొరబడడానికి కేంద్రం నిరంతరం ప్రయత్నిస్తూనే వుంది. అయితే ఈ ధోరణి ప్రస్తుతం మరింత జోరందుకుందనే చెప్పవచ్చు. అప్రకటితంగానే ఈ దేశాన్ని ఒక కేంద్రీకృత పాలనా వ్యవస్థ కిందకు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే కేంద్రం ఏ మాత్రం అవకాశం దక్కినా రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అనే విభజనను ఆధారంగా చేసుకుని రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడుతోందనే విమర్శలు పెరిగిపోయాయి. ఈ మధ్య మన దేశంలో కేంద్రం ఉమ్మడి జాబితా ఆధారంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, లేబర్కోడ్లు, విద్యుత్ సంస్కరణ బిల్లులు, నూతన విద్యా విధానం ఇటువంటివి గానే చెప్పవచ్చు. ఇటువంటి ఘటనలు రాష్ట్రాల హక్కులకు భంగ పరుస్తున్నాయి. మనదేశం సమాఖ్య దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ధోరణితో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే ఆకాంక్షతో దీన్ని అమలు చేయాలి. కానీ గత కొంత కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు కాకుండా వేరే రాజకీయ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి పెరిగి అది రాజ్యాంగ స్ఫూర్తి అయిన సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. అదే సమయంలో అధికారంలో లేని రాజకీయ పక్షాలు ఈ సమాఖ్య స్ఫూర్తి గురించి ఘనంగా ఉపన్యాసాలు ఇస్తూ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవటం సర్వ సాధారణం. ఈ విధమైన ధోరణి నేడు మన దేశంలో ఒక విషవలయంగా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
చట్టసభల తీరు
రాజ్యాంగ ఆశయాలు ప్రజల ఆకాంక్షల మేరకు విస్తృత చర్చలు జరిపి మెజారిటీ సభ్యుల అంగీకారం మేరకు నూతన చట్టాలు లేదా ప్రస్తుతం నెలకొని ఉన్న చట్టాలకు సవరణలు చేసే వేదికలే చట్ట సభలు. స్వాతంత్య్రం అనంతరం తొలినాళ్లలో మన చట్ట సభల్లో హేతుబద్ద చర్చలు జరిగేవి. కానీ నేడు అవి పనిచేసే తీరు చూస్తే చాలా బాధాకరం అనిపించక మానదు .కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేయబడిన చట్ట సభల సమావేశాలలో అమూల్యమైన సమయాన్ని వధా చేయడం నేడు చాలా సామాన్య విషయంగా మారిపోయింది. సభలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికార పక్షాలు ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ సభా సమయాన్ని వ్యక్తిగత దూషణలకు పరిమితం చేస్తూ మమ అనిపిస్తున్న నేటి సభలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం పూర్తి కలిగిస్తున్నాయి. అంతే కాదు ఒక పార్టీ గుర్తుమీద ఎన్నికైన సభ్యులు మరో పార్టీలోకి ఫిరాయించినపుడు వారి చట్టసభ సభ్యత్వం రద్దవుతుందని నూతన చట్టానికి శ్రీకారం చుట్టారు. అయితే అదే సమయంలో ఈ అధికారాన్ని సభాపతికి కట్టబెట్టి చట్టంలో లొసుగులు ఆధారంగా యథావిధిగా ఫిరాయింపులు చేసిన వారికి అమాత్య పదవులు కట్టబెట్టడం షరా మామూలుగానే ఉంది. సభాపతి అంటే అత్యున్నత రాజ్యాంగ బద్ధ పదవి. కానీ, ఈనాడు కొందరు సభాపతులు సభను నడిపే విషయంలో చూపుతున్న వివక్షతలు వ్యవహరించే తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీవ్ర అవరోధంగా కనిపిస్తూ ఉంది.
356 అధికరణ, గవర్నర్ల పాత్ర..
రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, లేదా కేంద్ర పాలన విధింపునకు అవకాశం ఇచ్చే అధికరణ 356. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలోనే కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని తొలిసారి రద్దు చేయడం దగ్గర నుంచి ఈ అధికరణ వివాదాస్పదమే. దీని కోసం రాజ్యంగబద్ధ పదవి అయిన గవర్నర్లను లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం అనేది రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. దీనికి ఏ రాజకీయ పక్షం కూడా మినహాయింపు కాదు. ఆరంభంలో రాజ్యాంగ లక్ష్యం ప్రకారం గవర్నర్లుగా మేధావులను విద్యావంతులను నియామకం చేసే వారు. రానురానూ ఇది రాజకీయ పునరావాస ప్రక్రియగా మారిపోయి గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా రూపాంతరం చెందారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సార్లు 356 అధికరణ ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షాన్ని విమర్శించిన రాజకీయ పక్షాలు నేడు అధికారంలో కొనసాగుతూ యథేచ్ఛగా తమ ప్రభుత్వం అధికారంలో లేని రాష్ట ప్రభుత్వాలలో రాజ్యాంగ బద్ధ పదవి అయినా గవర్నర్ గిరీని అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలలో లెఫ్టినెంట్ గవర్నర్లను రాజకీయ ఏజెంట్ల గా వినియోగిస్తున్నాయి. తాజాగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన కేరళ,తమిళనాడు తెలంగాణా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలతో గవర్నర్లు గొడవపడే విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. గవర్నరు రాజ్యాంగాధిపతిగా ఉండాలే కానీ, ఎలాంటి పాలనాధికారాలు వారికి ఉండవని రాజ్యాంగం చెపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థ ద్వారా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలో తమ పార్టీ ప్రయోజనాల కోసం రాజ్యాంగ ఆదేశాలను, సంప్రదాయాలను కాలరాస్తోందనే విమర్శలు ఎక్కువ య్యాయి. రాష్ట్రాలలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించ కుండా పెండింగ్‌లో పెట్టడం నేడు సర్వసాధారణమై పోయింది. రాజ్యాంగంపైన ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన కొందరు గవర్నర్లు, వాస్తవ స్థితిలో స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంలోని అధికార పార్టీ ఎజెండాతో వ్యవహరిస్తున్నారనేది సత్యం.
రాష్ట్రాల ఆర్ధిక మూలాలపై దాడి
రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా గతంలో అమ్మకం పన్ను ఉండేది. ఇది రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దానికి బదులుగా నేడు కేంద్రం జిఎస్టి వ్యవస్థలోకి వచ్చేందుకు రాష్ట్రాలను ఒప్పించింది. ఈ జిఎస్టి వ్యవస్థ ప్రధానంగా కేంద్రం డామినేట్ చేసే జిఎస్టి కౌన్సిల్ ఆధ్వ ర్యంలో నడుస్తుంది.
ఇలా జిఎస్టి లోకి మారి నందున రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గనుక తగ్గితే ఆ మేరకు దానిని కేంద్రం భర్తీ చేస్తుందన్న హామీ ఇచ్చి రాష్ట్రాలను ఒప్పించారు. ఇప్పుడు కేంద్రం ఆ హామీని తుంగలో తొక్కింది.ఈ ప్రతిపాద నలకు అంగీకరించిన రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోయాయి.పైగా జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాలకు రావలసిన వాటా గురించి కేంద్రాన్ని అభ్య ర్దించవలసి వస్తున్నది.పైగా అమ్మకం పన్ను వాటా రాష్ట్రాలకు అందించే విషయం నుంచి బయటపడటానికి అమ్మకం పన్నుకు ప్రత్యామ్నాయంగా సెస్‌ను విధించడం మొదలుపెట్టింది. అంతకన్నా ముఖ్యంగా జీఎస్టీ వాటా పంపకం విషయంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో స్పష్టమైన వివక్షత చూపడం మొదలు పెట్టింది. ఇటువంటి సమయంలో ప్రస్తుతం రాష్ట్రాలకు కేవలం మూడే మూడు వస్తువుల పైన తప్ప తక్కిన వేటిపైనా పన్ను విధించే అధికారం లేకుండా పోయింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు వంటిది.
కొరవడిన సహకార స్ఫూర్తి
నేడు కేంద్రం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలుపై, కేంద్ర పెత్తనాన్ని ఎదిరించే వ్యక్తులపై సంస్థలపై దర్యాప్తు సంస్థల ద్వారా చేయించే దాడులు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి కక్షపూరిత వాతావరణంలో రాజ్యాంగస్ఫూర్తి ఎలా కొనసాగగలదు అని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అఖిల భారత సర్వీసుల (క్యాడర్) నిబంధనలు-1954కు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన సవరణలు రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పవచ్చు. ప్రస్తుత నిబంధనలు ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్ఎస్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు పంపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని తప్పనిసరి. అయితే తాజాగా కేంద్రం ప్రతిపాదించిన సవరణలు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, సంబంధిత అధికారుల అభీష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం నేరుగా డిప్యుటేషన్‌పై తీసుకొనేలా ఉన్నాయి. ఇది రాజ్యాంగ స్వరూపానికి, సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. ఈ సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా.. నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రతిపాదనలు క్యాడర్ రూల్స్ మార్చడమే కాదు. కేంద్ర-రాష్ట్రాలకు సంబంధించిన సంబంధాలు విషయంలో రాజ్యాంగాన్ని సవరించడంతో సమానమని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండానే రాజ్యాంగ సవరణ చేయకుండానే ఇలా క్యాడర్ రూల్స్ మార్చే ప్రయత్నానికి సిద్ధమైంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమే.
రాజ్యాంగానికి విరుద్ధ పాలన
దేశంలో ఏ చట్టమైనా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి రూపొందించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం కేశవానంద భారతి కేసులో సుస్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుంది. దేశానికి సర్వోన్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టుకు సైతం సుప్రీం దేశ రాజ్యాంగమే. రాజ్యాంగం పౌరులను సార్వభౌములను చేసింది. భారత పౌరులమైన మేము... అని ప్రారంభించి, తిరిగి దానిని వారికే అందించింది. ఇదీ రిపబ్లిక్ సూత్రం. అదే మన రాజ్యాంగ లక్ష్యం. మన రాజకీయ వ్యవస్థ దీనిని తల్లకిందులు చేసింది. ప్రజలకు బదులు పాలకులే ప్రభువులుగా అధికారం చెలాయిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు సార్వభౌములు కాదు, కేవలం ఓటర్లు మాత్రమే. పాలితులు మాత్రమే. రాజ్యాంగం యథా తధంగా కనిపిస్తున్నా మన ఎన్నికల వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుస్తున్నాయి. రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్ధలు మధ్య స్పష్ట మైన విభజన అధికారాలు తెలిపింది. అయినప్పటికీ నేడు ఈ మూడింటి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరి పరిధిలో ఒకరు జోక్యం చేసుకుంటు న్నారు అనే వివాదాలు తీవ్రం అవుతున్నాయి. దీనికి కొలీ జియం విషయంలో న్యాయశాఖకు శానస నిర్మాణశాఖ మధ్య నలుగుతున్న వివాదం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందనే రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు సవ్యంగా వ్యవహరించకపోతే అది విఫలమవుతుందని, రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు చేసేవారు సజావుగా వ్యవహరిస్తే ఆ రాజ్యాంగం నిలబడుతుందని అంబేద్కర్ ఏనాడో హెచ్చరించారు. మొదటి మాటను నిజం చేసే దిశగా మన రాజ్య వ్యవస్థ పయనిస్తోంది. నేడు దేశంలో నెలకొన్న పరిస్ధితులు దష్టిలో ఉంచుకుని తరచూ చాలా మంది రాజ్యాంగం విఫలమైందంటూ వాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. అయితే వాస్తవంగా చూస్తే రాజ్యాంగం ఏ మాత్రం వైఫల్యం చెందలేదు. మన జాతి నిర్మాతలు మనకు సరైన రాజ్యాంగాన్నే ఇచ్చారు.కానీ దీనిని నిర్వహించడంలో మన పాత్ర మనం పోషించడం లేదు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన విలువలు, హక్కులను కాపాడే బాధ్యత నేతలపై మాత్రమే కాదు దేశ పౌరులు మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు ప్రజాస్వామికవాదులు అందరి పైనా ఉంది. ఈ బాధ్యతలను గుర్తెరిగి రాజ్యాంగబద్ధంగా అందరం కంకణబద్ధులై పనిచేసిన నాడే మన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టిన వాళ్లమవుతాం.
రాజ్యాంగ ఉల్లంఘనలు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా నేటికీ ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు దూరం కావడం విచారకరం. మహిళా సాధికా రత విషయం అయితే చెప్పనవసరం లేదు. మహిళలపై లైంగిక దాడులకుఅంతే లేదు. విభిన్న వర్గాల పట్ల వివక్షత. గ్రామం నుంచి వెలి వేయడం వంటి అవాంఛనీయ సంఘట నలు నేటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ ఒక్క రాజకీయ పక్షానికి కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాజ్యాంగం లో పేర్కొనబడిన సంక్షేమ రాజ్యస్థాపన అనేది రోజురోజుకు కనుమ రుగవుతున్నట్లు అనిపిస్తుంది. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతీ పౌరుడు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. కానీ నేటికి కూడా మతపరమైన దాడులను మనం చూస్తున్నాం. అంతే కాదు తినే ఆహారం మీద ధరించే దుస్తులపై కూడా అంక్షలు విధించే ఘటనలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమే.
ఒకే సంస్కృతి పేరిట భిన్నత్వానికి ప్రమాదం
సమాఖ్య వ్యవస్థ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ కేంద్రీకరణ విధానాలను ప్రవేశపెట్టడం అనేది రాజకీయ ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా, సాంస్కృతిక రంగం, విద్యా రంగంలో సమాంతరంగా నేడు కొనసాగు తున్నాయి. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నాలు బలం పుంజుకుంటున్నాయి. నూతన విద్యావిధానంలో బోధనాంశాలను మొత్తంగా కేంద్రీకృతంగానే నిర్ణయిస్తారు. రాష్ట్రాలను సంప్రదించవలసిన అవసరం లేదు. అందుచేత ఒకే సంస్కృతి పేరుతో బలవంతంగా ఈ దేశంలోని భిన్నత్వాన్ని నాశనం చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. బలవంతంగా పై నుంచి రుద్దే ఏకరూపత వలన మన దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వుంటుంది. వైవిధ్యం కలిగిన ప్రాంతీయ-భాషా చైతన్యాన్ని గనుక ఉపేక్షిస్తే అది ఈ దేశ భవిష్యత్తునే ప్రమాదం లోకి నెట్టడం ఖాయం.
దర్యాప్తు సంస్థలు బలహీనం!
స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మొదలైన దర్యాప్తు సంస్థ లను అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయి. తమను వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలను బల హీన పరిచేందుకు ఒక పద్ధతి ప్రకారం దాడి చేయడానికే ఈ సంస్థలను పూర్తిగా ఉపయోగించుకోవడం ఈ మధ్య కాలంలో మరింత పెరిగిపోయింది. ఒకానొక సమయంలో వీటికి కొంత నిబద్ధత ఉండేది. క్రమేపీ వాటి పని తీరు చూస్తున్న నేపథ్యంలో వీటి నిబద్ధతపై ప్రజలలో కూడా నమ్మకం సడలిపోయింది.
- రుద్రరాజు శ్రీనివాసరాజు,
9441239578